Showing posts with label సుఖ్ దేవ్. Show all posts
Showing posts with label సుఖ్ దేవ్. Show all posts

Monday, March 23, 2009

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ - 78వ వర్ధంతి


పేరు: భగత్ సింగ్
పుట్టిన తేది: 27 సెప్టెంబర్, 1907
సొంత ఊరు: ల్యాల్ పూర్, పంజాబ్
మరణం: 23 మార్చ్, 1931




పేరు: శివ రాం హరి రాజ్ గురు
పుట్టిన తేది: 24 ఆగష్టు, 1908
సొంత ఊరు: మహారాష్ట్ర
మరణం: 23 మార్చ్, 1931




పేరు: సుఖ్ దేవ్ థాపర్
పుట్టిన తేది: 15 మే, 1907
సొంత ఊరు: లుథియానా, పంజాబ్
మరణం: 23 మార్చ్, 1931



భగత్ సింగ్ ... స్వాతంత్రోద్యమ కాలంలో యువతకి స్ఫూర్తినిచ్చి వారిలో చైతన్యాన్ని కలిగించిన ఒక అమరజీవి.
స్వాతంత్రోద్యమంలో చివరి దాకా పాల్గొనే అవకాశం లేకపోయినా... భగత్ సింగ్ పోరాటం మాత్రం చాలా కీలకమైనది. అలాంటి వ్యక్తికి తగ్గ గుర్తింపు లభించిందా? గాంధీ గారి జయంతికి సెలవు ఉంది... కానీ భగత్ సింగ్ లాంటి నిజమైన హీరో జయంతి, వర్ధంతి ఎపుడో అసలు మనలో ఎంతమందికి తెలుసు?
అప్పుడెప్పుడో భగత్ సింగ్ జీవితం పైన ఒకేసారి మూడు సినిమాలు వచ్చినప్పుడు తప్ప అతని గురించి జనం మాట్లాడుకున్న సందర్భాలు ఎన్ని?

భగత్ సింగ్ ని ఆరాధించే వాళ్ళలో ఎక్కువ శాతం మంది గాంధీ గారిని ద్వేషిస్తారు. దానికి కారణం... భగత్ సింగ్ చావుకి గాంధీ గారు కుడా ఒక రకంగా కారణం అనే నమ్మకం. ఆ నమ్మకంలో ఎంత వరకు నిజం ఉందో నాకు మాత్రం తెలీదు. కానీ ఎక్కడో నాలో కుడా ఆ నమ్మకం ఉంది. అలా అని గాంధీ గారిని ద్వేషించే వాళ్ళ లిస్టులో మాత్రం నేను లేను.

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లని ఉరి తీయాలని నిర్ణయించే ముందే బ్రిటిష్ అధికారులు గాంధీ గారితో సంప్రదింపులు జరిపారు. గాంధీ గారు కూడా దానికి అంగీకరించారు అనేది కొంత మంది వాదన. దాని గురించిన వివరాలు మాత్రం నాకు స్పష్టంగా తెలియవు.
కానీ గాంధీ గారు తలుచుకుని ఉంటే తప్పకుండా భగత్ సింగ్ చావుని ఆరోజు ఆపగలిగి ఉండేవారు అని నా నమ్మకం. భగత్ సింగ్ లాంటి యువకులు 'అహింసా' మార్గాన్ని అనుసరించలేరు. వారికి తెలిసిన దారిలో వారు పోరాడుతున్నారు. అలాంటప్పుడు కలిసి ముందుకు సాగలేకపోయినా... ఒకరికి ఒకరు సపోర్ట్ ఇవ్వటంలో మాత్రం తప్పు లేదు కదా! అందరూ పోరాడే లక్ష్యం ఒక్కటే అయినప్పుడు... నా మార్గమే ఒప్పు... మిగిలినవి తప్పు... అని వేరేవాళ్ళని అణగదొక్కాలని చూడటం ఎంత వరకు సమంజసం!

అప్పట్లో యువతలో భగత్ సింగ్ కి చాలా మంచి ఆదరణ లభించేది. యువత మొత్తం భగత్ సింగ్ నే ఆదర్శంగా తీసుకునే వారు. భగత్ సింగ్ పోరాటాం కొనసాగి ఉంటే దేశానికి స్వాతంత్ర్యం ఇంకా త్వరగానే వచ్చేదని కొంత మంది నమ్మకం.
తన కంటే భగత్ సింగ్ కి ఎక్కువ పేరు వస్తుందనే భయం, ఈర్ష్య గాంధీ గారిలో ఉండేవా!?
దేశ స్వాతంత్ర్యం తన వల్లనే సాధ్యం అయిందనే పేరు తనకి మాత్రమే రావాలనే స్వార్ధం ఆయనలో ఉందా!?
భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ ల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవటానికి కారణం 'ఈర్ష్య', 'స్వార్ధాలే'నా!?

మీకు తెలుసా!?
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లని ఉరి తీసిన తర్వాత... ఆ శవాలని జైలు వెనక గోడలని పగలుకొట్టి రహస్యంగా అటు నుండి బయటకి తరలించారు. లాహోర్ నుండి కొద్ది దూరం తీసుకెళ్ళి అక్కడ కాల్చేసారు. త్వరగా కాలటం కోసం కాల్చే ముందు శవాలని ముక్కలు ముక్కలుగా చేసి కాల్చారట.