Showing posts with label చిన్నప్పుడు. Show all posts
Showing posts with label చిన్నప్పుడు. Show all posts

Friday, March 13, 2009

అనగనగా నా చిన్నప్పుడు...

పోయిన వారం ఊరు నుండి మా పద్మక్క వచ్చింది. ఒక పూట ఇంట్లో అందరం కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే... చిన్నప్పుడు మేము (నేను, అన్నయ్య) వెలగబెట్టిన కొన్ని ఘనకార్యాలు మళ్లీ వెలుగుచూసాయి.

నా చిన్నతనంలో మేము మా ఊరిలో ఉండేవాళ్ళం (అందరూ అలాగే ఉంటారనుకోండి :P). మా ఇంటి చుట్టూ బోలెడు ఖాళీ స్థలం ఉండేది. చిన్నప్పుడు అమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉండేది... అన్నయ్య ఆడుకోవటానికి బయటకి వెళ్తే అమ్మకి చెప్పి వెళ్ళాలి. మా ఇంటి గేటు తీసుకుని వెళ్తే సౌండ్ కి అమ్మ వచ్చి తిడుతుందేమో అని పక్కింట్లోకి దూకేసి వాళ్ళ గేటు నుండివెళ్ళేవాడు. మా ఇంటికి కుడి పక్కన ఉండే గోడ మీద నుండి పక్కింటి బావి గట్టు మీదకి కాలు పెట్టి వాళ్ళ కాంపౌండ్ లోకి వెళ్ళొచ్చు. అచ్చు అలాగే ఇంటి వెనుక ఉండే వాళ్ళ కాంపౌండ్ లోకి కూడా వెళ్ళొచ్చు. సో.. అన్న ఎప్పుడూ పక్కింటి బావి మీదకో వెనక ఇంటి బావి మీదకో వెళ్లి అటు నుండి ఆడుకోవటానికి చెక్కేసేవాడు. నన్ను మాత్రం రానిచ్చేవాడు కాదు... వాడు వెళ్ళేది క్రికెట్ ఆడటానికి కదా మరి... అందుకే నన్ను రానిచ్చేవాడు కాదు. వాడు అలా దొంగతనంగా వెళ్తుంటే చూస్తూ కూర్చునేదాన్ని నేను.


ఒకరోజు ఏదో చిరాకులో ఉండి నాన్నగారు అన్నయ్యని కోప్పడ్డారు. మనోడికి రోషం జాస్తి లెండి... తిట్టారన్న కోపంలో ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు. అప్పుడు వాడికి మహా అయితే ఎనిమిదో తొమ్మిదో ఉంటుంది వయస్సు. ఎప్పుడూ ఒక్కడే ఎక్కడికీ వెళ్ళలేదు (ఆడుకోవటానికి గ్రౌండ్ కితప్ప). సాయంత్రం చీకటి పడుతున్నా వీడు ఇంటికి రాకపోయేసరికి ఇంట్లో అందరికీ ఒకటే కంగారు. వాడు ఆడుకునే గ్రౌండ్ కి వెళ్లి చూసారు... అక్కడ లేడు. ఎందుకో అనుమానం వచ్చి పక్కింటిబావిలో, వెనక ఇంటి బావిలో కుడా చూసారు... లేడు. ఇదంతా 20 సంవత్సరాల క్రితం మాట. మరి అప్పట్లో ఫోన్లు గట్రా లేవు కదా... అందరికీ ఫోన్లు చేసి అడగటానికి. ఊరంతా వెతికాక అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళారు... కొద్ది దూరంలోనే ఉంటుంది ఊరు కూడా. అక్కడికి వెళ్ళేసరికి... వేడి వేడి అన్నంలో కొత్తావకాయ వేసుకుని తింటున్నాడు మన హీరో. తర్వాత ఏం జరిగిందో చెప్పక్కర్లేదు కదా. మనోడికి మళ్లీ కోటింగ్ పడింది :D


ఇలాంటి ఘనకార్యం మన ఖాతాలో కూడా ఒకటి ఉంది. అప్పుడు నాకు మహా అయితే 5 సంవత్సరాలుంటుందేమో వయస్సు. చిన్నప్పుడు నాకు ఒక తమాషా అలవాటు ఉండేది. అన్నం తినిపిస్తుంటే... నోట్లో పెట్టిన ముద్ద నమిలి మింగేయకుండా... బుగ్గన పెట్టుకుని నిద్దరోయేదాన్ని. అలవాటుని అడ్డం పెట్టుకుని, నన్ను చిన్నపిల్లని చేసి.. నాకు అన్యాయం చేయాలనీ చూసారు మాఅమ్మావాళ్ళు. నాకు నోట్లో ముద్ద పెడితే నిద్దరోతా కదా... అలా నన్ను ఇంట్లో వదిలేసి వాళ్ళు సినిమాకి వెళ్ళాలని ఒక కుట్ర పన్నారు. వేసుకున్న ప్లాన్లో భాగంగా నాకు అన్నం తినిపించింది అమ్మ. నేను కూడా నిద్దరోయా. కాని మగత నిద్ర... సో వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి... దాంతో వాళ్ళ కుట్ర నాకు తెలిసిపోయింది. ఇంటి వెనక వాళ్ళంతా మొహాలు కడుక్కుని రెడీ అవుతున్నారు. అమ్మవాళ్ళే నాకు అన్యాయం చేస్తున్నారన్న పచ్చి నిజం సహించలేక నేను చెప్పా పెట్టకుండా అలా నడుచుకుంటూ బయటకి వెళ్ళిపోయాను. వీధి చివరి వరకు నడిచి మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాను... ఎలా వచ్చానో ఎక్కడి
కి వెళ్ళాలో తెలీదు. అలా నడుస్తూ వెళ్తుంటే ఒక షాప్ అతను వచ్చి ఆపాడు. మనం అప్పట్లో చాలా ఫేమస్ లెండి. మా ఇంట్లో కంటే చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళల్లోనే ఎక్కువగా ఉండేదాన్ని. మరి చాలా ముద్దుగా ఉండేదాన్నేమో... అందరూ అలా తీసుకుపోయేవారు వాళ్ళఇంటికి (నిజమేనండి...నమ్మట్లేదా!). అలా షాప్ అతను నన్ను గుర్తుపట్టేసాడు...అతను ఉండేది కూడా మా వీధిలోనే మరి. జాగ్రత్తగా తీసుకొచ్చి మా ఇంట్లో అప్పచేప్పేసాడు. తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు!

కొసరు: మా మామ
య్య కొడుకు ఉన్నాడు... రాకేష్ అని. చిన్నప్పుడు తనకి కూడా తమాషా అలవాటు ఉండేది. తనకి నిద్ర ఎక్కువ... ఎంత ఎక్కువంటే ఎక్కడపడితే అక్కడ అలా పడుకుండిపోయేవాడు. ఒకరోజు ఉన్నట్టుండి తను కనిపించకుండా పోయాడు. మద్యాహ్నం ఆడుకోవటానికని వెళ్ళినవాడు సాయంత్రమైనా ఇంటికి రాలేదు. తనతో ఆడుకునే పిల్లల ఇంటికి వెళ్లి అడిగితే.. వాళ్ళంతా మాకు తెలీదు అనే చెప్పారు. ఎందుకైనా మంచిదని వాళ్ళు ఆడుకునే స్థలానికి వెళ్ళి వెతికారు. తీరా చూస్తే... అక్కడ మనోడు చింత చెట్ట కింద పడుకుని నిద్రపోతున్నాడు. లేపి... 'ఏంటిరా ఇక్కడ పడుకున్నావ్' అని మామయ్య అడిగితే... "దొంగ-పోలీసు ఆట ఆడుకున్నాము... నేను దొంగని... దాక్కోటానికి చెట్టు చాటుకి వచ్చాను... తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు"... అన్నాడంట!

Wednesday, February 18, 2009

చిన్ని చిన్ని ఆశ... చిన్ననాటి ఆశ...

కొద్దిసేపటి క్రితం పప్పుశ్రీను గారి బ్లాగు చదివనప్పుడు నాక్కూడా నా చిన్ననాటి సంగతులన్నీ రింగులు రింగులుగా గుర్తొచ్చాయి... వాటితో పాటే అప్పట్లో తీరని నా చిన్న చిన్న(అప్పట్లో పెద్దగా అనిపించేవి) కోరికలు కూడా ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి...
సరదాగా అవన్నీ ఒకసారి బ్లాగుదామనిపించింది...

చాలా చిన్నప్పుడు, అంటే నేను 2nd class అలా చదివేప్పుడు పెద్ద జడ కావాలని అనిపించేది... రోజూ చాలా పూలు పెట్టుకోవాలి... పూల జడలు వేసుకోవాలి అని అనిపించేది... కానీ అప్పుడు తిరుపతి మొక్కు వలన కొద్ది కొద్దిగా వచ్చిన జుట్టుతో బాబ్ కట్ ఉండేది. తర్వాత మెల్లిగా పెద్ద జడ వచ్చేసింది కాని... మళ్లీ కాలేజీలో చేరిన కొత్తలో మా పక్కంటి అమ్మాయిని, ఆమె పొట్టి జుట్టుని చూసి inspire అయి నేను కూడా నా జుట్టు కట్ చేసేసుకున్నాను... అదేంటో అప్పటి నుండి అందరూ పొడుగు జుట్టు వాళ్ళే కనిపించేవారు. తర్వాత రోజూ నుండే నాక్కూడా మళ్లీ పెద్ద జడ కావాలనిపించేది... hmm...!

మా స్కూల్ లో, class లో చాలా మంది వాళ్ళ బుక్స్ ని ఒక స్టీల్ బాక్స్ లో తెచ్చుకునేవారు... నాకు మాత్రం బాగ్ ఉండేది. నాక్కూడా అలా బాక్స్ లో బుక్స్ తీసుకెళ్లాలని కోరిక. అన్నకి మాత్రం బాక్స్ ఉండేది... ఎన్నిసార్లు అడిగినా నాకు మాత్రం బాక్స్ కొనివ్వలేదు మా అమ్మ. అన్న కూడా ఒక్కరోజు ఇవ్వమన్నా ఆ బాక్స్ ఇచ్చేవాడు కాదు. వాడు వాడినన్ని రోజులు వాడేసి పక్కన పడేసాడు. అప్పుడు మనం ఆ డొక్కు అయిపోయిన బాక్స్ ని మళ్లీ కొన్ని రోజులు వాడుకుని ఆ కోరిక అలా తీర్చేసుకున్నాం.

అప్పట్లో సైకిల్ మీద స్కూల్ కి వెళ్ళాలనే కోరిక కూడా ఉండేది... కానీ నాకేమో సైకిల్ తొక్కటం రాదు... 7th class లో ఒక స్నేహితురాలి సైకిల్ తీసుకుని కష్టపడి నేర్చుకున్న. అప్పటికే మా అన్నకి సైకిల్ ఉండేది, మరి వాడు అప్పుడు 10th class కదా. అదేంటో నేను సైకిల్ నేర్చుకోగానే మా నాన్నగారికి హైదరాబాద్ transfer అయిపొయింది. ఇక్కడేమో మేము ఉండే కాలనీకి స్కూల్ 10KM దూరంలో ఉండేది... ఇంక సైకిల్ ఎలా వేసుకేల్తం స్కూల్ కి... చచ్చినట్టు బస్ లో వెళ్ళేదాన్ని. ఆ సైకిల్ కోరిక ఇప్పటికీ తీరలేదు...hmm!

ఇంక ఇలాంటి చిన్న(పెద్ద) కోరికలు చాలా ఉండేవి.... లంచ్ బాక్స్ ని స్కూల్ బాగ్ లో కాకుండా ఒక బాస్కెట్ లో పెట్టుకుని తీసుకెళ్లాలని.... ఇంకా మంచి డిజైన్లు ఉన్న స్వెటర్లు వేసుకోవాలని (మరి మా స్కూల్ లో మరూన్ కలర్ తప్ప వేరేది వేసుకోనివ్వరు)... మా అన్నని నేను కొడితే వాడు ఏడవాలి కానీ తిరిగి నన్ను కొట్టకూడదని... ఇలా ఏవేవో కోరికలుండేవి...
వాటిలో కొన్ని అప్పుడు తీరాయి... చాలా ఇప్పటికీ తీరలేదు!