Monday, December 28, 2009

ఆ రాత్రి...


నిన్ను కలిసిన క్షణం...
స్వర్గం నుండి తారల వర్షం కురిసింది
చంద్రుడు వెన్నెల వెలుగులు కురిపించాడు
చల్లటి గాలులు పూల గంధంలా వీస్తున్నాయి
అంతా అందమైన కలలా... నమ్మలేని నిజంలా ఉంది!

కానీ ఉన్నట్టుండి...
ఒక్కసారిగా తుఫాను మొదలైంది
చంద్రుడు మబ్బుల చాటుకు మరుగైపొయాడు
ఎటు చూసినా కటిక చీకటి!
అదొక భయంకరమైన రాత్రిలా మారింది!

ఏదో పోగొట్టుకున్న భావన...
ఏదో తెలియని బాధ...

దూరంగా వెలుగు కనిపిస్తోంది...
మెల్లిగా తెల్లవారుతోంది...
తెరిచిన కనురెప్పల వెనుక.. కల కరిగిపోయింది!


Note: ఇంటర్నెట్ లో చదివిన ఒక ఆంగ్ల కవిత ప్రేరణతో...

Monday, December 21, 2009

♪♪ memories ♫


May memory restore again and again
The smallest color of the smallest day:
Time is the school in which we learn,

Time is the fire in which we burn.


~ Delmore Schwartz ~ (born 8 December 1913)

Friday, September 11, 2009

ఈరోజేమైంది?



ఎందుకు ఇంత దిగులు...
దేనికి ఇంత బెంగ...
అన్నిటి మీదా ఆసక్తి కోల్పోయి...
ఎందుకింత నిర్లిప్తత?
ఏదో కోల్పోయినట్టు ఎందుకింత నిరాశ?
నిన్నటిదాకా బాగానే ఉందిగా...
ఈరోజేమైంది?
నిన్నటికి, ఈరోజుకి తేడా ఏముంది?
అన్నీ నిన్నటిలాగానే జరుగుతున్నాయి...
నువ్వూ నిన్న ఉన్నట్టుగానే ఉన్నావు...
మరి నేనెందుకు అలా లేను?
ఏం జరుగుతుంది నాలో?

Wednesday, August 26, 2009

ఓ వర్షం కురిసింది...



ఓ వర్షం కురిసింది...
గతం పెరటిలో పాతిపెట్టిన జ్ఞాపకాలు కొద్ది కొద్దిగా బయటపడ్డాయి!
వర్షం వెలిసింది...
జ్ఞాపకాల శిధిలాలు కళ్ళ ముందు మిగిలాయి!

Saturday, July 18, 2009

***** రాగం *****

జోరున కురిసే వర్షం ...
దుడుకుగా దూకే జలపాతం ...
వేల చుక్కల మధ్యలో చిక్కిన నెలవంక ...
అందమైన సూర్యాస్తమయం ...
రంగు రంగుల హరివిల్లు...

ఇవన్ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? అసలు ఏమైనా అనిపిస్తుందా?
మనం వాటి అందాన్ని 'చూస్తూ' ఎంజాయ్ చేస్తాం... కానీ వాటిని 'చూడగలుగుతున్నందుకు' ఎప్పుడైనా సంతోషించామా?

ఈ అందాలేవి చూడలేని... వాటిని ఆనందించలేని వాళ్ళు మన మధ్యలోనే ఎంతోమంది ఉన్నారు...
కానీ వాళ్ళేమి మనకంటే తక్కువ కాదు... ఎందులోనూ కాదు...
ఇంకా చెప్పాలంటే మనమే వాళ్ళకంటే ఎన్నో విషయాల్లో తక్కువ!
వాళ్ళు ఈ లోకాన్ని మనలాగా కళ్ళతో చూడలేకపోవచ్చు... కానీ అన్నిటిని తమ 'సెన్సెస్' తో గెలవగలరు...

అలాంటి ప్రతిభని అందరికీ చూపించాలనే ఉద్దేశంతో 'సహాయ ఫౌండేషన్' ఒక ఈవెంట్ జరుపుతుంది...
వివరాలు:

ఈవెంట్: 'రాగం' - a musical event by visually challenged

స్థలం: హరిహరకళాభవన్, సికందరాబాద్

సమయం: 6 30 PM, 8th ఆగష్టు

టికెట్స్: Rs. 100 , Rs. 200 , Rs. 500 & Rs. 1000

కాంటాక్ట్: onlychaitu@gmail.com

9000344644 (కిరణ్)
9989057887 (బాలచంద్ర)
9177093999 (శ్రీనివాస్)



మన సానుభూతి ఏమి వాళ్ళకి అవసరం లేదు... వాళ్ళ ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తే చాలు...
మన మొత్తం జీవిత కాలంలో... వారి కోసం... ఒక సాయంత్రం... ఓ మూడు గంటలు కేటాయించలేమా?
ఒక పూట విలాసంగా బయట భోజనానికి చేసే ఖర్చు... వీరి కోసం ఖర్చు పెట్టలేమా?

ఇది మనం చేసే త్యాగం కాదు... సహాయం అంతకంటే కాదు... ఇది మన బాధ్యత.

కొన్ని క్షణాలు ఆలోచించండి...
కొన్ని గంటలు కేటాయించండి...
కొన్ని కళ్ళల్లో వెలుగు నింపండి!!

***

మీరు ఈవెంట్ కి రాలేకపోయినా కూడా టికెట్ కొనడం ద్వారా సపోర్ట్ చేయవచ్చు.

Friday, June 5, 2009

ప్రపంచ పర్యావరణ దినోత్సవం


ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'మన' ఉనికిని కాపాడుకోవటానికి కొన్ని టిప్స్:

ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం వీలైనంతవరకు తగ్గించాలి.
షాపింగ్ కి వెళ్ళేప్పుడు క్లాత్ బ్యాగ్ ని తీసుకువెళ్ళాలి.


మొక్కలు నాటాలి.
మొక్కలకి నీరు ఉదయం కాని, సాయంత్రం చల్లబడ్డాక కానీ పోయాలి... అప్పుడైతే ఎక్కువ శాతం నీరు ఆవిరి కాకుండా మొక్కలకి అందుతుంది.


నీరు ఆదా చేయాలి.
అనవసరంగా నీరు వృధా చేయకూడదు.
ఇంట్లో టాప్స్ లీకేజ్ లేకుండా ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ ఉండాలి.
నిలువ ఉన్న నీరు వృధాగా పారబోసే బదులు... మొక్కలకి పోయాలి.


పెట్రోల్ వినియోగం తగ్గించాలి. కాలుష్యాన్ని నియంత్రించాలి.
బండిలో పెట్రోల్ ఉదయం పూట పోయించుకోవటం మంచిది. దానిద్వారా మైలేజ్ పెరుగుతుంది.


పవర్ / కరెంటు ఆదా చేయాలి. గ్లోబల్ వార్మింగ్ ని నియంత్రించాలి.



ఇవన్నీ 'మనం' చేయగలిగినవే. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించటం ద్వారా ఎంతో తేడా వస్తుంది.
ఇది 'మన' కోసం 'మనం' చేస్తున్నది... చేయవలసింది.


Note: Pictures taken from Internet.

Monday, June 1, 2009

ఊహలకే రెక్కలు వస్తే...

గమనిక: ఇది నా సొంత రచన కాదు. ఏదో సైటులో చదివిన జోక్(?!) కి నా పైత్యం కాస్త జోడించి రాసింది.

***

ఒకతను సూపర్ మార్కెట్ నుండి బయటకి వస్తుండగా ఒక అందమైన అమ్మాయి ఎదురుగా వచ్చి నవ్వుతూ పలకరించింది...
"Good evening"
అతను 'ఎవరు మీరు' అన్నట్టు చూసాడు...

అప్పుడు ఆ అమ్మాయికి అర్థమైంది పొరపాటు జరిగింది అని...
"క్షమించండి... మిమ్మల్ని మొదట చూడగానే మీరు నా పిల్లల్లో ఒకరి తండ్రిలా అనిపించారు" అని సారీ చెప్పేసి వెళ్ళిపోయింది.

అతనికి కొతసేపు ఏమి అర్థం కాలేదు... అలాగే షాక్ తో నిల్చుండిపోయాడు.

అతని మనసులో రకరకాల ఆలోచనలు...

"ఏంటిది... మరీ లోకం ఇలా తయారైంది... ఒక అమ్మాయి తన పిల్లల తండ్రి ఎలా ఉంటాడో కూడా మర్చిపోయిందా!"

అలా అనుకుంటూనే... ఒక్క క్షణం అతనికి కొంచం ఆనందంగా కూడా అనిపించింది... తను ఆ అందమైన అమ్మాయికి ఉన్న సంబంధాల్లో ఒకరిలా అనిపించినందుకు!

ఒకసారి చుట్టూ చూసుకున్నాడు... ఆమె అలా అనటం ఎవరూ గమనించలేదు కదా అనుకుంటూ...

ఒక్క క్షణం మళ్లీ ఒక ఆలోచన వచ్చింది అతని మనసులోకి... "ఒకవేళ నిజంగానే ఒకప్పుడు అతనికి ఆమెతో సంబంధం ఉందా? నిజంగానే తన పిల్లలకి తండ్రా?"

ఇలా రకరకాల ఆలోచనలతో అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

కానీ... అతనికి ఒక విషయం మాత్రం తెలియలేదు...
ఆ అమ్మాయి అదే కాలనీలో ఉన్న ఒక ఎలిమెంటరీ స్కూల్ లో నర్సరీ పిల్లలకి టీచర్ అని!

Sunday, May 10, 2009

అమ్మ

"కరుణా... టీ పెట్టివ్వు"
"అమ్మా... నా టవల్ ఎక్కడ?"
"మమ్మీ... నాకు నిమ్మరసం చేసివ్వు"
..
"అమ్మా... నా చున్నీ ఏది... ఆఫీసు కి టైం అవుతుంది"
"మమ్మీ... టిఫిన్ రెడీ ఐందా"
..
"బాక్స్ కట్టావా అమ్మా? ఆఫీసు టైం ఐపోయింది"
..
"కరుణా... టిఫిన్ పెట్టటానికి ఎంతసేపు?"
......

ఇవీ మా ఇంట్లో పొద్దున్నే వినిపించే డైలాగులు... నాన్నగారికి, నాకు, అన్నకి అమ్మ లేకపోతే ఒక్క క్షణం కూడా గడవదు...
అమ్మ రెండు రోజులు ఊరెళ్తే... అవి మాకు రెండు యుగాల్లాగా గడుస్తాయి...

అమ్మ కేమైనా నాలుగు చేతులిచ్చాడా ఆ దేవుడు... అని అనుమానం వస్తుంది అప్పుడప్పుడు...
రోజు అన్ని పనులు ఒక్కత్తే ఎలా చేస్తుంది... తనకి విసుగు రాదా రోజు అవే పనులు చేయటానికి... వారంలో రెండు సెలవులు ఉండే మా పనే మాకు అప్పుడప్పుడు బోర్ గా అనిపిస్తుందే... మరి అసలు సెలవే లేని అమ్మకి బోర్ అనిపించదా ఈ పనులు చేయటానికి!?

అమ్మకి ఆదివారం లేదు... పండగ సెలవు లేదు... వేసవి సెలవులు లేవు... అయినా అమ్మకి విసుగు రాదు.
చిన్నపనిలో ఉన్నప్పుడు ఎవరైనా పిలిచినా ఎంత చిరాకు వస్తుందో నాకు... మరి ఎన్ని పనులు చేస్తున్నా... "అమ్మా నాకు అది కావాలి" అని అడిగితే చాలు... ఏమాత్రం చిరాకు పడకుండా నవ్వుతూ చేసిపెడుతుంది!
అమ్మకి అంత ఓపిక, సహనం ఎలా వచ్చాయి!?

అమ్మంటే అదేనేమో!

అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.... ఇంకా ఏదో మిగిలిపోయినట్టు అనిపిస్తుంది...
అమ్మ గురించి అంతా వివరంగా చెప్పాలంటే అది "అమ్మ" అనే ఒక్క పదానికే సాధ్యం!

Happy Mothers' Day అమ్మ :)

Monday, April 20, 2009

ఇలా చేస్తే!? - 2

మనకి ప్రస్తుతం ఉన్న సమస్యల్లో అతి ముఖ్యమైనది.... మన environment కాపాడుకోవటం...
రకరకాల కాలుష్యాల కారణంగా మన తర్వాతి తరాల మనుగడ కుడా ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి వచ్చింది.
అన్నిటికి మనం పరిష్కారం చూపించలేకపోయినా.... కొన్ని విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించొచ్చు.

ప్లాస్టిక్ సంచుల వాడకం ఎంత ప్రమాదకరమైనదో... దాని వలన వాతావరణం ఎంతగా పాడైపోతుందో... మనలో చాలా మందికి తెలుసు. కాని దాన్ని తగ్గించటానికి మనమేం చేస్తున్నాం? అసలేమైనా చేస్తున్నామా?

చిన్నతనంలో ఏ షాప్ కి వెళ్ళినా ఒక బాస్కెట్ పట్టుకుని వెళ్ళినట్టే గుర్తుంది నాకు. కూరగాయలైనా, సరుకులైనా అన్నీ తీసుకెళ్ళిన బాస్కెట్ లేదా బ్యాగ్ లో తెచ్చుకునేవాళ్ళం.
నెమ్మదిగా ప్లాస్టిక్ కవర్స్ usage మొదలైంది... అవి కుడా మొదట్లో డబ్బులు తీసుకుని కవర్స్ ఇచ్చేవారు... డబ్బులెందుకులే పెట్టటం దానికోసం అని అప్పట్లో కుడా బ్యాగ్ లే తీసుకెళ్ళేవాళ్ళం.
కానీ నెమ్మదిగా ఈ ప్లాస్టిక్ కవర్స్ వాడకం బాగా పెరిగిపోయింది... ఎక్కడికి వెళ్ళినా కవర్స్ ఊరికే ఇవ్వటం కుడా దీనికి ఒక కారణం అనుకుంటున్నాను.
కొంతమంది పెద్దవాళ్ళయితే... కొన్ని షాప్స్ కి వెళ్ళినప్పుడు అడిగి మరీ కొన్ని కవర్స్ ఎక్కువ తీసుకుంటారు కూడా!

ఈ కవర్స్ వాడకం ఎంత ప్రమాదకరమైనదో... అందరికీ ఇంకా పూర్తిగా తెలీదు. దీనిగురించి సరైన అవగాహన కూడా ఎంతో మందిలో లేదు.
వీటి వాడకం ఎలా తగ్గించాలో అని ఒక ఫ్రెండ్ తో కలిసి discuss చేసినప్పుడు మాకు తట్టిన కొన్ని పాయింట్స్:

-> ఏ షాప్ లో కూడా కవర్స్ ఊరికే ఇవ్వకూడదు
-> ప్రతి షాప్ లోను కవర్స్ బదులుగా క్లాత్ బ్యాగ్ ఇవ్వాలి (ఇప్పటికే కొన్ని షాప్స్ లో ఇలా చేస్తున్నారు)
-> ఆ షాప్ కి ఇంకొకసారి వెళ్ళినప్పుడు మనం ఆ క్లాత్ బ్యాగ్ తీసుకెళ్తే ఆ షాప్ వాళ్ళు ఎంతోకొంత డిస్కౌంట్ ఇచ్చేలా ఉండాలి
-> ప్రస్తుతానికి ఇది ఒక్కో షాప్ కి విడివిడిగా చేసినా... ముందు ముందు ఒక సెంట్రల్ డేటాబేసు పెట్టి... ఏ షాప్ కైనా బ్యాగ్ ఒకటే ఉండేలా చూడాలి... అంటే ఒక షాప్ లో ఏదైనా కొన్నప్పుడు వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తే... మనం ఆ బ్యాగ్ తీసుకుని ఇంకే షాప్ కి వెళ్ళినా మనకి కొంత డిస్కౌంట్ లభించాలి. (ఇది ఎంత వరకు ఆచరణ సాధ్యమో సందేహమే)

ఇవన్నీ షాప్స్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే... మనం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి...
-> ఎక్కడికి వెళ్ళినా ఒక క్లాత్ బ్యాగ్ దగ్గర ఉంచుకోవాలి. ఏది కొన్నా ఆ బ్యాగ్ లోనే తెచ్చుకోవాలి... కవర్ ఇచ్చినా వద్దు అని చెప్పాలి.
-> చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఈ కవర్స్ వాడకం ఎంత ప్రమాదకరమైనదో వివరించి చెప్పాలి.
-> ఇరుగు పొరుగు వాళ్లకి ఒక క్లాత్ బ్యాగ్ ఇచ్చి, వాళ్ళని కూడా ప్లాస్టిక్ కవర్స్ వాడటం తగ్గించమని చెప్పాలి.
-> కొన్నాళ్ళ క్రితం ఎలా అయితే మార్కెట్ కి బాస్కెట్ తో వెళ్ళేవాళ్ళమో అలా ఇప్పుడు కూడా బాస్కెట్ తీసుకుని వెళ్ళాలి.
-> ఎగ్గ్స్ తెచ్చుకోవటానికి ఒకప్పుడు వాడిన బాక్స్ లాంటివి వాడాలి.

ఇవన్నీ మనం చేయగలిగినవే... ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే... ప్లాస్టిక్ కవర్స్ వాడకం చాలా వరకు తగ్గుతుందని నా అభిప్రాయం.

Wednesday, April 15, 2009

పార్టీ చూసి వోట్ వేయాలా? అభ్యర్ధిని చూసి వేయాలా?



నిన్న సాయంత్రం టీవీలో ఎన్నికల వార్తలు చూస్తుంటే... అమ్మ వచ్చి 'మనం వోట్ ఎలా వేయాలి' అని అడిగింది. 'అదేం ప్రశ్న... ఇప్పటికి ఎన్నిసార్లు వేసావ్... మొన్న కుడా వేసాం కదా' అన్నాన్నేను (PJR పోయినప్పుడు అసెంబ్లీ ఎలెక్షన్ జరిగింది కదా)
'అది కాదు వోట్ వేయటానికి... మజారాజ్యం పార్టీ వాళ్ళు, భారతీయ ఉడతా పార్టీ వాళ్ళు చిట్స్ తెచ్చి ఇచ్చారు కాని... కంగారుస్ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు... మరెలా ఒటెయ్యాలి' అని అడిగింది అమాయకంగా.
'అది కాదమ్మా... అవి ఎవరు ఇస్తే వాళ్ళకే వోట్ చేయాలనీ కాదు... అవి పట్టుకెళ్ళి ఎవరికైనా వోట్ చేయొచ్చు' అని చెప్పా.
'ఒహో అలాగా' అంటూ అక్కడి నుండి వెళ్లిపోబోయింది.
అంతలో నాకేదో బల్బు వెలిగింది... అమ్మని ఆపి... 'అంటే నువ్వు కంగారుస్ పార్టీ కి వేస్తున్నావా వోట్?' అని అడిగాను.
ఏంటి కొత్తగా అడుగుతున్నావ్ అన్నట్టు నావైపు చూసి... ' అంతే కదా మరి' అంది.
'అది కాదమ్మా... ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు... ఇప్పుడు 'జన సత్తా' పార్టీకి వేయమ్మా' అని చెప్పాను.
'అదేం కుదరదు... నాకు వోట్ హక్కు వచ్చినప్పటి నుండి నేను కన్గారూస్ పార్టీ కే వేసాను... ఇప్పుడూ అంతే' అంది మొండిగా.
'అదేంటమ్మా... అప్పుడు ఉన్న పార్టీ జనాలు ఇప్పుడు ఉన్నారా... అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా... పార్టీ పేరు ఉంది కాని... జనాలంతా మారిపోయారు కదా' అన్నాను
'అదంతా నాకు తెలిదు... నేను కన్గారూస్ పార్టీ నే' అంది... తను పట్టిన కంగారుకి మూడే కాళ్ళు అన్న రీతిలో.
ఇంకా తనతో ఎంత వాదించినా ప్రయోజనం లేదని అర్థమైపోయింది.
'సరే నీ ఇష్టం... ఎప్పుడైనా చదువుకున్న వాళ్లకి వోట్ వేయాలి... అంతే కాని పార్టీ చూసి కాదు' అని చెప్పాను.
'...' తన వైపు నుండి మౌనం.
అది నే చెప్పినదానికి అంగీకారమో... నేను మారను అన్న మొండితనమో నాకు అర్థం కాలేదు!

***
నా అభిప్రాయం ప్రకారం అభ్యర్ధిని చూసి... అతను ఎలాంటి వాడో తెలుసుకుని... అతనికి కనీస అర్హత(చదువు) ఉందొ లేదో తెలుసుకుని వోట్ వేయాలి కానీ... ఇలా పార్టీని చూసి కాదు.
ఒక పార్టీలో అందరు మంచివారే , చదువుకున్నవారే ఉంటారా? మరి అలా ఉండనప్పుడు పార్టీని చూసి ఎవరికంటే వారికి వోట్ చేయలేము కదా!

అలా ఆలోచిస్తుంటే మెదడులో ఇంకో బల్బు వెలిగింది...
మరి జన సత్తా పార్టీలో అభ్యర్దులు ఎవరో అసలు ఎంతమందికి తెలుసు? మా నియోజకవర్గంలో అంటే జన సత్తా నాయకుడే నిలబడ్డారు కాబట్టి... ఆయన గురించి తెలుసు కాబట్టి వోట్ చేస్తాం. మరి మిగత నియోజక వర్గాల సంగతి ఏంటి? అప్పుడెప్పుడో 'జీడిపప్పు' గారు అన్నట్టు... ముక్కు మొహం తెలియని అభ్యర్దికి వోట్ ఎలా వేస్తారు. అలా వేస్తే... ఇక్కడ కుడా పార్టీని చూసి వేసినట్టే కదా!

అంటే ఇప్పుడు పార్టీని చూసి వోట్ వేయాలా? లేక అభ్యర్థిని చూసి వేయాలా?

(నేనయితే ప్రస్తుతానికి రెండూ చూస్తున్నాను... అసెంబ్లీకి అభ్యర్థిని చూసి... పార్లమెంటుకి పార్టీని చూసి (అభ్యర్ది గురించి కూడా కొంచం తెలుసుకున్నానులెండి) వేయబోతున్నాను)

picture courtesy: internet

Tuesday, April 14, 2009

Monday, April 13, 2009

Be an Indian

ఒక అమెరికన్ ఇండియా సందర్శించి మళ్లీ అమెరికా తిరిగి వెళ్ళాడు.

అక్కడ అతని ఇండియన్ స్నేహితుడు ఒకతను "మా ఇండియా ఎలా ఉంది?" అని అడిగాడు.

అమెరికన్ ఇలా చెప్పాడు "అది నిజంగా చాలా గొప్ప దేశం. చాలా ప్రాచీనమైన చరిత్ర, మంచి మంచి వనరులు కలిగి ఉంది. "

అప్పుడు ఇండియన్ ఇలా అడిగాడు సంతోషంగా "మరి మా ఇండియాన్స్ ఎలా అనిపించారు?"

దానికి ఆ అమెరికన్ సమాధానం... "ఇండియాన్సా? నాకెవరూ కనిపించలేదే?
కాశ్మీర్ లో ఒక కాష్మిరిని కలిసాను.
పంజాబ్ లో ఒక పంజాబిని కలిసాను.
బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్ లో ఒక బీహారిని, మరాఠిని, తమిళియన్ ని, బెంగాలీని కలిసాను.
తర్వాత... ఒక ముస్లిం ని, క్రిస్టియన్ ని, జైన్ ని, బుద్దిస్ట్ ని కలిసాను.
ఇంకా ఇలా చాలా మందిని కలిసాను... కానీ ఎక్కడా ఒక ఇండియన్ ని కలవలేదు!

PS: ఓ ఈ-మెయిల్ ఆధారంగా...

***

మనం అందరం indians అనిపించుకోవాలంటే... ప్రాంతీయాభిమానం, కులాభిమానం, మతాభిమానాలకి అతీతంగా మన ఓటు వేయాలి...!

Be an Indian.

Sunday, April 12, 2009

ఇలా చేస్తే!? - 1

మన దేశంలో కావలసినన్ని సమస్యలున్నాయి... అన్నిటికి పరిష్కారం ఉందో లేదో నాకు తెలీదు కానీ... నా చిన్ని మెదడులోకి వచ్చిన కొన్ని ఆలోచనలు చెప్పాలనుకుంటున్నాను.

***

మనలో దాదాపు అందరూ రోజూ ఎదుర్కొనే సమస్య... గతుకుల, గుంటలు పడిన రోడ్లు.

అదేంటో గాని... ఇలా మన R&B వాళ్ళు రోడ్లు వేయగానే... అలా మన టెలికాం శాఖా వారికో, మున్సిపాలిటీ వారికో, మరోకరికో సడన్ గా లైట్ వెలుగుతుంది. వెంటనే పారలు, పలుగులు పట్టుకుని రెడీ అయిపోతారు... వేసిన రోడ్డు త్రవ్వటానికి.
ఎప్పుడో విన్నాను... అలా ఎవరైనా రోడ్డు త్రవ్వితే మళ్లీ ఆ రోడ్డుని అలాగే బాగుచేసి వేయాలి అనే రూల్ ఏదో ఉంది అంట... కానీ నేనెప్పుడు ఎక్కడా అలా త్రవ్వేసిన రోడ్డుని వాళ్ళే బాగుచేసి వేయటం చూడలేదు మరి! మహా అయితే ఏదో దయ తలచి అలా పై పైన పూడ్చేసి వెళ్ళిపోతారు అంతే. మరి ఆ సంబంధిత అధికారులు త్రవ్వటానికి పర్మిషన్ ఇస్తారు కానీ ఇలా తర్వాత వాళ్ళు ఆ రోడ్ బాగు చేసారా లేదా అనేది ఎందుకు పట్టించుకోరో ఏంటో!
ఇంకా... ఎంతో ఖర్చు పెట్టి హుంగామాగా రోడ్లు వేస్తారు... అవేమో ఒక్క వర్షం రాగానే ఠపీమని కొట్టుకుపోతాయి.

ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే... రోడ్లు అలా ఒకే దెబ్బకి పాడైపోకుండా గట్టిగా ఉండాలంటే ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే... ఇప్పుడు రోడ్లు వేయటానికి కాంట్రాక్టు ఎవరో ఒకరికి ఇస్తారు కదా... వాళ్ళేమో డబ్బంతా తినేసి నాసి రకం రోడ్లు వేస్తారు. అలా కాకుండా... వేసిన రోడ్డుకి minimum గారెంటీ ఇవ్వాలి ఆ కాంట్రాక్టర్. అంటే ఉదాహరణకి ఒక సంవత్సరమో, రెండు సంవత్సరాలో లేక అయిదు సంవత్సరాలో... దాని పరిమితిని బట్టి.
ఈలోగా కనుక ఆ రోడ్డు పాడైపోయిందంటే ఆ కాంట్రాక్టర్ మొత్తం ఖర్చు భరించి మళ్లీ రోడ్డు వేయించాలి.
ఇలా చేస్తే చచ్చినట్టు మంచి రోడ్లు వేస్తారని నా ఆలోచన.
ఇంకా రోడ్లు త్రవ్వమని పర్మిషన్ ఇచ్చిన అధికారే ఆ రోడ్లు మళ్లీ బాగుచేసారా లేదా అనేది చూసుకోవాలి. ఆ త్రవ్విన వాళ్ళు మళ్లీ రోడ్లు వేయలేదంటే... ఆ అధికారి వేయించాల్సి ఉంటుంది.

ఈ విషయాల్లో కాస్త స్ట్రిక్ట్ గా ఉండగలిగితే... మనకి మంచి రోడ్లు వస్తాయని నా ఆలోచన.

మరి మీరేమంటారు?

Thursday, April 9, 2009

Colors of India



medium: watercolors

Tuesday, April 7, 2009

తెలుగులో కొత్తపదాలు ఇష్టపడే వారికి...

ఈ పోస్టు అంకితం :D

గమనిక: ఈ పోస్టు ఎవరినీ ఉద్దేశించి, ఎవరినీ కించపరచటానికి రాసింది కాదు. కేవలం సరదాగా రాసింది. మరోలా భావించవద్దని మనవి.

అదొక ఆదివారం... అందమైన సాయంత్రం... కాకపోతే కాస్త గాలిదుమ్ము...
ఏదో పని మీద (నిజానికి బండి మీద) అబిడ్స్ వెళ్లాను ఒక ఫ్రెండ్ తో కలిసి. అక్కడ మేము వెళ్ళిన పని కావటానికి కొంత సమయం వెయిట్ చేయాల్సి వచ్చింది. సరే ఈలోగా అందమైన (ఇరుకైన) అబిడ్స్ వీధుల్లో (సందుల్లో) అలా తిరిగి వద్దామని... వ్యాహ్యాళికి వెళ్ళాము (వ్యాహ్యాళి అంటే తెలీకపోతే జంధ్యాల గారి "చూపులు కలిసిన శుభవేళ" సినిమా చూడండి).

అబిడ్స్ జగదీష్ మార్కెట్ కి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళకపోతే ఒకసారి తప్పకుండా వెళ్ళండి... హైదరాబాద్ లో చార్మినార్ తర్వాత చూడదగ్గ గొప్ప ప్లేస్ అది. మీ జేబుకి తెలీకుండా మీ మొబైల్ కొట్టేసి మీకే అమ్మగల ఘనులుంటారు!
ఆ జగదీష్ మార్కెట్ పక్క వీధుల్లో అలా నడుస్తూ వెళ్తుంటే నా ఫ్రెండ్ సడన్ గా ఆగిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు. ఎంటా అంత వింతైన విషయం అని నేను కుడా చూసాను. నేను కుడా అలాగే చూస్తుండిపోయాను. కొన్ని క్షనాలయ్యాక ఇద్దరం ఒకరినొకరం చూసుకున్నాం. ఇలా చుసుకోవటాలన్నీ అయిపోగానే... వెంటనే మొబైల్ బయటకి తీసి ఆ దృశ్యాన్ని బంధించాము.

అక్కడ మేము చూసింది... ఇక్కడ మీరు చూడండి...


ఇప్పుడు అర్థమయిందా ఈ పోస్టు తెలుగులో కొత్త పదాలు ఇష్టపడే వారికి ఎందుకు అంకితం చేసానో :P

Friday, April 3, 2009

నేను ఖండిస్తున్నాను!

అవును... నేను ఖండిస్తున్నాను. మాములుగా కాదు... తీవ్రంగా.
ఇంతకీ దేన్ని ఖండిస్తున్నానో చెప్పలేదు కదూ...
ఒక విషయంలో తరతరాలుగా ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని.
ఆ విషయం ఏంటంటే... ఒక అమ్మాయిని చూడగానే ఆమెకి పెళ్లి అయిందో లేదో చాలా తేలిగ్గా చెప్పేయొచ్చు. కాని ఒక అబ్బాయిని చూసి అలా చెప్పగలమా!
ఇది ఆడవాళ్లకు ఎంత పెద్ద అన్యాయం!?
అబ్బాయిలకి ఒక అమ్మాయి నచ్చిందంటే... కాలు వేలు చూసో, పాపిట్లో సింధూరం చూసో, మెడలో తాళి చూసో ఆమెకి పెళ్లి అయిందో లేదో confirm చేసేసుకుంటారు.
కానీ అమ్మాయిలకి ఆ ఫెసిలిటి లేదు! అబ్బాయి నచ్చినా... అతనికి పెళ్లి అయిందో లేదో తేలిక... ఎందుకొచ్చిన గొడవలే అని వదిలేయాల్సి వస్తుంది. అంతే కాదు... వాళ్ళకి పెళ్లైందని చెప్పే గుర్తులేమి లేకపోవటం వలన... ఈ మగాళ్ళంతా పెళ్ళయ్యాక కుడా వెర్రి వేషాలు వేసే అవకాశం ఇచ్చినట్టవుతుంది. హుహ్... ఇది అన్యాయం కాదా!
ఈ అన్యాయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

అబ్బాయిలకి కూడా పెళ్లి అయింది అని చెప్పటానికి ఏదో ఒక గుర్తు ఉండాలి. మొన్నామధ్య వరకు బట్ట తల ఉంటే... వాళ్ళకి పెళ్లి అయింది అనుకునే వాళ్ళం (భార్య చేతిలో పడి జుట్టు ఊడిపోతుంది కదా). కానీ ఇప్పుడు అది కుడా కన్ఫ్యూజనే... ఇప్పుడు బట్టతల అందరికి వచ్చేస్తుంది కదా మరి...!
కాబట్టి నే చెప్పొచ్చేది ఏంటంటే... పెళ్ళయిన మగాళ్ళకి కూడా ఏదో ఒక గుర్తు ఉండాలి ఆ సంగతి తెలియటానికి.
కొన్ని దేశాల్లో అయితే... పెళ్లి ఉంగరం పెట్టుకోవటం అనేది ఒక సెంటిమెంట్... అది చూసి ఇట్టే చెప్పేయొచ్చు అతనికి పెళ్ళైపోయింది అని. కానీ మన దగ్గర అదేమీ compulsory కాదు కదా!

ఈ మధ్య టీవీ లో 'భరణి' సినిమా చూసాను. అందులో ప్రభుకి నదియా కాలికి మెట్టెలు పెడుతుంది... ప్రభు పెళ్ళయిన వాడని... అతని వంక అమ్మయిలెవరు తప్పుగా చూడకూడదు అని. అదేదో బాగానే ఉంది అనుకున్నా కానీ... అదంటే సినిమా కాబట్టి ఏం మాట్లాడకుండా పెట్టుకున్నాడు ప్రభు... బయట ఏ అబ్బాయి అలా పెట్టుకుంటాడు.
అసలు ఈ పద్దతులన్నీ కనిపెట్టింది కుడా మగాళ్ళే... అందుకే వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా చూసుకున్నారు... స్వార్థపరులు..హుహ్.

అందుకే నే చెప్పేదేంటంటే... పెళ్ళయిన అబ్బాయిలని గుర్తించేలాగా ఏదో ఒక గుర్తు ఉండాలి... అది కాలి మెట్టైనా కావొచ్చు... చేతి ఉంగరమైనా కావొచ్చు... మరేదైనా కావొచ్చు.
"మార్పు మార్పు" అని మొత్తుకుంటున్న మజా రాజ్యం పార్టీ వాళ్ళు ఈ విషయంలో కుడా "మార్పు" తేవాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను.
అసలే ఇది ఎన్నికల టైం కదా... ఇప్పుడైతేనే ఇలాంటివి బాగా వర్కౌట్ అవుతాయి... కాబట్టి అమ్మాయిలూ... ఇక మొదలెట్టండి... రాస్తా రాకో చేసైనా... అవసరమైతే నిరాహార దీక్ష కుడా చేసైనా... ఎలాగైనా ఈ విషయంలో మనకి న్యాయం జరిగేలా పోరాడాలి.
అప్పటి వరకు తర తరాలుగా జరుగుతున్న ఈ ఘోరమైన అన్యాయాన్ని నేను ఖండిస్తూనే ఉంటాను!

Monday, March 30, 2009

కుడి ఎడమైతే... పోరపాటేనోయ్!!

గమనిక: ఇది ఎప్పుడో ఎక్కడో చదివిన చిన్న జోకుకి నా పైత్యం జోడించి రాసిన కథ.

సాయంత్రం అయిదైంది.
బుచ్చిబాబు watch వంక చూసి వెంటనే ఫైల్స్ అన్ని మూసేసి ఇంటికి బయల్దేరాడు.
ఇంటికి రాగానే బాగా అలసిపోయినట్టు వేలాడపడిపోయి... సోఫాలో కూర్చుని "కాఫీ" అని ఆర్డర్ చేసాడు.
రెండు నిముషాల్లో కాఫీతో ప్రత్యక్షమైంది బుచ్చిబాబు భార్య భాగ్యం(భాగ్యలక్ష్మి కి బుచ్చిబాబు పెట్టుకున్న ముద్దుపేరు).
కాఫీ అందుకుని తాగుతున్నాడు బుచ్చిబాబు.
"దేశం లో పని మొత్తం మీరొక్కరే చేసి వచ్చినట్టు... అంత పోసు కొట్టాల" అంది భాగ్యం.
అసలే తనేదో బాగా కష్టపడిపోతున్నా అన్న ఫీలింగ్ లో ఉన్న బుచ్చిబాబుకి భాగ్యం మాటలతో చిర్రెత్తుకొచ్చింది.
"కష్టం కాకపోతే మరేమిటి... ఎప్పుడో పుద్దున్నే 10 గంటల కల్లా వెళ్ళాలా ఆఫీసుకి... మళ్లీ ఎప్పుడో సాయంత్రం 5 గంటలకి గాని ఇంటికి రాలేను... ఇంత గొడ్డు చాకిరి చేస్తుంటే... నీకది కష్టంలా కనిపించటంలేదా" అని గయ్ మన్నాడు.
"అబ్బో ఇదీ ఒక కష్టమేనా... ఉదయం నుండి సాయంత్రం దాకా ac లో కూర్చోటమేగా మీరు పొడిచేసే పని" అంది భాగ్యం దెప్పుతున్నట్టు.
"కష్టం అంటే మాది... ఉదయం నుండి గొడ్డు చాకిరీ చేయాలి ఇంటిల్లపాదికి... " అంది మళ్లీ తనే.
"ఆహ... ఏంటో మీరు పడే ఆ కష్టం... ఏవో రెండు కూరగాయలు అలా తరిగేసి కూర చేయటం... రెండు గిన్నెలు తోమటం... అంతే కదా... ఆ చిన్న పనులన్నీ ఉదయమే 11 గంటలకల్లా అయిపోతాయి... తర్వాత మొత్తం ఆ టీవీ లో వచ్చే ఏడుపుగొట్టు సీరియల్స్ చూడటమేగా మీరు పడే కష్టం" అని వాదనకి దిగాడు బుచ్చిబాబు.
"ఏంటి అంత తేలికగా ఉందా మీకు ఇంటి పని అంటే... చేస్తే తెలుస్తది... అది ఎంత కష్టమో... ఊరికే మాటలు చెప్పటం కాదు"
"ఆ పని చేయటం కూడా పెద్ద విషయమేనా... మా ఆఫీసు పని చేయటమే అన్నిటికంటే కష్టం"
"అలాగా... అలా అయితే ఒక రోజు మొత్తం మీరు నాలా ఇంటి పని చేయండి... నేను మీలా ఆఫీసు పని చేస్తాను... అప్పుడు తెలుస్తుంది ఎవరు కష్టపడుతున్నారో" సవాల్ విసిరింది భాగ్యం.
రెండు క్షణాలు ఆలోచించాడు బుచ్చిబాబు...
"ఛ... ఆడవాళ్ళ సవాల్ కి తను వెనక్కి తగ్గితే ఇంకేమన్నా ఉందా... మగాళ్ల పరువు పోదు..." అని మనసులో అనుకుని...
"సరే నేను రెడీ" అన్నాడు.

వెంటనే భాగ్యం తన పతివ్రతా శక్తినంతా కూడగట్టుకుని దేవుడికి పూజ చేసి అప్లికేషను పెట్టింది.

పూజ అయిపోయే సమయానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
"భాగ్యం... ఏమి నీ బాధ... ఈ అప్లికేషను ఏంటి?" అని అడిగాడు దేవుడు
"స్వామీ... నేను, మా అయన సవాల్ చేసుకున్నాం... మీ భక్తురాలు గెలవాలంటే మీరు వెంటనే ఆ అప్లికేషను మీద మీ తదాస్థు సంతకం చేయాలి.." అంది చేతులు జోడించి
దేవుడు అప్లికేషను చదివాడు...
"ఓ... ఒకరోజు మొత్తం నువ్వు మగాడిగా... బుచ్చిబాబు ఆడదానిలా మారాలి... అంతే కదా" అన్నాడు దేవుడు అప్లికేషన్ పరిశీలిస్తూ.
"అంతే స్వామి"
"ఇదీ నీకు కూడా సమ్మతమేనా" అని అడిగాడు దేవుడు బుచ్చిబాబు వైపు తిరిగి
"సమ్మతమే స్వామి..."
"మళ్లీ ఒకసారి బాగా ఆలోచించుకో నాయన..." అన్నాడు దేవుడు బుచ్చిబాబు వైపు జాలిగా చూస్తూ
"లేదు స్వామి... నేను ఎలా అయిన ఈ సవాల్ లో నేగ్గల్సిందే... మీరు సంతకం చేసేయండి" అన్నాడు బుచ్చిబాబు పట్టుదలగా
"సరే నీ ఖర్మ" అని మనసులో అనుకుని దేవుడు తదాస్థు సంతకం చేసేసాడు అప్లికేషన్ మీద.

***

తెల్లవారింది...
బుచ్చిబాబు భాగ్యం రూపంలో ఉన్నాడు... భాగ్యం బుచ్చిబాబు రూపంలో ఉంది.
పొద్దున్నే 5 గంటలకి అలారం గంట కొట్టింది. ఉలిక్కి పడి లేచాడు బుచ్చిబాబు.
అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా అని గొణుక్కుంటూ లేచి... వెళ్లి ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గు పెట్టాడు.
భాగ్యం హాయిగా నిద్రపోతుంది లోపల.
ముగ్గు పెట్టటం అయిపోయాక... పాలు కాయటం, ఇల్లు ఊడవటం, వంటకి కూరగాయలు తరగటం చేస్తున్నాడు బుచ్చిబాబు.
టైం 8 అయింది. భాగ్యం లేచింది బద్ధకంగా.
తను లేచి స్నానం చేసి వచ్చేలోగా... టిఫిన్ రెడీ చేసాడు బుచ్చిబాబు.
టిఫిన్ తినేసి లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీసు కి వెళ్ళిపోయింది భాగ్యం 9 గంటల కల్లా.
ఈలోగా హడావిడిగా పిల్లలని రెడీ చేసి... వాళ్లకి టిఫిన్ పెట్టి, పాలు తాగించి స్కూల్ కి పంపించాడు బుచ్చిబాబు.
అప్పటికే తన ఒంట్లో శక్తి మొత్తం అయిపోయింది... నీరస పడిపోయాడు.
కానీ ఎలా అయిన పందెం నేగ్గాలన్న పట్టుదలతో మళ్లీ శక్తి తెచ్చుకుని ఇంటి పని చేస్తున్నాడు.
పిల్లలు వెళ్ళిపోయాక... ఇల్లు తుడిచేసాడు.
బట్టలు నానపెట్టి... గిన్నెలు తోమాడు.
తర్వాత బట్టలు కూడా ఉతికేసి ఆరేసాడు.
అప్పటికే టైం 12 అయింది.
స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకున్నాడు.
భోజనం టైం అయింది... అప్పుడు గుర్తొచ్చింది బుచ్చిబాబుకి... తను పొద్దున్నుండి ఏమి తినలేదు అని... "హు రోజు టైం కి టిఫిన్, టీ పడేవి కడుపులో... ఏం ఖర్మరా బాబు" అని మనసులో అనుకుని... భోజనం చేసాడు.
కాసేపు నడుం వాలుద్దాం అనుకునే లోగా...
"భాగ్యమక్కా... రేపు మా ఇంటికి చుట్టలోస్తున్నారు... పిండి వంటలు చేయాలి.. కొంచం సాయం పట్టవు" అంటూ వచ్చింది పక్కింటి పంకజం.
తప్పేదేముంది... ఆ పనిలో పడ్డాడు బుచ్చిబాబు.
ఆ పని అయ్యేటప్పటికి 3 దాటింది టైం. పిల్లలు వచ్చే టైం అయింది.
వాళ్ళు రాగానే పాలు తాగించాడు. కొంచం అల్పాహారం తయారు చేసి పెట్టాడు.
వాళ్ళు ఆ టిఫిన్ తినేసి ట్యూషన్ కి వెళ్లిపోయారు.
టైం 5 అయింది.
మళ్లీ ఒకసారి ఇల్లు ఊడ్చి... గిన్నెలు తోమేసాడు.
6 అయింది. భాగ్యం వచ్చింది ఆఫీసు నుండి.
తనకి కొంచం కాఫీ కలిపి ఇచ్చి... సాయంత్రం చేసిన అల్పాహారం పెట్టాడు.
తను అది తినేసి relaxed గా సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంది.
బుచ్చిబాబుకి ఒళ్ళు మండింది... కానీ ఏం చేయలేడు కదా...
లోపలికి వెళ్లి రాత్రి భోజనం తయారు చేసే పనిలో పడ్డాడు.

అలా ఆ రోజంతా క్షణం తీరిక లేకుండా గడిచింది బుచ్చిబాబుకి.

***

తెల్లవారింది...

బుచ్చిబాబు కి ఇంక ఆ పనులు చేయటం వల్లకాలేదు...
వెంటనే దేవుడి దగ్గరికి వెళ్లి... "స్వామీ... 24 గంటల గడువు అయిపొయింది... వెంటనే నన్ను నా పూర్వ రూపానికి మార్చేయండి... ఈ గొడ్డు చాకిరి చేయటం నా వల్ల కాదు... నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను..." అన్నాడు దీనంగా చేతులు జోడించి.
దేవుడు ప్రత్యక్షమయ్యాడు...
"స్వామీ అర్జెంటుగా నన్ను మాములు రూపానికి మార్చేయండి" మళ్లీ అడిగాడు ఆగలేక...
"బుచ్చిబాబు... చిన్న పొరపాటు జరిగిపోయిందయ్యా... మరో 9 నెలల దాక నువ్వు ఈ రూపంలోనే ఉండాలి!"
అని వెంటనే మాయమైపోయాడు దేవుడు.
బుచ్చిబాబు పిచ్చి చూపులు చూస్తూ... భాగ్యం వైపు తిరిగాడు...
విష్ణుమూర్తి లాగా మంచం మీద విలాసంగా పడుకుని... కొంటెగా నవ్వింది భాగ్యం.


Friday, March 27, 2009

విరోధినామ సంవత్సరాది (ఉగాది) శుభాకాంక్షలు


ఎంచక్కా ముందు ఉగాది పచ్చడి తినేసి... ఆ తర్వాత ఇక్కడున్న తెలుగు వంటలన్నీ కూడా కడుపు నిండా తినేయండి...

ఉగాది పచ్చడి


పాయసం


బొబ్బట్లు


పూర్ణాలు (బూరెలు)


పులిహోర


గారెలు



గమనిక: వంటలు మా ఇంట్లో చేసినవి కావు. ఇంటర్నెట్ నుండి తస్కరించబడినవి. కాబట్టి వాటి రుచులు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదని గమనించగలరు.

Wednesday, March 25, 2009

మీరు రెడీనా? ~ Earth Day



http://www.earthhour.org/home/


--

Monday, March 23, 2009

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ - 78వ వర్ధంతి


పేరు: భగత్ సింగ్
పుట్టిన తేది: 27 సెప్టెంబర్, 1907
సొంత ఊరు: ల్యాల్ పూర్, పంజాబ్
మరణం: 23 మార్చ్, 1931




పేరు: శివ రాం హరి రాజ్ గురు
పుట్టిన తేది: 24 ఆగష్టు, 1908
సొంత ఊరు: మహారాష్ట్ర
మరణం: 23 మార్చ్, 1931




పేరు: సుఖ్ దేవ్ థాపర్
పుట్టిన తేది: 15 మే, 1907
సొంత ఊరు: లుథియానా, పంజాబ్
మరణం: 23 మార్చ్, 1931



భగత్ సింగ్ ... స్వాతంత్రోద్యమ కాలంలో యువతకి స్ఫూర్తినిచ్చి వారిలో చైతన్యాన్ని కలిగించిన ఒక అమరజీవి.
స్వాతంత్రోద్యమంలో చివరి దాకా పాల్గొనే అవకాశం లేకపోయినా... భగత్ సింగ్ పోరాటం మాత్రం చాలా కీలకమైనది. అలాంటి వ్యక్తికి తగ్గ గుర్తింపు లభించిందా? గాంధీ గారి జయంతికి సెలవు ఉంది... కానీ భగత్ సింగ్ లాంటి నిజమైన హీరో జయంతి, వర్ధంతి ఎపుడో అసలు మనలో ఎంతమందికి తెలుసు?
అప్పుడెప్పుడో భగత్ సింగ్ జీవితం పైన ఒకేసారి మూడు సినిమాలు వచ్చినప్పుడు తప్ప అతని గురించి జనం మాట్లాడుకున్న సందర్భాలు ఎన్ని?

భగత్ సింగ్ ని ఆరాధించే వాళ్ళలో ఎక్కువ శాతం మంది గాంధీ గారిని ద్వేషిస్తారు. దానికి కారణం... భగత్ సింగ్ చావుకి గాంధీ గారు కుడా ఒక రకంగా కారణం అనే నమ్మకం. ఆ నమ్మకంలో ఎంత వరకు నిజం ఉందో నాకు మాత్రం తెలీదు. కానీ ఎక్కడో నాలో కుడా ఆ నమ్మకం ఉంది. అలా అని గాంధీ గారిని ద్వేషించే వాళ్ళ లిస్టులో మాత్రం నేను లేను.

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లని ఉరి తీయాలని నిర్ణయించే ముందే బ్రిటిష్ అధికారులు గాంధీ గారితో సంప్రదింపులు జరిపారు. గాంధీ గారు కూడా దానికి అంగీకరించారు అనేది కొంత మంది వాదన. దాని గురించిన వివరాలు మాత్రం నాకు స్పష్టంగా తెలియవు.
కానీ గాంధీ గారు తలుచుకుని ఉంటే తప్పకుండా భగత్ సింగ్ చావుని ఆరోజు ఆపగలిగి ఉండేవారు అని నా నమ్మకం. భగత్ సింగ్ లాంటి యువకులు 'అహింసా' మార్గాన్ని అనుసరించలేరు. వారికి తెలిసిన దారిలో వారు పోరాడుతున్నారు. అలాంటప్పుడు కలిసి ముందుకు సాగలేకపోయినా... ఒకరికి ఒకరు సపోర్ట్ ఇవ్వటంలో మాత్రం తప్పు లేదు కదా! అందరూ పోరాడే లక్ష్యం ఒక్కటే అయినప్పుడు... నా మార్గమే ఒప్పు... మిగిలినవి తప్పు... అని వేరేవాళ్ళని అణగదొక్కాలని చూడటం ఎంత వరకు సమంజసం!

అప్పట్లో యువతలో భగత్ సింగ్ కి చాలా మంచి ఆదరణ లభించేది. యువత మొత్తం భగత్ సింగ్ నే ఆదర్శంగా తీసుకునే వారు. భగత్ సింగ్ పోరాటాం కొనసాగి ఉంటే దేశానికి స్వాతంత్ర్యం ఇంకా త్వరగానే వచ్చేదని కొంత మంది నమ్మకం.
తన కంటే భగత్ సింగ్ కి ఎక్కువ పేరు వస్తుందనే భయం, ఈర్ష్య గాంధీ గారిలో ఉండేవా!?
దేశ స్వాతంత్ర్యం తన వల్లనే సాధ్యం అయిందనే పేరు తనకి మాత్రమే రావాలనే స్వార్ధం ఆయనలో ఉందా!?
భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ ల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవటానికి కారణం 'ఈర్ష్య', 'స్వార్ధాలే'నా!?

మీకు తెలుసా!?
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లని ఉరి తీసిన తర్వాత... ఆ శవాలని జైలు వెనక గోడలని పగలుకొట్టి రహస్యంగా అటు నుండి బయటకి తరలించారు. లాహోర్ నుండి కొద్ది దూరం తీసుకెళ్ళి అక్కడ కాల్చేసారు. త్వరగా కాలటం కోసం కాల్చే ముందు శవాలని ముక్కలు ముక్కలుగా చేసి కాల్చారట.

మహిళల బ్లాగింగు పై సాక్షి పత్రికలో వచ్చిన ఆర్టికల్

ఈరోజు సాక్షి పేపర్ లో మహిళల బ్లాగింగ్ గురించి వచ్చిన వ్యాసం...
నాకైతే ఈ ఆర్టికల్ అంత ఆకట్టుకునే రీతిలో ఉందని అనిపించలేదు. ఏదో పై పైన వ్రాయాలి కాబట్టి వ్రాసినట్టు అనిపించింది. బహుశా స్థల పరిమితి వలన వ్యాసాన్ని కుదించి ముద్రించారేమో!

Friday, March 20, 2009

వానా వానా వల్లప్ప

అబ్బా... ఏంటి ఎండలు అప్పుడే మొదలయ్యాయి అనుకుంటుంటే... ఉన్నట్టుండి ఈరోజు వర్షం కురిసింది. కానీ అదేదో పాటలో చెప్పినట్టు చుట్టంలా వచ్చి చూసెళ్లిపోయింది. కురిసే వానేదో ఎంచక్కా ఫుల్లుగా కురిసేయోచ్చు కదా!

"వర్షం" - పదంలోనే ఏదో తెలియని ఆకర్షణ ఉందేమో అనిపిస్తుంది. మరి పేరే అలా ఉంటే వర్షం ఇంకెలా ఉంటుంది.
వర్షం కురిసినప్పుడు వచ్చే కమ్మని మట్టి వాసన నచ్చని మనిషి ఉంటాడా అసలు!
నీరెండలో వర్షం కురిసినప్పుడు వచ్చే ఇంద్రధనుసు ఎంత అందంగా ఉంటుంది!
అందుకే వర్షానికి అంతమంది ఫాన్స్. నేనయితే సి.
ఏంటో
... దాన్ని ఎంత చూసినా తనివి తీరదు.

నాకు వానలో తడవటం అంటే భలే సరదా. కానీ చలేసేస్తుంది. వర్షం కొంచం వెచ్చగా పడొచ్చుకదా! అప్పుడు ఎంచక్కా ఎంతసేపైనా తడవొచ్చు! ఏం చేస్తాం... అనుకుంటే జరిగిపోదు కదా!
దేవుడికి కుళ్ళు అనుకుంట. తనేమో మేఘాల కంటే పైనెక్కడో ఉంటాడు మరి... తను తడవలేడు కదా వర్షంలో. అందుకే నన్ను కూడా(మిమ్మల్ని కూడానా?) తడవకుండా చేస్తున్నాడు. తడిస్తే చలి వేయటం, జలుబు, జ్వరం రావటం లాంటి reactions పెట్టాడు. హుహ్.
అందుకే కురిసే వర్షాన్ని అలా చూస్తూ సంతోషపడటమే!

వర్షం గురించి ఎవరో ఎక్కడో చెప్పిన ఒక విషయం గుర్తొస్తుంది... "వర్షం ఎలాంటి భావాన్నైనా ప్రతిబింబించగలదు" అని. నిజమే కదా! మనం సంతోషంగా ఉన్నప్పుడు వర్షాన్ని చూస్తుంటే... ఇంకా సంతోషంగా అనిపిస్తుంది... మన ఆనందం రెట్టింపు అయిందేమో అనిపిస్తుంది. అదే బాధలో ఉన్నప్పుడు వర్షాన్ని చూస్తుంటే మన మనసులోని బాధే అలా వర్షంలా కురుస్తుందేమో అనిపిస్తుంది!
నిజంగానే వర్షం భావాన్నైనా పలికించగలదు! అందుకే అదంటే నాకు బోలెడు ఇష్టం.

***

"వర్షం" మీద నాకిష్టమైన కొన్ని పాటలు: (వరసక్రమంతో సంబంధం లేదు)

> ఈ వర్షం సాక్షిగా (వర్షం)
> ఆకాశ గంగ దూకావే పెంకితనంగా (వాన)
> స్వాతి ముత్యపు జల్లులలో (ప్రేమ యుద్ధం)
> జల్లంత కవ్వింత కావాలిలే (గీతాంజలి)
> ఓ వానా వానా వందనం (అడవి దొంగ అనుకుంట)
> వర్షించే మేఘంలా నేనున్నా (చెలి)
> గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం (స్వయమ్వరం)
ప్రస్తుతానికి ఇవే గుర్తొచ్చాయి. ఖచ్చితంగా ఇంకా ఉండే ఉంటాయి.








Photo Courtesy: Internet

Wednesday, March 18, 2009

ఒకే మాట - ఒకే బాట


ప్రకాష్ కి కొత్తగా పెళ్లైంది.... పెళ్ళయిన కొన్ని రోజులకి తన కాలేజి స్నేహితుడు ప్రసాద్ కలిసాడు...

ప్రసాద్: ఏరా ప్రకాష్ నీకు పెళ్ళంటే ఇష్టం లేదు కదరా... వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు కదా... మరెలా పెళ్లి
చేసుకున్నావురా!

ప్రకాష్: అచ్చు నాలాంటి భావాలే ఉన్న అమ్మాయి కనిపించిందిరా... ఆమెకి కూడా మన వివాహ వ్యవస్థపై నమ్మకం
లేదు... పెళ్ళంటే ఇష్టం లేదు.... ఇద్దరి భావాలూ కలిసాయి కనుక పెళ్లి చేసుకున్నాం.

@Harderwijk_Holland





Friday, March 13, 2009

అనగనగా నా చిన్నప్పుడు...

పోయిన వారం ఊరు నుండి మా పద్మక్క వచ్చింది. ఒక పూట ఇంట్లో అందరం కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే... చిన్నప్పుడు మేము (నేను, అన్నయ్య) వెలగబెట్టిన కొన్ని ఘనకార్యాలు మళ్లీ వెలుగుచూసాయి.

నా చిన్నతనంలో మేము మా ఊరిలో ఉండేవాళ్ళం (అందరూ అలాగే ఉంటారనుకోండి :P). మా ఇంటి చుట్టూ బోలెడు ఖాళీ స్థలం ఉండేది. చిన్నప్పుడు అమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉండేది... అన్నయ్య ఆడుకోవటానికి బయటకి వెళ్తే అమ్మకి చెప్పి వెళ్ళాలి. మా ఇంటి గేటు తీసుకుని వెళ్తే సౌండ్ కి అమ్మ వచ్చి తిడుతుందేమో అని పక్కింట్లోకి దూకేసి వాళ్ళ గేటు నుండివెళ్ళేవాడు. మా ఇంటికి కుడి పక్కన ఉండే గోడ మీద నుండి పక్కింటి బావి గట్టు మీదకి కాలు పెట్టి వాళ్ళ కాంపౌండ్ లోకి వెళ్ళొచ్చు. అచ్చు అలాగే ఇంటి వెనుక ఉండే వాళ్ళ కాంపౌండ్ లోకి కూడా వెళ్ళొచ్చు. సో.. అన్న ఎప్పుడూ పక్కింటి బావి మీదకో వెనక ఇంటి బావి మీదకో వెళ్లి అటు నుండి ఆడుకోవటానికి చెక్కేసేవాడు. నన్ను మాత్రం రానిచ్చేవాడు కాదు... వాడు వెళ్ళేది క్రికెట్ ఆడటానికి కదా మరి... అందుకే నన్ను రానిచ్చేవాడు కాదు. వాడు అలా దొంగతనంగా వెళ్తుంటే చూస్తూ కూర్చునేదాన్ని నేను.


ఒకరోజు ఏదో చిరాకులో ఉండి నాన్నగారు అన్నయ్యని కోప్పడ్డారు. మనోడికి రోషం జాస్తి లెండి... తిట్టారన్న కోపంలో ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు. అప్పుడు వాడికి మహా అయితే ఎనిమిదో తొమ్మిదో ఉంటుంది వయస్సు. ఎప్పుడూ ఒక్కడే ఎక్కడికీ వెళ్ళలేదు (ఆడుకోవటానికి గ్రౌండ్ కితప్ప). సాయంత్రం చీకటి పడుతున్నా వీడు ఇంటికి రాకపోయేసరికి ఇంట్లో అందరికీ ఒకటే కంగారు. వాడు ఆడుకునే గ్రౌండ్ కి వెళ్లి చూసారు... అక్కడ లేడు. ఎందుకో అనుమానం వచ్చి పక్కింటిబావిలో, వెనక ఇంటి బావిలో కుడా చూసారు... లేడు. ఇదంతా 20 సంవత్సరాల క్రితం మాట. మరి అప్పట్లో ఫోన్లు గట్రా లేవు కదా... అందరికీ ఫోన్లు చేసి అడగటానికి. ఊరంతా వెతికాక అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళారు... కొద్ది దూరంలోనే ఉంటుంది ఊరు కూడా. అక్కడికి వెళ్ళేసరికి... వేడి వేడి అన్నంలో కొత్తావకాయ వేసుకుని తింటున్నాడు మన హీరో. తర్వాత ఏం జరిగిందో చెప్పక్కర్లేదు కదా. మనోడికి మళ్లీ కోటింగ్ పడింది :D


ఇలాంటి ఘనకార్యం మన ఖాతాలో కూడా ఒకటి ఉంది. అప్పుడు నాకు మహా అయితే 5 సంవత్సరాలుంటుందేమో వయస్సు. చిన్నప్పుడు నాకు ఒక తమాషా అలవాటు ఉండేది. అన్నం తినిపిస్తుంటే... నోట్లో పెట్టిన ముద్ద నమిలి మింగేయకుండా... బుగ్గన పెట్టుకుని నిద్దరోయేదాన్ని. అలవాటుని అడ్డం పెట్టుకుని, నన్ను చిన్నపిల్లని చేసి.. నాకు అన్యాయం చేయాలనీ చూసారు మాఅమ్మావాళ్ళు. నాకు నోట్లో ముద్ద పెడితే నిద్దరోతా కదా... అలా నన్ను ఇంట్లో వదిలేసి వాళ్ళు సినిమాకి వెళ్ళాలని ఒక కుట్ర పన్నారు. వేసుకున్న ప్లాన్లో భాగంగా నాకు అన్నం తినిపించింది అమ్మ. నేను కూడా నిద్దరోయా. కాని మగత నిద్ర... సో వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి... దాంతో వాళ్ళ కుట్ర నాకు తెలిసిపోయింది. ఇంటి వెనక వాళ్ళంతా మొహాలు కడుక్కుని రెడీ అవుతున్నారు. అమ్మవాళ్ళే నాకు అన్యాయం చేస్తున్నారన్న పచ్చి నిజం సహించలేక నేను చెప్పా పెట్టకుండా అలా నడుచుకుంటూ బయటకి వెళ్ళిపోయాను. వీధి చివరి వరకు నడిచి మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాను... ఎలా వచ్చానో ఎక్కడి
కి వెళ్ళాలో తెలీదు. అలా నడుస్తూ వెళ్తుంటే ఒక షాప్ అతను వచ్చి ఆపాడు. మనం అప్పట్లో చాలా ఫేమస్ లెండి. మా ఇంట్లో కంటే చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళల్లోనే ఎక్కువగా ఉండేదాన్ని. మరి చాలా ముద్దుగా ఉండేదాన్నేమో... అందరూ అలా తీసుకుపోయేవారు వాళ్ళఇంటికి (నిజమేనండి...నమ్మట్లేదా!). అలా షాప్ అతను నన్ను గుర్తుపట్టేసాడు...అతను ఉండేది కూడా మా వీధిలోనే మరి. జాగ్రత్తగా తీసుకొచ్చి మా ఇంట్లో అప్పచేప్పేసాడు. తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు!

కొసరు: మా మామ
య్య కొడుకు ఉన్నాడు... రాకేష్ అని. చిన్నప్పుడు తనకి కూడా తమాషా అలవాటు ఉండేది. తనకి నిద్ర ఎక్కువ... ఎంత ఎక్కువంటే ఎక్కడపడితే అక్కడ అలా పడుకుండిపోయేవాడు. ఒకరోజు ఉన్నట్టుండి తను కనిపించకుండా పోయాడు. మద్యాహ్నం ఆడుకోవటానికని వెళ్ళినవాడు సాయంత్రమైనా ఇంటికి రాలేదు. తనతో ఆడుకునే పిల్లల ఇంటికి వెళ్లి అడిగితే.. వాళ్ళంతా మాకు తెలీదు అనే చెప్పారు. ఎందుకైనా మంచిదని వాళ్ళు ఆడుకునే స్థలానికి వెళ్ళి వెతికారు. తీరా చూస్తే... అక్కడ మనోడు చింత చెట్ట కింద పడుకుని నిద్రపోతున్నాడు. లేపి... 'ఏంటిరా ఇక్కడ పడుకున్నావ్' అని మామయ్య అడిగితే... "దొంగ-పోలీసు ఆట ఆడుకున్నాము... నేను దొంగని... దాక్కోటానికి చెట్టు చాటుకి వచ్చాను... తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు"... అన్నాడంట!