Monday, April 20, 2009

ఇలా చేస్తే!? - 2

మనకి ప్రస్తుతం ఉన్న సమస్యల్లో అతి ముఖ్యమైనది.... మన environment కాపాడుకోవటం...
రకరకాల కాలుష్యాల కారణంగా మన తర్వాతి తరాల మనుగడ కుడా ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి వచ్చింది.
అన్నిటికి మనం పరిష్కారం చూపించలేకపోయినా.... కొన్ని విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించొచ్చు.

ప్లాస్టిక్ సంచుల వాడకం ఎంత ప్రమాదకరమైనదో... దాని వలన వాతావరణం ఎంతగా పాడైపోతుందో... మనలో చాలా మందికి తెలుసు. కాని దాన్ని తగ్గించటానికి మనమేం చేస్తున్నాం? అసలేమైనా చేస్తున్నామా?

చిన్నతనంలో ఏ షాప్ కి వెళ్ళినా ఒక బాస్కెట్ పట్టుకుని వెళ్ళినట్టే గుర్తుంది నాకు. కూరగాయలైనా, సరుకులైనా అన్నీ తీసుకెళ్ళిన బాస్కెట్ లేదా బ్యాగ్ లో తెచ్చుకునేవాళ్ళం.
నెమ్మదిగా ప్లాస్టిక్ కవర్స్ usage మొదలైంది... అవి కుడా మొదట్లో డబ్బులు తీసుకుని కవర్స్ ఇచ్చేవారు... డబ్బులెందుకులే పెట్టటం దానికోసం అని అప్పట్లో కుడా బ్యాగ్ లే తీసుకెళ్ళేవాళ్ళం.
కానీ నెమ్మదిగా ఈ ప్లాస్టిక్ కవర్స్ వాడకం బాగా పెరిగిపోయింది... ఎక్కడికి వెళ్ళినా కవర్స్ ఊరికే ఇవ్వటం కుడా దీనికి ఒక కారణం అనుకుంటున్నాను.
కొంతమంది పెద్దవాళ్ళయితే... కొన్ని షాప్స్ కి వెళ్ళినప్పుడు అడిగి మరీ కొన్ని కవర్స్ ఎక్కువ తీసుకుంటారు కూడా!

ఈ కవర్స్ వాడకం ఎంత ప్రమాదకరమైనదో... అందరికీ ఇంకా పూర్తిగా తెలీదు. దీనిగురించి సరైన అవగాహన కూడా ఎంతో మందిలో లేదు.
వీటి వాడకం ఎలా తగ్గించాలో అని ఒక ఫ్రెండ్ తో కలిసి discuss చేసినప్పుడు మాకు తట్టిన కొన్ని పాయింట్స్:

-> ఏ షాప్ లో కూడా కవర్స్ ఊరికే ఇవ్వకూడదు
-> ప్రతి షాప్ లోను కవర్స్ బదులుగా క్లాత్ బ్యాగ్ ఇవ్వాలి (ఇప్పటికే కొన్ని షాప్స్ లో ఇలా చేస్తున్నారు)
-> ఆ షాప్ కి ఇంకొకసారి వెళ్ళినప్పుడు మనం ఆ క్లాత్ బ్యాగ్ తీసుకెళ్తే ఆ షాప్ వాళ్ళు ఎంతోకొంత డిస్కౌంట్ ఇచ్చేలా ఉండాలి
-> ప్రస్తుతానికి ఇది ఒక్కో షాప్ కి విడివిడిగా చేసినా... ముందు ముందు ఒక సెంట్రల్ డేటాబేసు పెట్టి... ఏ షాప్ కైనా బ్యాగ్ ఒకటే ఉండేలా చూడాలి... అంటే ఒక షాప్ లో ఏదైనా కొన్నప్పుడు వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తే... మనం ఆ బ్యాగ్ తీసుకుని ఇంకే షాప్ కి వెళ్ళినా మనకి కొంత డిస్కౌంట్ లభించాలి. (ఇది ఎంత వరకు ఆచరణ సాధ్యమో సందేహమే)

ఇవన్నీ షాప్స్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే... మనం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి...
-> ఎక్కడికి వెళ్ళినా ఒక క్లాత్ బ్యాగ్ దగ్గర ఉంచుకోవాలి. ఏది కొన్నా ఆ బ్యాగ్ లోనే తెచ్చుకోవాలి... కవర్ ఇచ్చినా వద్దు అని చెప్పాలి.
-> చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఈ కవర్స్ వాడకం ఎంత ప్రమాదకరమైనదో వివరించి చెప్పాలి.
-> ఇరుగు పొరుగు వాళ్లకి ఒక క్లాత్ బ్యాగ్ ఇచ్చి, వాళ్ళని కూడా ప్లాస్టిక్ కవర్స్ వాడటం తగ్గించమని చెప్పాలి.
-> కొన్నాళ్ళ క్రితం ఎలా అయితే మార్కెట్ కి బాస్కెట్ తో వెళ్ళేవాళ్ళమో అలా ఇప్పుడు కూడా బాస్కెట్ తీసుకుని వెళ్ళాలి.
-> ఎగ్గ్స్ తెచ్చుకోవటానికి ఒకప్పుడు వాడిన బాక్స్ లాంటివి వాడాలి.

ఇవన్నీ మనం చేయగలిగినవే... ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే... ప్లాస్టిక్ కవర్స్ వాడకం చాలా వరకు తగ్గుతుందని నా అభిప్రాయం.

Wednesday, April 15, 2009

పార్టీ చూసి వోట్ వేయాలా? అభ్యర్ధిని చూసి వేయాలా?



నిన్న సాయంత్రం టీవీలో ఎన్నికల వార్తలు చూస్తుంటే... అమ్మ వచ్చి 'మనం వోట్ ఎలా వేయాలి' అని అడిగింది. 'అదేం ప్రశ్న... ఇప్పటికి ఎన్నిసార్లు వేసావ్... మొన్న కుడా వేసాం కదా' అన్నాన్నేను (PJR పోయినప్పుడు అసెంబ్లీ ఎలెక్షన్ జరిగింది కదా)
'అది కాదు వోట్ వేయటానికి... మజారాజ్యం పార్టీ వాళ్ళు, భారతీయ ఉడతా పార్టీ వాళ్ళు చిట్స్ తెచ్చి ఇచ్చారు కాని... కంగారుస్ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు... మరెలా ఒటెయ్యాలి' అని అడిగింది అమాయకంగా.
'అది కాదమ్మా... అవి ఎవరు ఇస్తే వాళ్ళకే వోట్ చేయాలనీ కాదు... అవి పట్టుకెళ్ళి ఎవరికైనా వోట్ చేయొచ్చు' అని చెప్పా.
'ఒహో అలాగా' అంటూ అక్కడి నుండి వెళ్లిపోబోయింది.
అంతలో నాకేదో బల్బు వెలిగింది... అమ్మని ఆపి... 'అంటే నువ్వు కంగారుస్ పార్టీ కి వేస్తున్నావా వోట్?' అని అడిగాను.
ఏంటి కొత్తగా అడుగుతున్నావ్ అన్నట్టు నావైపు చూసి... ' అంతే కదా మరి' అంది.
'అది కాదమ్మా... ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు... ఇప్పుడు 'జన సత్తా' పార్టీకి వేయమ్మా' అని చెప్పాను.
'అదేం కుదరదు... నాకు వోట్ హక్కు వచ్చినప్పటి నుండి నేను కన్గారూస్ పార్టీ కే వేసాను... ఇప్పుడూ అంతే' అంది మొండిగా.
'అదేంటమ్మా... అప్పుడు ఉన్న పార్టీ జనాలు ఇప్పుడు ఉన్నారా... అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా... పార్టీ పేరు ఉంది కాని... జనాలంతా మారిపోయారు కదా' అన్నాను
'అదంతా నాకు తెలిదు... నేను కన్గారూస్ పార్టీ నే' అంది... తను పట్టిన కంగారుకి మూడే కాళ్ళు అన్న రీతిలో.
ఇంకా తనతో ఎంత వాదించినా ప్రయోజనం లేదని అర్థమైపోయింది.
'సరే నీ ఇష్టం... ఎప్పుడైనా చదువుకున్న వాళ్లకి వోట్ వేయాలి... అంతే కాని పార్టీ చూసి కాదు' అని చెప్పాను.
'...' తన వైపు నుండి మౌనం.
అది నే చెప్పినదానికి అంగీకారమో... నేను మారను అన్న మొండితనమో నాకు అర్థం కాలేదు!

***
నా అభిప్రాయం ప్రకారం అభ్యర్ధిని చూసి... అతను ఎలాంటి వాడో తెలుసుకుని... అతనికి కనీస అర్హత(చదువు) ఉందొ లేదో తెలుసుకుని వోట్ వేయాలి కానీ... ఇలా పార్టీని చూసి కాదు.
ఒక పార్టీలో అందరు మంచివారే , చదువుకున్నవారే ఉంటారా? మరి అలా ఉండనప్పుడు పార్టీని చూసి ఎవరికంటే వారికి వోట్ చేయలేము కదా!

అలా ఆలోచిస్తుంటే మెదడులో ఇంకో బల్బు వెలిగింది...
మరి జన సత్తా పార్టీలో అభ్యర్దులు ఎవరో అసలు ఎంతమందికి తెలుసు? మా నియోజకవర్గంలో అంటే జన సత్తా నాయకుడే నిలబడ్డారు కాబట్టి... ఆయన గురించి తెలుసు కాబట్టి వోట్ చేస్తాం. మరి మిగత నియోజక వర్గాల సంగతి ఏంటి? అప్పుడెప్పుడో 'జీడిపప్పు' గారు అన్నట్టు... ముక్కు మొహం తెలియని అభ్యర్దికి వోట్ ఎలా వేస్తారు. అలా వేస్తే... ఇక్కడ కుడా పార్టీని చూసి వేసినట్టే కదా!

అంటే ఇప్పుడు పార్టీని చూసి వోట్ వేయాలా? లేక అభ్యర్థిని చూసి వేయాలా?

(నేనయితే ప్రస్తుతానికి రెండూ చూస్తున్నాను... అసెంబ్లీకి అభ్యర్థిని చూసి... పార్లమెంటుకి పార్టీని చూసి (అభ్యర్ది గురించి కూడా కొంచం తెలుసుకున్నానులెండి) వేయబోతున్నాను)

picture courtesy: internet

Tuesday, April 14, 2009

Monday, April 13, 2009

Be an Indian

ఒక అమెరికన్ ఇండియా సందర్శించి మళ్లీ అమెరికా తిరిగి వెళ్ళాడు.

అక్కడ అతని ఇండియన్ స్నేహితుడు ఒకతను "మా ఇండియా ఎలా ఉంది?" అని అడిగాడు.

అమెరికన్ ఇలా చెప్పాడు "అది నిజంగా చాలా గొప్ప దేశం. చాలా ప్రాచీనమైన చరిత్ర, మంచి మంచి వనరులు కలిగి ఉంది. "

అప్పుడు ఇండియన్ ఇలా అడిగాడు సంతోషంగా "మరి మా ఇండియాన్స్ ఎలా అనిపించారు?"

దానికి ఆ అమెరికన్ సమాధానం... "ఇండియాన్సా? నాకెవరూ కనిపించలేదే?
కాశ్మీర్ లో ఒక కాష్మిరిని కలిసాను.
పంజాబ్ లో ఒక పంజాబిని కలిసాను.
బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్ లో ఒక బీహారిని, మరాఠిని, తమిళియన్ ని, బెంగాలీని కలిసాను.
తర్వాత... ఒక ముస్లిం ని, క్రిస్టియన్ ని, జైన్ ని, బుద్దిస్ట్ ని కలిసాను.
ఇంకా ఇలా చాలా మందిని కలిసాను... కానీ ఎక్కడా ఒక ఇండియన్ ని కలవలేదు!

PS: ఓ ఈ-మెయిల్ ఆధారంగా...

***

మనం అందరం indians అనిపించుకోవాలంటే... ప్రాంతీయాభిమానం, కులాభిమానం, మతాభిమానాలకి అతీతంగా మన ఓటు వేయాలి...!

Be an Indian.

Sunday, April 12, 2009

ఇలా చేస్తే!? - 1

మన దేశంలో కావలసినన్ని సమస్యలున్నాయి... అన్నిటికి పరిష్కారం ఉందో లేదో నాకు తెలీదు కానీ... నా చిన్ని మెదడులోకి వచ్చిన కొన్ని ఆలోచనలు చెప్పాలనుకుంటున్నాను.

***

మనలో దాదాపు అందరూ రోజూ ఎదుర్కొనే సమస్య... గతుకుల, గుంటలు పడిన రోడ్లు.

అదేంటో గాని... ఇలా మన R&B వాళ్ళు రోడ్లు వేయగానే... అలా మన టెలికాం శాఖా వారికో, మున్సిపాలిటీ వారికో, మరోకరికో సడన్ గా లైట్ వెలుగుతుంది. వెంటనే పారలు, పలుగులు పట్టుకుని రెడీ అయిపోతారు... వేసిన రోడ్డు త్రవ్వటానికి.
ఎప్పుడో విన్నాను... అలా ఎవరైనా రోడ్డు త్రవ్వితే మళ్లీ ఆ రోడ్డుని అలాగే బాగుచేసి వేయాలి అనే రూల్ ఏదో ఉంది అంట... కానీ నేనెప్పుడు ఎక్కడా అలా త్రవ్వేసిన రోడ్డుని వాళ్ళే బాగుచేసి వేయటం చూడలేదు మరి! మహా అయితే ఏదో దయ తలచి అలా పై పైన పూడ్చేసి వెళ్ళిపోతారు అంతే. మరి ఆ సంబంధిత అధికారులు త్రవ్వటానికి పర్మిషన్ ఇస్తారు కానీ ఇలా తర్వాత వాళ్ళు ఆ రోడ్ బాగు చేసారా లేదా అనేది ఎందుకు పట్టించుకోరో ఏంటో!
ఇంకా... ఎంతో ఖర్చు పెట్టి హుంగామాగా రోడ్లు వేస్తారు... అవేమో ఒక్క వర్షం రాగానే ఠపీమని కొట్టుకుపోతాయి.

ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే... రోడ్లు అలా ఒకే దెబ్బకి పాడైపోకుండా గట్టిగా ఉండాలంటే ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే... ఇప్పుడు రోడ్లు వేయటానికి కాంట్రాక్టు ఎవరో ఒకరికి ఇస్తారు కదా... వాళ్ళేమో డబ్బంతా తినేసి నాసి రకం రోడ్లు వేస్తారు. అలా కాకుండా... వేసిన రోడ్డుకి minimum గారెంటీ ఇవ్వాలి ఆ కాంట్రాక్టర్. అంటే ఉదాహరణకి ఒక సంవత్సరమో, రెండు సంవత్సరాలో లేక అయిదు సంవత్సరాలో... దాని పరిమితిని బట్టి.
ఈలోగా కనుక ఆ రోడ్డు పాడైపోయిందంటే ఆ కాంట్రాక్టర్ మొత్తం ఖర్చు భరించి మళ్లీ రోడ్డు వేయించాలి.
ఇలా చేస్తే చచ్చినట్టు మంచి రోడ్లు వేస్తారని నా ఆలోచన.
ఇంకా రోడ్లు త్రవ్వమని పర్మిషన్ ఇచ్చిన అధికారే ఆ రోడ్లు మళ్లీ బాగుచేసారా లేదా అనేది చూసుకోవాలి. ఆ త్రవ్విన వాళ్ళు మళ్లీ రోడ్లు వేయలేదంటే... ఆ అధికారి వేయించాల్సి ఉంటుంది.

ఈ విషయాల్లో కాస్త స్ట్రిక్ట్ గా ఉండగలిగితే... మనకి మంచి రోడ్లు వస్తాయని నా ఆలోచన.

మరి మీరేమంటారు?

Thursday, April 9, 2009

Colors of India



medium: watercolors

Tuesday, April 7, 2009

తెలుగులో కొత్తపదాలు ఇష్టపడే వారికి...

ఈ పోస్టు అంకితం :D

గమనిక: ఈ పోస్టు ఎవరినీ ఉద్దేశించి, ఎవరినీ కించపరచటానికి రాసింది కాదు. కేవలం సరదాగా రాసింది. మరోలా భావించవద్దని మనవి.

అదొక ఆదివారం... అందమైన సాయంత్రం... కాకపోతే కాస్త గాలిదుమ్ము...
ఏదో పని మీద (నిజానికి బండి మీద) అబిడ్స్ వెళ్లాను ఒక ఫ్రెండ్ తో కలిసి. అక్కడ మేము వెళ్ళిన పని కావటానికి కొంత సమయం వెయిట్ చేయాల్సి వచ్చింది. సరే ఈలోగా అందమైన (ఇరుకైన) అబిడ్స్ వీధుల్లో (సందుల్లో) అలా తిరిగి వద్దామని... వ్యాహ్యాళికి వెళ్ళాము (వ్యాహ్యాళి అంటే తెలీకపోతే జంధ్యాల గారి "చూపులు కలిసిన శుభవేళ" సినిమా చూడండి).

అబిడ్స్ జగదీష్ మార్కెట్ కి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళకపోతే ఒకసారి తప్పకుండా వెళ్ళండి... హైదరాబాద్ లో చార్మినార్ తర్వాత చూడదగ్గ గొప్ప ప్లేస్ అది. మీ జేబుకి తెలీకుండా మీ మొబైల్ కొట్టేసి మీకే అమ్మగల ఘనులుంటారు!
ఆ జగదీష్ మార్కెట్ పక్క వీధుల్లో అలా నడుస్తూ వెళ్తుంటే నా ఫ్రెండ్ సడన్ గా ఆగిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు. ఎంటా అంత వింతైన విషయం అని నేను కుడా చూసాను. నేను కుడా అలాగే చూస్తుండిపోయాను. కొన్ని క్షనాలయ్యాక ఇద్దరం ఒకరినొకరం చూసుకున్నాం. ఇలా చుసుకోవటాలన్నీ అయిపోగానే... వెంటనే మొబైల్ బయటకి తీసి ఆ దృశ్యాన్ని బంధించాము.

అక్కడ మేము చూసింది... ఇక్కడ మీరు చూడండి...


ఇప్పుడు అర్థమయిందా ఈ పోస్టు తెలుగులో కొత్త పదాలు ఇష్టపడే వారికి ఎందుకు అంకితం చేసానో :P

Friday, April 3, 2009

నేను ఖండిస్తున్నాను!

అవును... నేను ఖండిస్తున్నాను. మాములుగా కాదు... తీవ్రంగా.
ఇంతకీ దేన్ని ఖండిస్తున్నానో చెప్పలేదు కదూ...
ఒక విషయంలో తరతరాలుగా ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని.
ఆ విషయం ఏంటంటే... ఒక అమ్మాయిని చూడగానే ఆమెకి పెళ్లి అయిందో లేదో చాలా తేలిగ్గా చెప్పేయొచ్చు. కాని ఒక అబ్బాయిని చూసి అలా చెప్పగలమా!
ఇది ఆడవాళ్లకు ఎంత పెద్ద అన్యాయం!?
అబ్బాయిలకి ఒక అమ్మాయి నచ్చిందంటే... కాలు వేలు చూసో, పాపిట్లో సింధూరం చూసో, మెడలో తాళి చూసో ఆమెకి పెళ్లి అయిందో లేదో confirm చేసేసుకుంటారు.
కానీ అమ్మాయిలకి ఆ ఫెసిలిటి లేదు! అబ్బాయి నచ్చినా... అతనికి పెళ్లి అయిందో లేదో తేలిక... ఎందుకొచ్చిన గొడవలే అని వదిలేయాల్సి వస్తుంది. అంతే కాదు... వాళ్ళకి పెళ్లైందని చెప్పే గుర్తులేమి లేకపోవటం వలన... ఈ మగాళ్ళంతా పెళ్ళయ్యాక కుడా వెర్రి వేషాలు వేసే అవకాశం ఇచ్చినట్టవుతుంది. హుహ్... ఇది అన్యాయం కాదా!
ఈ అన్యాయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

అబ్బాయిలకి కూడా పెళ్లి అయింది అని చెప్పటానికి ఏదో ఒక గుర్తు ఉండాలి. మొన్నామధ్య వరకు బట్ట తల ఉంటే... వాళ్ళకి పెళ్లి అయింది అనుకునే వాళ్ళం (భార్య చేతిలో పడి జుట్టు ఊడిపోతుంది కదా). కానీ ఇప్పుడు అది కుడా కన్ఫ్యూజనే... ఇప్పుడు బట్టతల అందరికి వచ్చేస్తుంది కదా మరి...!
కాబట్టి నే చెప్పొచ్చేది ఏంటంటే... పెళ్ళయిన మగాళ్ళకి కూడా ఏదో ఒక గుర్తు ఉండాలి ఆ సంగతి తెలియటానికి.
కొన్ని దేశాల్లో అయితే... పెళ్లి ఉంగరం పెట్టుకోవటం అనేది ఒక సెంటిమెంట్... అది చూసి ఇట్టే చెప్పేయొచ్చు అతనికి పెళ్ళైపోయింది అని. కానీ మన దగ్గర అదేమీ compulsory కాదు కదా!

ఈ మధ్య టీవీ లో 'భరణి' సినిమా చూసాను. అందులో ప్రభుకి నదియా కాలికి మెట్టెలు పెడుతుంది... ప్రభు పెళ్ళయిన వాడని... అతని వంక అమ్మయిలెవరు తప్పుగా చూడకూడదు అని. అదేదో బాగానే ఉంది అనుకున్నా కానీ... అదంటే సినిమా కాబట్టి ఏం మాట్లాడకుండా పెట్టుకున్నాడు ప్రభు... బయట ఏ అబ్బాయి అలా పెట్టుకుంటాడు.
అసలు ఈ పద్దతులన్నీ కనిపెట్టింది కుడా మగాళ్ళే... అందుకే వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా చూసుకున్నారు... స్వార్థపరులు..హుహ్.

అందుకే నే చెప్పేదేంటంటే... పెళ్ళయిన అబ్బాయిలని గుర్తించేలాగా ఏదో ఒక గుర్తు ఉండాలి... అది కాలి మెట్టైనా కావొచ్చు... చేతి ఉంగరమైనా కావొచ్చు... మరేదైనా కావొచ్చు.
"మార్పు మార్పు" అని మొత్తుకుంటున్న మజా రాజ్యం పార్టీ వాళ్ళు ఈ విషయంలో కుడా "మార్పు" తేవాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను.
అసలే ఇది ఎన్నికల టైం కదా... ఇప్పుడైతేనే ఇలాంటివి బాగా వర్కౌట్ అవుతాయి... కాబట్టి అమ్మాయిలూ... ఇక మొదలెట్టండి... రాస్తా రాకో చేసైనా... అవసరమైతే నిరాహార దీక్ష కుడా చేసైనా... ఎలాగైనా ఈ విషయంలో మనకి న్యాయం జరిగేలా పోరాడాలి.
అప్పటి వరకు తర తరాలుగా జరుగుతున్న ఈ ఘోరమైన అన్యాయాన్ని నేను ఖండిస్తూనే ఉంటాను!