Showing posts with label కిసుక్కు. Show all posts
Showing posts with label కిసుక్కు. Show all posts

Monday, June 1, 2009

ఊహలకే రెక్కలు వస్తే...

గమనిక: ఇది నా సొంత రచన కాదు. ఏదో సైటులో చదివిన జోక్(?!) కి నా పైత్యం కాస్త జోడించి రాసింది.

***

ఒకతను సూపర్ మార్కెట్ నుండి బయటకి వస్తుండగా ఒక అందమైన అమ్మాయి ఎదురుగా వచ్చి నవ్వుతూ పలకరించింది...
"Good evening"
అతను 'ఎవరు మీరు' అన్నట్టు చూసాడు...

అప్పుడు ఆ అమ్మాయికి అర్థమైంది పొరపాటు జరిగింది అని...
"క్షమించండి... మిమ్మల్ని మొదట చూడగానే మీరు నా పిల్లల్లో ఒకరి తండ్రిలా అనిపించారు" అని సారీ చెప్పేసి వెళ్ళిపోయింది.

అతనికి కొతసేపు ఏమి అర్థం కాలేదు... అలాగే షాక్ తో నిల్చుండిపోయాడు.

అతని మనసులో రకరకాల ఆలోచనలు...

"ఏంటిది... మరీ లోకం ఇలా తయారైంది... ఒక అమ్మాయి తన పిల్లల తండ్రి ఎలా ఉంటాడో కూడా మర్చిపోయిందా!"

అలా అనుకుంటూనే... ఒక్క క్షణం అతనికి కొంచం ఆనందంగా కూడా అనిపించింది... తను ఆ అందమైన అమ్మాయికి ఉన్న సంబంధాల్లో ఒకరిలా అనిపించినందుకు!

ఒకసారి చుట్టూ చూసుకున్నాడు... ఆమె అలా అనటం ఎవరూ గమనించలేదు కదా అనుకుంటూ...

ఒక్క క్షణం మళ్లీ ఒక ఆలోచన వచ్చింది అతని మనసులోకి... "ఒకవేళ నిజంగానే ఒకప్పుడు అతనికి ఆమెతో సంబంధం ఉందా? నిజంగానే తన పిల్లలకి తండ్రా?"

ఇలా రకరకాల ఆలోచనలతో అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

కానీ... అతనికి ఒక విషయం మాత్రం తెలియలేదు...
ఆ అమ్మాయి అదే కాలనీలో ఉన్న ఒక ఎలిమెంటరీ స్కూల్ లో నర్సరీ పిల్లలకి టీచర్ అని!

Monday, March 30, 2009

కుడి ఎడమైతే... పోరపాటేనోయ్!!

గమనిక: ఇది ఎప్పుడో ఎక్కడో చదివిన చిన్న జోకుకి నా పైత్యం జోడించి రాసిన కథ.

సాయంత్రం అయిదైంది.
బుచ్చిబాబు watch వంక చూసి వెంటనే ఫైల్స్ అన్ని మూసేసి ఇంటికి బయల్దేరాడు.
ఇంటికి రాగానే బాగా అలసిపోయినట్టు వేలాడపడిపోయి... సోఫాలో కూర్చుని "కాఫీ" అని ఆర్డర్ చేసాడు.
రెండు నిముషాల్లో కాఫీతో ప్రత్యక్షమైంది బుచ్చిబాబు భార్య భాగ్యం(భాగ్యలక్ష్మి కి బుచ్చిబాబు పెట్టుకున్న ముద్దుపేరు).
కాఫీ అందుకుని తాగుతున్నాడు బుచ్చిబాబు.
"దేశం లో పని మొత్తం మీరొక్కరే చేసి వచ్చినట్టు... అంత పోసు కొట్టాల" అంది భాగ్యం.
అసలే తనేదో బాగా కష్టపడిపోతున్నా అన్న ఫీలింగ్ లో ఉన్న బుచ్చిబాబుకి భాగ్యం మాటలతో చిర్రెత్తుకొచ్చింది.
"కష్టం కాకపోతే మరేమిటి... ఎప్పుడో పుద్దున్నే 10 గంటల కల్లా వెళ్ళాలా ఆఫీసుకి... మళ్లీ ఎప్పుడో సాయంత్రం 5 గంటలకి గాని ఇంటికి రాలేను... ఇంత గొడ్డు చాకిరి చేస్తుంటే... నీకది కష్టంలా కనిపించటంలేదా" అని గయ్ మన్నాడు.
"అబ్బో ఇదీ ఒక కష్టమేనా... ఉదయం నుండి సాయంత్రం దాకా ac లో కూర్చోటమేగా మీరు పొడిచేసే పని" అంది భాగ్యం దెప్పుతున్నట్టు.
"కష్టం అంటే మాది... ఉదయం నుండి గొడ్డు చాకిరీ చేయాలి ఇంటిల్లపాదికి... " అంది మళ్లీ తనే.
"ఆహ... ఏంటో మీరు పడే ఆ కష్టం... ఏవో రెండు కూరగాయలు అలా తరిగేసి కూర చేయటం... రెండు గిన్నెలు తోమటం... అంతే కదా... ఆ చిన్న పనులన్నీ ఉదయమే 11 గంటలకల్లా అయిపోతాయి... తర్వాత మొత్తం ఆ టీవీ లో వచ్చే ఏడుపుగొట్టు సీరియల్స్ చూడటమేగా మీరు పడే కష్టం" అని వాదనకి దిగాడు బుచ్చిబాబు.
"ఏంటి అంత తేలికగా ఉందా మీకు ఇంటి పని అంటే... చేస్తే తెలుస్తది... అది ఎంత కష్టమో... ఊరికే మాటలు చెప్పటం కాదు"
"ఆ పని చేయటం కూడా పెద్ద విషయమేనా... మా ఆఫీసు పని చేయటమే అన్నిటికంటే కష్టం"
"అలాగా... అలా అయితే ఒక రోజు మొత్తం మీరు నాలా ఇంటి పని చేయండి... నేను మీలా ఆఫీసు పని చేస్తాను... అప్పుడు తెలుస్తుంది ఎవరు కష్టపడుతున్నారో" సవాల్ విసిరింది భాగ్యం.
రెండు క్షణాలు ఆలోచించాడు బుచ్చిబాబు...
"ఛ... ఆడవాళ్ళ సవాల్ కి తను వెనక్కి తగ్గితే ఇంకేమన్నా ఉందా... మగాళ్ల పరువు పోదు..." అని మనసులో అనుకుని...
"సరే నేను రెడీ" అన్నాడు.

వెంటనే భాగ్యం తన పతివ్రతా శక్తినంతా కూడగట్టుకుని దేవుడికి పూజ చేసి అప్లికేషను పెట్టింది.

పూజ అయిపోయే సమయానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
"భాగ్యం... ఏమి నీ బాధ... ఈ అప్లికేషను ఏంటి?" అని అడిగాడు దేవుడు
"స్వామీ... నేను, మా అయన సవాల్ చేసుకున్నాం... మీ భక్తురాలు గెలవాలంటే మీరు వెంటనే ఆ అప్లికేషను మీద మీ తదాస్థు సంతకం చేయాలి.." అంది చేతులు జోడించి
దేవుడు అప్లికేషను చదివాడు...
"ఓ... ఒకరోజు మొత్తం నువ్వు మగాడిగా... బుచ్చిబాబు ఆడదానిలా మారాలి... అంతే కదా" అన్నాడు దేవుడు అప్లికేషన్ పరిశీలిస్తూ.
"అంతే స్వామి"
"ఇదీ నీకు కూడా సమ్మతమేనా" అని అడిగాడు దేవుడు బుచ్చిబాబు వైపు తిరిగి
"సమ్మతమే స్వామి..."
"మళ్లీ ఒకసారి బాగా ఆలోచించుకో నాయన..." అన్నాడు దేవుడు బుచ్చిబాబు వైపు జాలిగా చూస్తూ
"లేదు స్వామి... నేను ఎలా అయిన ఈ సవాల్ లో నేగ్గల్సిందే... మీరు సంతకం చేసేయండి" అన్నాడు బుచ్చిబాబు పట్టుదలగా
"సరే నీ ఖర్మ" అని మనసులో అనుకుని దేవుడు తదాస్థు సంతకం చేసేసాడు అప్లికేషన్ మీద.

***

తెల్లవారింది...
బుచ్చిబాబు భాగ్యం రూపంలో ఉన్నాడు... భాగ్యం బుచ్చిబాబు రూపంలో ఉంది.
పొద్దున్నే 5 గంటలకి అలారం గంట కొట్టింది. ఉలిక్కి పడి లేచాడు బుచ్చిబాబు.
అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా అని గొణుక్కుంటూ లేచి... వెళ్లి ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గు పెట్టాడు.
భాగ్యం హాయిగా నిద్రపోతుంది లోపల.
ముగ్గు పెట్టటం అయిపోయాక... పాలు కాయటం, ఇల్లు ఊడవటం, వంటకి కూరగాయలు తరగటం చేస్తున్నాడు బుచ్చిబాబు.
టైం 8 అయింది. భాగ్యం లేచింది బద్ధకంగా.
తను లేచి స్నానం చేసి వచ్చేలోగా... టిఫిన్ రెడీ చేసాడు బుచ్చిబాబు.
టిఫిన్ తినేసి లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీసు కి వెళ్ళిపోయింది భాగ్యం 9 గంటల కల్లా.
ఈలోగా హడావిడిగా పిల్లలని రెడీ చేసి... వాళ్లకి టిఫిన్ పెట్టి, పాలు తాగించి స్కూల్ కి పంపించాడు బుచ్చిబాబు.
అప్పటికే తన ఒంట్లో శక్తి మొత్తం అయిపోయింది... నీరస పడిపోయాడు.
కానీ ఎలా అయిన పందెం నేగ్గాలన్న పట్టుదలతో మళ్లీ శక్తి తెచ్చుకుని ఇంటి పని చేస్తున్నాడు.
పిల్లలు వెళ్ళిపోయాక... ఇల్లు తుడిచేసాడు.
బట్టలు నానపెట్టి... గిన్నెలు తోమాడు.
తర్వాత బట్టలు కూడా ఉతికేసి ఆరేసాడు.
అప్పటికే టైం 12 అయింది.
స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకున్నాడు.
భోజనం టైం అయింది... అప్పుడు గుర్తొచ్చింది బుచ్చిబాబుకి... తను పొద్దున్నుండి ఏమి తినలేదు అని... "హు రోజు టైం కి టిఫిన్, టీ పడేవి కడుపులో... ఏం ఖర్మరా బాబు" అని మనసులో అనుకుని... భోజనం చేసాడు.
కాసేపు నడుం వాలుద్దాం అనుకునే లోగా...
"భాగ్యమక్కా... రేపు మా ఇంటికి చుట్టలోస్తున్నారు... పిండి వంటలు చేయాలి.. కొంచం సాయం పట్టవు" అంటూ వచ్చింది పక్కింటి పంకజం.
తప్పేదేముంది... ఆ పనిలో పడ్డాడు బుచ్చిబాబు.
ఆ పని అయ్యేటప్పటికి 3 దాటింది టైం. పిల్లలు వచ్చే టైం అయింది.
వాళ్ళు రాగానే పాలు తాగించాడు. కొంచం అల్పాహారం తయారు చేసి పెట్టాడు.
వాళ్ళు ఆ టిఫిన్ తినేసి ట్యూషన్ కి వెళ్లిపోయారు.
టైం 5 అయింది.
మళ్లీ ఒకసారి ఇల్లు ఊడ్చి... గిన్నెలు తోమేసాడు.
6 అయింది. భాగ్యం వచ్చింది ఆఫీసు నుండి.
తనకి కొంచం కాఫీ కలిపి ఇచ్చి... సాయంత్రం చేసిన అల్పాహారం పెట్టాడు.
తను అది తినేసి relaxed గా సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంది.
బుచ్చిబాబుకి ఒళ్ళు మండింది... కానీ ఏం చేయలేడు కదా...
లోపలికి వెళ్లి రాత్రి భోజనం తయారు చేసే పనిలో పడ్డాడు.

అలా ఆ రోజంతా క్షణం తీరిక లేకుండా గడిచింది బుచ్చిబాబుకి.

***

తెల్లవారింది...

బుచ్చిబాబు కి ఇంక ఆ పనులు చేయటం వల్లకాలేదు...
వెంటనే దేవుడి దగ్గరికి వెళ్లి... "స్వామీ... 24 గంటల గడువు అయిపొయింది... వెంటనే నన్ను నా పూర్వ రూపానికి మార్చేయండి... ఈ గొడ్డు చాకిరి చేయటం నా వల్ల కాదు... నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను..." అన్నాడు దీనంగా చేతులు జోడించి.
దేవుడు ప్రత్యక్షమయ్యాడు...
"స్వామీ అర్జెంటుగా నన్ను మాములు రూపానికి మార్చేయండి" మళ్లీ అడిగాడు ఆగలేక...
"బుచ్చిబాబు... చిన్న పొరపాటు జరిగిపోయిందయ్యా... మరో 9 నెలల దాక నువ్వు ఈ రూపంలోనే ఉండాలి!"
అని వెంటనే మాయమైపోయాడు దేవుడు.
బుచ్చిబాబు పిచ్చి చూపులు చూస్తూ... భాగ్యం వైపు తిరిగాడు...
విష్ణుమూర్తి లాగా మంచం మీద విలాసంగా పడుకుని... కొంటెగా నవ్వింది భాగ్యం.


Wednesday, March 18, 2009

ఒకే మాట - ఒకే బాట


ప్రకాష్ కి కొత్తగా పెళ్లైంది.... పెళ్ళయిన కొన్ని రోజులకి తన కాలేజి స్నేహితుడు ప్రసాద్ కలిసాడు...

ప్రసాద్: ఏరా ప్రకాష్ నీకు పెళ్ళంటే ఇష్టం లేదు కదరా... వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు కదా... మరెలా పెళ్లి
చేసుకున్నావురా!

ప్రకాష్: అచ్చు నాలాంటి భావాలే ఉన్న అమ్మాయి కనిపించిందిరా... ఆమెకి కూడా మన వివాహ వ్యవస్థపై నమ్మకం
లేదు... పెళ్ళంటే ఇష్టం లేదు.... ఇద్దరి భావాలూ కలిసాయి కనుక పెళ్లి చేసుకున్నాం.

Wednesday, March 4, 2009

అమ్మో బామ్మ!!

బామ్మగారు తన మనవడితో కలిసి సముద్రపు ఒడ్డున నడుస్తున్నారు. ఉన్నట్టుండి ఒక పెద్ద అల వచ్చి అక్కడ ఉన్న వాటన్నిటిని తనతో తీసుకుపోయింది. బామ్మగారు పక్కకి తిరిగి చూస్తే మనవడు కనిపించలేదు... ఆ పెద్ద అలతో పాటుగా తనూ వెళ్ళిపోయాడు!

2 నిముషాలకి షాక్ నుండి తేరుకున్న బామ్మగారు మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్ధించటం మొదలు పెట్టారు.
"దేవుడా!! నా మనవణ్ణి నాకు తిరిగి ఇచ్చేయ్... దయచేసి ఇచ్చేయ్!"

కొన్ని క్షణాల్లో... మరో పెద్ద అల వచ్చింది. ఈసారి అల తనతో పాటుగా బామ్మగారి మనవణ్ణి వెంటపెట్టుకొచ్చింది.
ఏం జరుగుతుందో అర్థం కానీ ఆ పిల్లాడు అలా చూస్తూ నిల్చుండిపోయాడు.
బామ్మగారు మనవణ్ణి చూస్తూ అంతా తడుముతూ దగ్గరకి తీసుకున్నారు.

2 క్షణాల తర్వాత బామ్మగారు మనవడి వైపు పరీక్షగా చూసి... ఆకాశం వైపు తిరిగి చేతులు జోడించి ఇలా అన్నారు...
"వీడి తలపై ఓ టోపీ ఉండాలి"

Tuesday, February 10, 2009

ఎంత ఘాటు ప్రేమయో... ఇంత లేటు వయస్సులో!

అమ్మమ్మ, తాతయ్య చాలా సంతోషంగా ఉన్నారు... వాళ్ల పాత రోజులని గుర్తుచేసుకుని! రేపటిని తమ 'నిన్న' లాగా మార్చాలనుకున్నారు. కొంతకాలం వెనక్కి వెళ్లి... ఒక రోజంతా తమ పెళ్ళికి ముందు ఎలా ఉండేవారో అలా ఉండాలనుకున్నారు.
పెళ్లికి
ముందు అప్పుడప్పుడు గోదావరి ఒడ్డున కలుసుకునే వారు.. ఇప్పుడు కూడా తమ 'డేట్' కి గోదావరి ఒడ్డునే ఎంచుకున్నారు.

తాతయ్య తెల్లారి పొద్దున్నే లేచి... మంచిగా రెడీ అయి... ఒక గులాబిపూల బొకే తీసుకుని సూర్యోదయానికి ముందే గోదావరి తీరానికి వెళ్ళాడు. అక్కడ నది ఒడ్డున కూర్చుని తన ప్రియురాలి కోసం ఎదురుచూస్తూ పాత జ్ఞాపకాలని నెమర వేసుకుంటున్నాడు. తన ఎదురు చూపుల్లోనే సూర్యోదయం కాస్తా సూర్యాస్తమయం అయిపోయింది. అంతసమయం గడిచినా బామ్మ మాత్రం రాలేదు.
ఎదురు చూసీ ఎదురు చూసీ అలసిపోయిన తాతయ్య కోపంగా ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో తన మంచంపై పడుకుని కూనిరాగాలు తీస్తున్న బామ్మని చూసి... కోపంగా తన చేతిలోని గులాబిలని నేల మీదకి విసిరేసి అడిగాడు "ఎందుకు నువ్వు మన 'డేట్' కి రాలేదు?"
బామ్మ సిగ్గు పడుతూ చెప్పింది "మా అమ్మ పంపించలేదు".
!!