Wednesday, October 6, 2010

అయిపోయింది

2005 సంవత్సరం...

కొత్తగా జె ఎన్ టి యు నుండి హైటెక్ సిటీ కి డబుల్ రోడ్ వేసారు.
"హమ్మయ్య... ఇప్పుడు రోజూ చుట్టూ తిరిగి ఆ మియాపూర్ వైపు నుండి ఆఫీసు కి వచ్చే బాధ తప్పింది" అనుకున్నాడు రాంబాబు.

రాంబాబు కూకట్ పల్లి లో ఉంటాడు. హైటెక్ సిటీ లో ఉన్న 'ఏదోసాఫ్ట్' అనే సాఫ్ట్వేర్ కంపెనీ లో పని చేస్తున్నాడు. ఇప్పుడు కుకట్ పల్లి నుండి ఆఫీసు కి వెళ్ళటానికి కొత్త దారి (దగ్గరి దారి) పడటంతో అతనికి చాలా ఉత్సాహంగా ఉంది. రోజూ ఆ కొత్త రోడ్ లో జుం అంటూ తన టీవీఎస్ స్కూటీ మీద 30 స్పీడ్ లో వెళ్ళిపోతున్నాడు.
అలా కొంత కాలం లైఫ్ జనం లేని సిటీ బస్సు లాగా హాయిగా సాగిపోయింది.
ఆ దారిలో ఒక రైల్వే ట్రాక్ ఉంది. అక్కడ మాత్రం కొంత దూరం బ్రిడ్జి క్రింద నుండి ఉన్న ఇరుకు దారిలో వెళ్ళాలి. పోను పోను ఆ చుట్టూ పక్కల ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా అదే దారిన వెళ్ళటం మొదలుపెట్టేసరికి ట్రాఫ్ఫిక్ మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంది.

2006 సంవత్సరం ...


ఆ రోడ్ కి రోజు రోజు కి పెరుగుతున్న డిమాండ్ చూసి ప్రభుత్వం వారు ఎంతో విశాల హృదయం తో ఆ రైల్వే బ్రిడ్జి దాటటానికి ఒక ఫ్లై ఓవర్ వేయాలని నిర్ణయించారు.
అక్కడ ఫ్లై ఓవర్ పనులు మొదలు కావటం చుసిన రాంబాబు ఆనందంతో కొన్ని రోజులు గాల్లో తేలిపోతూ ఆఫీసు కి వెళ్ళాడు.
"ఆ ఫ్లై ఓవర్ కాస్తా అయిపోతే... ఇంక అప్పుడు ఆఫీసు కి పది నిముషాల్లో వెళ్లిపోవచ్చు" అనుకున్నాడు.
ఫ్లై ఓవర్ పనులు ఎంత వేగంగా సాగుతున్నాయో... అంతకి 20 రెట్లు వేగంగా ఆ దారిలో ట్రాఫ్ఫిక్ పెరుగుతూ పోయింది. ఆ ట్రాఫ్ఫిక్ వలన హైటెక్ సిటీ దగ్గర ఉన్న సిగ్నల్ వద్ద కూడా జాం అవ్వటం మొదలయింది. రోడ్ వేసిన కొత్తలో 25 నిముషాల్లో ఆఫీసుకి వెళ్ళిన రాంబాబు ఇప్పుడు గంటకి కానీ ఆఫీసు చేరటం లేదు.

2008 సంవత్సరం...


హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర ఉంటున్న ట్రాఫ్ఫిక్ జాం చూసి... ప్రభుత్వం వారు మరింత విశాల హృదయంతో అక్కడ కూడా మరొక ఫ్లై ఓవర్ వేయటం మొదలుపెట్టారు. దాని కోసం అక్కడ కాస్త ట్రాఫ్ఫిక్ డైవర్షన్ జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పటి నుండి రాంబాబు ఇంటి నుండి బయలుదేరిన గంటా ముప్పై నిముషాలకి ఆఫీసు చేరేవాడు.
వర్షా కాలం లో అది ఒక్కోసారి రెండు గంటలు కూడా అయ్యేది.

2010 సంవత్సరం...

"మొత్తానికి ఈ సంవత్సరం అయ్యేలోపు ఈ హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పూర్తయింది... దాని మీద నుండి వెళ్తే ఇప్పుడు నీకు అంత టైం పట్టదేమో కదా ఆఫీసు కి వెళ్ళటానికి" అన్నాడు రాంబాబు పక్క ఇంట్లో ఉండే సోంబాబు.
"మా ఆఫీసు ఆ సిగ్నల్ పక్కనే ఉన్న సైబర్ టవర్స్ లో ఉంది... ఆ ఫ్లై ఓవర్ కింద నుండే నేను ఆఫీసు కి వెళ్ళాలి..." అని బిక్క మొహం పెట్టాడు రాంబాబు.


....
...
...

"తాతా తాతా... మరేమో... ఆ రైల్వే ట్రాక్ దగ్గర కడుతున్న ఫ్లై ఓవర్ అయిపోయిందంట... టీవీ 10 న్యూస్ ఛానల్ లో చెబుతున్నారు" అన్నాడు బాబు.
"ఆ... అయిపోయిందా... అది అయిపోయిందా... ఈ జన్మ లో అది చూస్తాననుకోలేదు... నా చిరకాల కోరిక ఇన్నాళ్ళకి నెరవేరిందా" అని ఆనందంతో చెమర్చిన కళ్ళని తుడుచుకున్నాడు రాంబాబు.
అన్నట్టు అది 2050 సంవత్సరం!!

ఆనందంగా వెళ్లి టీవీ 10 ఛానల్ పెట్టాడు.
టీవిలో ఇంటర్వ్యూ వస్తుంది...
"మన దేశానికి ఇంతటి ప్రతిష్టాత్మకమైన గుర్తింపు తెచ్చారు కదా... దీని మీద మీ స్పందన ఏంటి?" అడిగాడు యాంకర్ R & B అధికారిని.
"నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి గొప్ప సంఘటన నేను పదవిలో ఉండగా జరగటం ఇంకా సంతోషంగా ఉంది" అని తన హర్షం వ్యక్తం చేసాడు ఆ అధికారి.
ఇంతకీ అంతటి ప్రతిష్టాత్మకమైన గుర్తింపు ఏమిటా అని స్క్రోలింగ్ చూసాడు రాంబాబు...
"ప్రపంచంలోనే ఎక్కువ సమయం (44 సంవత్సరాలు) తీసుకుని నిర్మించిన ఫ్లై ఓవర్ గా ఇది గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది"
"భవిష్యత్తులో ఇలాంటి రికార్డ్స్ మరెన్నో సృష్టించి... దేశానికి గొప్ప పేరు తెస్తామని R & D ఉద్యోగులు వ్యాఖ్యానించారు"
...ఇలా సాగిపోతుంది స్క్రోలింగ్!



గమనిక: ఒకవేళ 2050 సంవత్సరానికి కూడా ఆ ఫ్లై ఓవర్ పూర్తి కాకపోతే నాకెటువంటి సంబంధం లేదు. అప్పుడు ఈ పోస్ట్ చదివిన వాళ్ళెవ్వరూ నా మీద కేసు వేయరాదని మనవి.

Tuesday, July 6, 2010

మౌనమే నీ భాష...!!

ఎక్కడి నుండో మేఘం వచ్చింది...
కుదురుగా ఉన్న కొలనులో... తొలకరి వాన చినుకు పడింది!
అలజడి మొదలైన కొలను ఇంకా కావాలంటూ ఆకాశం వైపు చూసింది...
మేఘానికి కొలను పడుతున్న ఆరాటం నచ్చింది... ఇంకా కురిసింది!
తనలోని చివరి బొట్టు వరకు
కొలను కోసమే కురవాలనుకుంది!

వాన నీటితో కొలను తుళ్ళి పడుతూ అటూ ఇటూ పరుగు తీసింది...
సెలయేరై అటుగా పారుతున్న నదివైపు సాగింది...!
నది వైపు వెళ్ళిపోతున్న కొలనుని చూసి మేఘానికి దిగులుగా ఉంది...
అయినా... తను కొలను కోసమే ఉన్నాననుకుని కురుస్తూనే ఉంది!

అప్పుడప్పుడూ... 'కురవవేం' అని అడిగినట్టు కొలను మేఘం వైపు చూస్తుంది...
ఎదురుచూపే చాలన్నట్టు.. ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నట్టు...మురిసిపోయి కురుస్తూనే ఉంది మేఘం!
మేఘం కురవగానే... తుళ్ళుతూ పారుతూ ఏరై మళ్ళీ నదివైపు పారుతుంది కొలను!
కొలను కోసం పడుతున్న ఆరాటం మేఘంలో తడి తగ్గనివ్వటం లేదు... కురుస్తూనే ఉంది మేఘం!

కాసేపు మేఘం వైపు చూపు... అది కురవగానే...
మేఘం తనని వదిలేయదని నమ్మకంతో... నది వైపు పరుగు!
మెల్లిగా కొలను... ఏరై నదిలో కలిసిపోతుంది...!

నదిలో కలిసిన కొలనుని చూసి... ఇక తన అవసరం లేదనుకున్న మేఘం...
భారంగా అక్కడి నుండి కదిలింది...!

కానీ కొలనుకి తెలుసు... మేఘం లేకపోతే తనకి ఉనికే లేదని!
సాగిపోతున్న మేఘం వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయింది!


Picture Courtesy: Internet

Friday, July 2, 2010

Global Warning!!!







Courtesy: Mail

Friday, June 25, 2010

అదీ సంగతి!

సరిగ్గా సంవత్సరం క్రితం...
మా టీం అంతా హోల్లాండ్ లో ఉన్నప్పుడు, కంపెనీ కిక్ ఆఫ్ మీటింగ్ మెయిల్ వచ్చింది. మొత్తం అన్ని దేశాల్లోని బ్రాంచెస్ లో ఒకేసారి పెట్టారు ఆన్లైన్ కాన్ఫరెన్స్ ఉపయోగించి.
అక్కడి సమయం ప్రకారం, సాయంత్రం 4 గంటలకి మీటింగ్ మొదలవుతుంది. ఒక 3 గంటల మీటింగ్ తర్వాత డిన్నర్ ఉంటుంది అని చెప్పారు.
అందరం కలిసి ఒక dutch కల్లీగ్ తో అతని కార్ లో మీటింగ్ ఏర్పాటు చేసిన హోటల్ కి వెళ్ళాము.

మీటింగ్ మొదలయ్యే ముందే కొంచం స్నాక్స్ ఏర్పాటు చేసారు. తర్వాత మీటింగ్ మొదలయ్యింది. దాదాపు మూడు గంటలసేపు అయినా ఇంకా కొన'సాగుతుంది'. అంతలో మాతో వచ్చిన ఇండియన్ టీం మేట్ ఒకతను రెస్ట్ రూం కి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళాడు. అతని బాగ్ నా చేతికి ఇచ్చి వెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే... మీటింగ్ అయిపోయింది. అందరం డిన్నర్ హాల్ కి వెళ్ళిపోయాం.
డిన్నర్
చేసేంతసేపు అతని కోసం చూసాం కాని కనిపించలేదు. కంపెనీ జనం అందరు ఉండటం వలన, వాళ్ళలో ఎక్కడో ఉండే ఉంటాడులే అని పెద్దగా పట్టించుకోలేదు. నెమ్మదిగా ఒక్కొక్కరు వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. చివరికి మా టీం మాత్రమే మిగిలింది అక్కడ. మాకు ఏం చేయాలో తెలియటం లేదు. అతని దగ్గర మొబైల్ కూడా లేదు. అందరికి ఒకటే టెన్షన్... ఎంతైనా పరాయి దేశం కదా మరి. బాగ్ కూడా మా దగ్గరే ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయే అవకాశం లేదు.
ఎందుకో సడన్ గా అనుమానం వచ్చింది... రెస్ట్ రూం కి వెళ్ళాడు కదా... పొరపాటున అక్కడ లాక్ అయిపోయాడేమో అని! వెంటనే అందరం తలా ఓ వైపు వెళ్లి ఆ హోటల్ లో ఉన్న రెస్ట్ రూమ్స్ అన్ని వెతికాం. ఎక్కడా కనిపించలేదు.
రిసెప్షన్ దగ్గరకి వచ్చి అనౌన్స్మెంట్ ఇప్పించాం... ఎక్కడ ఉన్నా అది విని వస్తాడేమో అని. అయినా లాభం లేదు. అంతలో ఒక dutch కల్లీగ్ కనిపిస్తే ... అతని ఫోన్ నుండి మా గెస్ట్ హౌస్ నెంబర్ కి కాల్ చేసాం... ఒకవేళ వెళ్లిపోయాడేమో అని. ఎవరూ లిఫ్ట్ చేయలేదు.... అంటే ఆతను ఇంకా ఇంటికి వెళ్ళలేదు అన్నమాట. మరి ఏమయిపోయినట్టు!?
కొంచం కొంచంగా అందరిలో భయం, టెన్షన్ పెరుగుతుంది.
ఆ చుట్టుపక్కలంత రోడ్స్ కూడా వెతికి వచ్చాం. ఎక్కడా కనిపించలేదు. చివరికి ఏం చేయాలో అర్థం కాక... ఆ హోటల్ రిసెప్షన్ దగ్గరకి వెళ్లి లాప్ టాప్ ఓపెన్ చేసి అతని ఫోటో చూపించాం. ఒక కవర్ లో కొంత డబ్బు పెట్టి దాని పైన ఆతను పేరు, నా పేరు రాసి... "ఈ ఫోటోలో అతను వస్తే,ఈ కవర్ ఇవ్వండి" అని వాళ్లకి అర్థమయ్యే భాషలో చెప్పి బయటపడ్డాం. అతని బాగ్ కూడా మా దగ్గరే ఉండటం వలన (ఆ బాగ్ లోనే అతని పర్స్ ఉంది) అతను ఇంటికి ఎలా చేరుకుంటాడా అని మా బాధ.

ఆలోచిస్తూ నెమ్మదిగా ఏదో బస్ పట్టుకుని ఇంటి దగ్గర దిగాం. అంతసేపు ఎవరి మొహంలో జీవం లేదు. అందరికి ఒకటే భయం... అతనేమయిపోయాడో అని.
అలా కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్లి చూస్తే... అతను అక్కడే ఉన్నాడు. హ్యాపీ గా టీవీ చూస్తూ ఏదో డ్రింక్ తాగుతూ కుర్చుని ఉన్నాడు. మమ్మల్ని చూడగానే 'ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అందరు?' అని అడిగాడు. అంతే... ఒక్క క్షణం అందరం ఒకరి మొహాలు ఒకరం చూసుకుని... అందరం కలిసి అతని మీద ఎటాక్ చేసాం!
ఎందుకు చెప్పకుండా వచ్చేసావ్ అని అడిగితే... డిన్నర్ ఉందని అతనికి తెలియదట... మేమెవ్వరం కనిపించలేదని... మేము ఇంటికి వచ్చేసాం అనుకుని వచ్చేసా అని చెప్పాడు. అంతమందిమి అతనొక్కణ్నే వదిలేసి... అతని బాగ్ కూడా తీసుకుని మేము ఇంటికి వచ్చేసాం అని అనుకున్నాడట! మేమైతే నమ్మలేదు మరి!

"Different people think in different ways" అంటే ఇదేనా!?


Photo courtesy: Internet.

Monday, May 3, 2010

ఎవరి లైఫ్ వాళ్ళది కాదా!?

చిరంజీవి "ఇద్దరు మిత్రులు" సినిమా చూసినప్పుడు ఇంకెప్పుడూ సినిమాలు చూడకూడదు అనిపించింది. చిరంజీవి ఏంటి ఇంత చెత్త సినిమా చేసాడు అనుకున్నాను. స్టొరీ మరీ ఓవర్ గా చెప్పాడు అని కూడా అనిపించింది.
కానీ ఈ మధ్య ఎదురవుతున్న కొన్ని సంఘటనలు, అనుభవాలు చూసాక... ఆ సినిమా ఒకసారి మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎంతైనా బయట అందరి జీవితాల్లో జరిగేదే కదా సినిమాల్లో చూపిస్తారు. అంతా కాకపోయినా చాలా వరకు!

ఆ సినిమాలో ఒక అమ్మాయి, అబ్బాయి స్నేహితులుగా ఉంటే వచ్చే చిక్కుల గురించి చూపించారు. ఒకప్పుడు అది అంతా ఓవర్ గా అనిపించినా..ఇప్పుడు అది చాలా వరకు నిజమే అనిపిస్తుంది నాకు. సినిమాలో అంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ కూడా వాళ్ళని, వాళ్ళ స్నేహాన్ని అర్థం చేసుకోలేదని చూపించారు. వాళ్ళు అర్థం చేసుకోగానే కథ సుఖాంతం అయిపోతుంది.
కానీ నిజానికి బయట అలా ఉండదు. ఇలాంటి స్నేహాలు కొనసాగాలంటే కేవలం భార్య భర్తల మధ్య understanding ఉంటే సరిపోదు... చుట్టూ ఉండే జనాలు కూడా అర్థం చేసుకోవాలి.



ఒకప్పుడు కాలేజిలో అమ్మాయి, అబ్బాయి కలిసి నాలుగు సార్లు కనిపిస్తే సరదాగా ఏడిపించటం చూసాను. కానీ ఎంతో చదువుకున్న వాళ్ళు, పెద్ద వాళ్ళు కూడా... ఏమీ తెలుసుకోకుండా అలా కాస్త చనువుగా కనిపించే అమ్మాయి, అబ్బాయిని కలిపి రకరకాల రూమర్స్ ప్రచారం చేయటం ఇప్పుడు చూస్తున్నాను. ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళైనా... లేదా ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైనా అది వాళ్లకి అనవసరం. కళ్ళతో ఏదో చూస్తారు... నోటి దగ్గరకి వచ్చేసరికి దాన్ని మార్చేసి ప్రచారం చేస్తారు. అది ఎదుటి వారి చెవులని చేరేసరికి మరో రకంగా మారిపోతుంది. ఒక మనిషికి తన లైఫ్ కంటే ఎదుటి వారి లైఫ్ అంటేనే ఎక్కువ ఆసక్తి అని ఇలాంటివి చూసినప్పుడు అర్థమవుతుంది! ఎంత కార్పోరేట్ ఆఫీసులు అయినా... ఎంత చదువుకున్న వాళ్లైనా... ఎంత పెద్ద హోదాల్లో ఉన్నా... వాళ్ళు ఆలోచించే నైజం మారదుగా!

నిజానికి వాళ్ళ family వాళ్ళ స్నేహాన్ని అర్థం చేసుకున్నా కూడా... ఇలా పిచ్చి పిచ్చి ప్రచారాలు చేసే పనిలేని జనాల వలన... అటువంటి ప్రచారాల వల్ల కలిగే ఇబ్బందుల వలన... మంచి స్నేహాన్ని వదిలేసుకుంటారు కొంతమంది. ఎవరేమనుకుంటే ఏంటి... తను చేసేది తప్పు కాదని తనకి తెలిసినప్పుడు, అర్థం చేసుకోగల భార్య, లేదా భర్త ఉన్నప్పుడు... ఇలాంటివన్నీ పట్టిచుకోనక్కర్లేదని వదిలేస్తారు మరి కొంతమంది. నా అభిప్రాయంలో అదే కరెక్ట్.

ఆడ, మగ కలిసి కనిపిస్తే చాలు... తప్పుగా అనుకునే వాళ్ళ చీప్ థింకింగ్ కి అంత ఇమ్పార్టన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. కానీ మంచి స్నేహితులు ఎప్పుడో కానీ దొరకరు. అలాంటి పని పాట లేని జనం కోసం అరుదుగా దొరికే విలువైన స్నేహాన్ని వదులుకోవలసిన అవసరం లేదు. After all, we have only one life! Why let someone else decide how should it be?


--

ఈమధ్య ఒక కొత్త చట్టం వచ్చింది కదా. ఇకనుండి ఆడ, మగానే కాదు... ఇద్దరు ఆడవాళ్ళూ లేదా ఇద్దరు మగవాళ్ళు కాస్త చనువుగా కనిపించినా కూడా ఇలాంటి రూమర్స్ వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. మన జనానికి ఇంకో పనేమీ లేదు కదా మరి.

Friday, February 19, 2010

ఒక్క పుట్టకలోనే... ఇన్నిన్ని మరణాలా!

ఎందుకో తెలీదు కానీ... ఈ పాట వినగానే బాగా నచ్చేసింది. రెండు రోజుల నుండి అదే పనిగా వింటూనే ఉన్నాను. విన్నకొద్దీ వినాలనిపిస్తుంది.
సిరివెన్నెల గారి మహత్యం ప్రతి పదంలోనూ కనిపిస్తుంది. కార్తీక్ గొంతులో ఉన్న మేజిక్ కూడా తోడయింది.
పాట వింటుంటే... చాలా చెప్పాలనిపిస్తుంది కానీ... ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం సిరివెన్నల గారి గురించి!
ఒక ఇళయరాజా... ఒక ఏసుదాస్... ఒక సిరివెన్నెల.
అంతకన్నా ఏం చెప్పగలం!

***




ఎందుకు ఎందుకు ఎందుకు నను పరిగెత్తిస్తావెందుకు
ఆకలి తీర్చని విందుకు నన్నాకర్షిస్తావెందుకు
దరికి రానీక నింగి శశిరేఖ
పొదువుకోనీక వదులుకోనీక
ఇంతగా చితిమంటలా నన్నంటుకోవాలా
సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు ||

పాలనవ్వుల రూపమా నను తాళనివ్వని తాపమా
దారి చూపని దీపమా జత చేరనీయని శాపమా || పాలనవ్వుల ||
తళతళ తళతళ కత్తుల మెరుపై కళ్ళను పొడిచేలా
తెరవని తలుపై తెలియని మలుపై కలవరపరిచేలా
నువ్వు నా సొంతమనే అత్యాశ అలిసేలా
నేనెంత ఒంటరినో ఒట్టేసి తెలిపేలా
జంటగాని జంటలా నా వెంట నడవాలా

సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు ||

నీవు నింపిన ఊపిరే నా గుండె దహిస్తుంటే ఎలా
నీవు పెంచిన ఆశలే నరనరాన్ని కోస్తుంటే ఇలా || నీవు నింపిన ||
సలసల మరిగే నిప్పుల మడుగై నెత్తురు ఉడికేలా
నిలువున నీలో కరగని కోరిక విలవిలలాడేలా
ఒక్క పుట్టుకలోనే ఇన్నిన్ని మరణాలా
ఎంత దగ్గర ఉన్నా దక్కని వరమాల
నన్నిలా ఉరితాడుతో ఉయ్యాలలూపాలా

సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు ||

చిత్రం: నేను (2004)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్ర్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కార్తిక్

Monday, February 15, 2010

కేడి

మా నాగార్జున సినిమా రిలీజ్ అయింది... పండగ :D
ఎలా అయినా సరే రిలీజ్ రోజే చూడాలని చాలా రోజుల నుండి వెయిట్ చేసాను.

చిన్నప్పుడైతే... అంటే నేను ఏ 3rd or 4th క్లాసులోనో ఉన్నప్పుడు... అప్పట్లోనే శివ సినిమా రెండు సార్లు చూసాను ధియేటర్ లో(అప్పట్లో ఒకే సినిమా రెండు సార్లు చూడటమే గొప్ప మరి!)
ఆ తర్వాత కాలేజీలో ఉన్నప్పుడు నాగార్జున సినిమా ఫస్ట్ డే చూడాలని నేను, మా ఫ్రెండ్ తెగ పోటీ పడే వాళ్ళం. అలా తనకంటే ముందు చూడాలని ఒకసారి ఎదురులేని మనిషి సినిమాకి ఫస్ట్ డే వెళ్లాను, ఇంట్లో గోల గోల చేసి. మా కజిన్స్ ఇంటికి వస్తే, వాళ్ళ దగ్గర గొడవ గొడవ చేసి... నన్ను ఇప్పుడు ఆ సినిమాకి తీసుకెళ్తారా లేదా అని గోల చేసి మరీ ఆ సినిమాకి వెళ్లాను. తర్వాత ఎప్పుడూ వాళ్ళు నాతో ఏ సినిమాకి రాలేదు!

ఇంకోసారి... మన్మధుడు రిలీజ్ డే. ఎలా అయినా సరే ఫస్ట్ డే చూడాల్సిందే. ఫ్రెండ్స్ అందరం కలిసి ఈవెనింగ్ షో కి వెళ్ళాము. టికెట్స్ దొరకలేదు :(. అప్పుడు ఇంటికి వెళ్లి మళ్ళీ సెకండ్ షో టైంకి వద్దామంటే మా జనాలంత కదిలేసరికి మళ్ళీ ఆ టికెట్స్ కూడా అయిపోతాయి. అందుకే ఇంటికి వెళ్ళకుండా... అక్కడే ధియేటర్ పక్కన రోడ్ కి అవతల ఏదో స్కూల్ ఉంటే... వెళ్లి దాని మెట్ల మీద కూర్చున్నాం... సెకండ్ షో టైం వరకు. ఆరోజు సినిమా చూసాకే ఇంటికి వెళ్లాం.

అలా ఆ రోజులన్నీ రింగులు రింగులుగా గుర్తు తెచ్చుకుంటూ 'కేడి' కోసం ఎదురుచూసాను.



అనుకున్నట్టే రిలీజ్ రోజే వెళ్లాను.
ధియేటర్ బిగ్ సినిమా.
సినిమా మొదలయింది. హుహ్... ఇలాంటి పెద్ద theaters కి రాకూడదు అందుకే. పేరు పడినప్పుడు కానీ, నాగార్జున కనపడగానే కానీ ఒక్కడూ అరవడే. అంతా ఏదో పోగొట్టుకున్నట్టు సైలెంట్ గా చూస్తున్నారు. చ చ. అదే మా కాలనీ దగ్గర ధియేటర్ లో ఐతేనా అరుపులు, కేకలు... హబ్బో! అప్పుడు కదా సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేది.
సరేలే... ఏం చేస్తాం అని నేను కూడా కామ్ గా చూస్తున్నాను.

హబ్బ... నాగార్జున ఎంత బాగున్నాడో! అసలు వేరే వాళ్ళంతా సినిమా promotion కోసం హీరోయిన్స్ ని వాడుకుంటారు... అమ్మాయిల ఫొటోస్ వేస్తారు పోస్టర్స్ మీద. కానీ నాగార్జున సినిమా పోస్టర్స్ మీద మాత్రం నాగార్జుననే ఉంటాడు! ఎంతైనా మన్మధుడు కదా!
అలా నాగార్జునని చూస్తూ... సినిమా కూడా చూస్తున్నాను.
టైటిల్ సాంగ్ బాగుంది. నాకైతే నచ్చింది. అబ్బాయిలకి కూడా పండగే... అనుష్క కొత్తగా కనిపిస్తుంది ఆ సాంగ్ లో.
కాస్త సినిమా అయింది. ఏంటిది... ఏం జరగటం లేదు... హ్మం ఏమోలే... ఇంటర్వల్ లో ఏం ట్విస్ట్ ఉందో ఏంటో... అనుకుంటూ చూస్తున్నాను.
ఒక గంట సినిమా అయ్యేవరకు కూడా హీరోయిన్ కనిపించలేదు. of course ఆ హీరోయిన్ కనిపిస్తే ఎంత కనిపించకపోతే ఎంత... మమతనే కదా.
ఇంటర్వల్ వచ్చింది. ఇప్పటి వరకు పెద్ద ఇంటరెస్టింగ్ గా ఏమి లేదు సినిమా. మా నాగార్జున సినిమా నాకే ఇలా అనిపిస్తే ఇంకా మిగిలిన వాళ్ళకి ఏమనిపిస్తుందో ఏంటో! ప్చ్.
ఇంటర్వల్ తర్వాత కూడా అలా 'సాగుతుందే' కానీ, పెద్ద ఇంటరెస్టింగ్ గా ఏమీ అవటం లేదు.
ఇంకో అరగంటలోనో ముప్పావుగంటలోనో సినిమా అయిపోతుంది అనగా... ఈ పాట... "ఎందుకో ఎంతకీ తేలదే మరి ఈ కథ ఏంటో". సినిమా సంగతి ఎలా ఉన్నా... భలే టైమింగ్ ఆ సాంగ్ మాత్రం. చూసేవాళ్ళంతా ఆ పాటే పాడుకుంటారు.
మొత్తానికి సినిమా అయిపోయింది.
హాల్ నుండి బయటకి వస్తుంటే... ఎవరో అంటున్నారు... బాస్ కంటే దారుణంగా ఉందిరా బాబు అని. హ్మం :(

సినిమాలో నాకు నచ్చినవి:
నాగార్జున :D
రెండు, మూడు పాటలు
కెమెరా వర్క్ (ఎక్కువ శాతం మూవీ సెపియా టోన్ లో ఉంటుంది)
నీవేనా నీవేనా పాటలో locations
నాగార్జున చిన్నతనంలో చేసిన అబ్బాయి
ఫారిన్ అమ్మాయి (భలే బాగుంది)

నాకు నచ్చనివి:
మమత మోహన్దాస్
కామెడీ లేకపోవటం (హర్షవర్ధన్, బ్రహ్మానందంలని చూసి చాలా expect చేస్తాం కానీ, చెప్పుకో తగ్గ కామెడీ ఏమీ లేదు.)
స్టొరీ (అస్సలు ఇంటరెస్టింగ్ గా లేదు, at least డైరెక్టర్ ఇంటరెస్టింగ్ గా చెప్పలేకపోయాడు.)
విల్లన్ (లిప్ మూమెంట్ చాలా చోట్ల సింక్ కాలేదు. అలా ఉంటే డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది.)
నీవేనా నీవేనా పాటలో కాస్ట్యూమ్స్ (locations ఎంత బాగున్నాయో, కాస్ట్యూమ్స్ అంత బాలేదు)
ఎందుకో ఎంతకీ .. పాట అనవసరం అనిపిస్తుంది.

మొత్తానికి సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు. బాస్, డాన్ సినిమాలని మించిపోయింది.

నాగార్జున ఇంత దారుణంగా మోసం చేస్తాడని అనుకోలేదు :(.

Tuesday, February 2, 2010

మనం బ్రతుకుతుంది మనుషల మధ్యేనా!?

మూడు రోజుల క్రితం కిడ్నాప్ కి గురైన వైష్ణవి చనిపోయిందని తెలియగానే చాలా బాధనిపించింది. కానీ తనని ఎలా చంపారో తెలిసాక చాలా కోపమొచ్చింది. అసలు వాళ్ళు మనుషులేనా అని అనుమానమొచ్చింది. మరీ ఇంత దారుణమా! మనం బ్రతుకుతుంది మనుషల మధ్యా లేక మృగాల మధ్యా? అడవిలో తిరిగే మృగాలు కూడా ఆకలేస్తేనే మరో జంతువుని చంపుతాయి. కానీ వీళ్ళు? కేవలం ఆస్తి తగాదాల వలన నిండా పది ఏళ్ళు కూడా నిండని పసిపాపని అంత దారుణంగా... ఛా. అసలు వాళ్లకి చేతులెలా వచ్చాయో! తనని ఎవరు ఎందుకు హింసిస్తున్నారో కూడా తెలియని ఆ చిన్నారి చివరి క్షణాల్లో ఎంత నరకం అనుభవించి ఉంటుందో తలుచుకుంటేనే కన్నీళ్లు ఆగటం లేదు. ఆ పాపని అంత దారుణంగా చంపటం వలన వాళ్ళు ఏం సాధించారు? వాళ్ళ గొడవలుతీరిపోయాయా? వాళ్ళ ఆస్తి వాళ్లకి వచ్చేసిందా? అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలి?

పాపం... ఆ పాప గురించిన వార్త తెలియగానే ఆ తండ్రి కుప్ప కూలిపోయారు. పాప మరణ వార్త విని షాక్ లోకి వెళ్ళిన ఆ తల్లికి మరో షాక్... ఆ తండ్రి మరణ వార్త. ఇంతటి దారుణాన్ని చేసిన ఆ దుర్మార్గులకి (ఈ పదం సరిపోదు) ఎలాంటి శిక్ష వేయాలి? కేవలం ఉరి తీస్తే సరిపోదు. క్షణక్షణం నరకం అనుభవించే శిక్ష వేయాలి. ప్రతి క్షణం వాళ్లు చేసిన తప్పు గుర్తొచ్చి నరకం అనుభవించేలా శిక్షించాలి.
కేవలం డబ్బు కోసం ఇంతటి హేయమైన పని చేయించిన, చేసిన వాళ్ళని అస్సలు వదలకూడదు. నాలుగు రోజులు దీని గురించి మాట్లాడి, తర్వాత మర్చిపోకుండా ఆ మృగాలకి తగిన శిక్ష వేసే వరకు వదిలిపెట్టకూడదు.

ఇంత దారుణాన్ని కూడా వ్యాపార దృష్టితో చూసే ఈ న్యూస్ చానల్స్ ని ఏం చేయాలి? వైష్ణవి మరణం పై sms కాంటెస్ట్ పెడుతున్న వీళ్ళు మాత్రం మనుషులా? ఆ హంతకులకి, వీళ్ళకి ఏంటి తేడా?

వైష్ణవి అన్న ఆ కిరాతకుల భారిన పడకుండా తప్పించుకోగాలిగాడు. ఆ బాబు కోసం, కనీసం వైష్ణవి తల్లైనా షాక్ నుండి తేరుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆశ.

Monday, February 1, 2010

'నయా' బజార్



నే చూసేసానోచ్చ్!!

హమ్మయ్యా... నేను చూసేసాను. మాయా బజార్ కలర్ ఫొటోస్ లో సావిత్రి గారిని చూడగానే ఎలా అయినా సరే ఈ సినిమా చూసి తీరాల్సిందే అనుకున్నాను. చూసేసాను.
నిన్న సాయంత్రం ఫస్ట్ షో కి వెళదామనుకుంటే టికెట్స్ దొరకలేదు. ఎంత పెద్ద క్యు నో! కానీ ఎందుకో టికెట్స్ దొరక్కపోయినా ఆ ధియేటర్ అలా జనాలతో నిండిపోవటం చూసి ఆనందమేసింది. మళ్ళీ సెకండ్ షోకి ట్రై చేస్తే దొరికాయి. ఆ షో కూడా హౌస్ ఫుల్. భలే సంతోషమేసింది. ఇప్పుడు వచ్చే చెత్త సినిమాల మధ్య, మన జనాలు ఇంకా ధియేటర్ కి వచ్చి మాయ బజార్ చూస్తున్నారంటే... సంతోషమేగా మరి!

టైటిల్ పడగానే అరుపులు... ఈలలు! అస్సలు ఊహించలేదు నేను. ఈ సినిమాని కూడా జనం ఇలా ఎంజాయ్ చేస్తారని.
చిన్నారి శశిరేఖ ఎంత బాగుందో! ఆ అమ్మాయిని అంతగా ఎప్పుడూ గమనించలేదు నేను. ఎంత బాగా పెట్టిందో భావాలు ముఖంలో!
ఎన్ టి ఆర్ గారు కనపడగానే మళ్ళీ అరుపులు, ఈలలు. కృష్ణుడంటే ఆయనే కదా! ఎంతటి ప్రశాంతత ఆ వదనంలో! చూస్తుంటే నిజంగానే దేవుణ్ణి చూసిన భావన కలుగుతుంది!
సావిత్రి గారూ కనపడగానే మళ్ళీ అ...లు, ఈ...లు! కానీ సావిత్రి గారిని చూడటానికి మాత్రం రెండు కళ్ళూ సరిపోలేదు. హబ్బబ్బా ఎంత అందంగా ఉన్నారో! నా దిష్టే తగులుతుందేమో అనిపించింది. అసలే ఆవిడ ఆ వయసులో నటించిన ఏ సినిమా కూడా కలర్ లో లేదేమో... మొదటిసారి ఆవిడని అలా కలర్ సినిమాలో చూస్తుంటే... అలా చూస్తూనే ఉండాలనిపించింది.
ఇంతలో ఏ ఎన్ ఆర్ గారు వచ్చి "నీవేనా..." అని పాట అందుకోగానే మళ్ళీ అ...లు, ఈ...లు!

మేక్ అప్ కూడా చాలా నీట్ గా చేసారు. చూడముచ్చటగా ఉన్నారు అందరూ. కాకపోతే చూడగానే ఆ బంగారు ఆభరణాల రంగు కాస్త ఎక్కువయ్యిందేమో అనిపించింది... అన్నీ మెరుస్తూ dominating గా కనిపించాయి. కానీ కాసేపు అలా చూడగానే కంటికి అలవాటయిపోయింది. సినిమాలో మునిగిపోయి ఇంకా అవేమీ గమనించే స్థితి లేదు.


"భళి భళి భళి భళి దేవా" పాట కట్ అయిపోయింది... కానీ ఎడిటింగ్ నీట్ గా చేసారు. అక్కడ ఆ పాట ఉంటుందని తెలియని వాళ్ళకి కట్ చేసినట్టు తెలియదు. ఫిలిం negative పాడయిపోయి ఆ పాట మూవీ లో కట్ చేయాల్సి వచ్చిందని ముందే తెలుసు కాబట్టి, పెద్దగా ఏమి అనిపించలేదు. కానీ దానితో పాటు ఇంకో పాట కూడా అలాగే కట్ చేసాము అన్నారు... అదేంటో మరి... అనుకుంటూ చూసాను. తర్వాత అర్థమయ్యింది...అది "చూపులు కలిసిన శుభవేళ" పాట అని :( .

ఇంతలో మన ఘటోత్కచుడు గారు రానే వచ్చారు. మళ్ళీ అ...లు, ఈ...లు. హబ్బ... ఎస్ వి ఆర్ గారిని చూడాలంటే మళ్ళీ రెండు కళ్ళూ సరిపోలేదు! అసలు మాయ బజార్ కి సావిత్రి గారు, ఎస్ వి ఆర్ గారు రెండు కళ్ళు.
మాయా శశిరేఖ రూపంలో సావిత్రి గారి నటన, హావభావాల గురించి ఎంతని చెప్పగలం!

ఇంతలో మళ్ళీ అ...లు, ఈ...లు... మన లక్ష్మణ కుమారుడు వచ్చారు మరి. "సుందరి నీ వంటి" పాటలో రేలంగి గారిని చూస్తుంటే భలే అనిపించింది.

చివరి భాగంలో మన ఘటోత్కచ సైన్యం తసమదీయులకి చేసే మర్యాదలు చూసి... హాలంతా చిన్నపిల్లలా నవ్వులతో నిండిపోయింది.
మొత్తం సినిమాని పెద్దలు, పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు. ఇది ఒక కామెడీ సినిమా అని అప్పుడే బాగా అర్థమయ్యింది నాకు!

సినిమాలో నటించిన మెయిన్ ఆర్టిస్టూల్లో ఎ ఎన్ ఆర్ గారు మాత్రమే ఉన్నారు ఇప్పుడు. కానీ సినిమాలో నటించిన సైడ్ ఆర్టిస్ట్స్, జునియర్ ఆర్టిస్ట్స్ లో ప్రస్తుతం ఎంత మంది ఉన్నారో మనకి తెలిదు. వాళ్ళంతా ఈ సినిమా చూస్తూ ఎంత సంతోషించి ఉంటారో కదా!

70 mm చేయటం వలన... బొమ్మ పైన, క్రింద కొద్దిగా కట్ అయింది. కొన్ని frames లో లోపం క్లియర్ గా తెలుస్తున్నా... ఓవరాల్ గా చాలా బాగా maintain చేసారు.

1957 నాటి అద్భుతాన్ని మళ్ళీ ఇంత చక్కగా, అద్భుతంగా రంగుల్లో మన ముందు ఉంచిన గోల్డ్ స్టోన్ టెక్నోజీస్ వారికి నిజంగా కోటి దండాలు!

కొ.మె: "విజయా" వారి చిత్రాల్లో చంద్రుడికి ఉండే ప్రాముఖ్యత గురించి అందరికీ తెలుసు. కాకతాళీయమైనా... ఈ నయా మాయా బజార్ రిలీజ్ అయిన 30 తారీఖు నాడు, ఆకాశంలో చంద్రుడు పెద్దగా కనిపిస్తూ 15 రెట్లు అధికంగా వెన్నెల వెలుగులు విరజిమ్మటం నిజంగా అద్భుతం. (ఈ వార్త "సాక్షి" దినపత్రిక లోనిది.)

Thursday, January 28, 2010

Colors 2010

మొన్న చెప్పాను కదా... మా ఆఫీసు కాంపస్ లో రంగోలి, పెయింటింగ్, ఫోటోగ్రఫి competition ఉంది అని. వాటి results ఈరోజు తెలిసాయి. నేను ఊహించినట్టే నాకేం రాలేదు ;). కనీసం మా కంపెనీలో వేరేవాళ్ళకి కూడా ఎవరికీ రాలేదు (entries వెళ్ళిందే రెండో మూడో అనుకోండి... అది వేరే విషయం).
కానీ రంగోలిలో మాత్రం మా కంపెనీ టీంకి థర్డ్ ప్రైజ్ వచ్చింది. Congrats to them.

బహుమతులు గెలుచుకున్న entries ...

పెయింటింగ్:





ఫోటోగ్రఫి:






రంగోలి:



రంగులలో 'కళ'వో....

మాయబజార్ రంగుల్లో తీస్తున్నారని తెలియగానే మీకేమైనా అనిపించిందా?
నాకైతే పెద్దగా ఏమీ అనిపించలేదు. ఆ... అందులో ఏముందిలే అనుకున్నాను.
అంటే... ఆ పని అంత తేలిక కాదని నాకు తెలుసు. దాని వెనక సంవత్సరాల నుండి ఎంతో మంది పడిన కష్టం ఉందని తెలుసు. కానీ ఎందుకు అంత కష్టపడటం అనిపించింది.
మా అన్న అయితే దానికి సంబంధించిన ప్రోగ్రాం టీవీలో ఎప్పుడు వచ్చినా వదలకుండా చూస్తాడు. ఎంటబ్బా అంత పిచ్చి అనుకునేదాన్ని. తెలిసిన సినిమానే, ఎన్నోసార్లు చూసిన సినిమానే కదా... కాకపోతే కలర్ లో... అంతే కదా అనిపించేది.
సినిమా రిలీజ్ అవుతుందని తెలిసి... రిలీజ్ రోజే చూద్దామని టికెట్స్ బుక్ చేస్తా అన్నాడు. మూడు గంటలు ధియేటర్ లో ఆ సినిమా చూడగలమా... బోర్ కొడుతున్దేమోరా అన్నాను. ఏం కొట్టదు... ఇంతకు ముందు ఎన్నిసార్లు చూసినా బ్లాకు అండ్ వైట్ లోనే కదా చూసింది.. కలర్ లో బాగుంటుంది. ఇంకా dts కూడా ఉంది కదా... అన్నాడు. అయినా నాకేమి exciting గా అనిపించలేదు.

ఈరోజు మాయబజార్ కలర్ ఫొటోస్ వచ్చాయి మెయిల్ లో. అంతే!
అందులో సావిత్రి గారిని చూడగానే డిసైడ్ అయ్యాను... ఈ సినిమా ఎలా అయినా ధియేటర్ లో చూసి తీరాల్సిందే అని.



మరిన్ని ఫోటోలు ఇక్కడ.

Wednesday, January 27, 2010

పుష్ప విలాసం

నెక్లస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో నిన్నటి నుండి horticulture షో నడుస్తుంది. నేను ఇదే మొదటిసారి అటువంటి ఒక షోకి వెళ్ళడం.
హబ్బా... ఎంత బాగుందో... రకరకాల మొక్కలు... రంగు రంగుల పువ్వులు...
అవన్నీ చూస్తూ... చేయి ఖాళీగా ఉండగలదా! మళ్ళీ చేతిలో దురద మొదలయ్యింది...











ఈవెంట్: Horticultural Show
26th Jan to 30th Jan 2010
స్థలం
: నెక్లస్ రోడ్, పీపుల్స్ ప్లాజా

Monday, January 25, 2010

ఎవరి పిచ్చి వాళ్లకి ఆనందం

"నేను కవిని కాదన్న వాణ్ణి కత్తితో పొడుస్తా
నేను రచయిత్రిని కాదన్న వాణ్ని రాయెత్తి కొడతా"
అని చంటబ్బాయ్ లో శ్రీలక్ష్మి అనే డైలాగ్ గుర్తుందా?

అచ్చు అలాగే నేను కూడా "నేను పైంటర్ ని కాదన్నవాణ్ని పెన్నెత్తి పొడుస్తా" అన్న టైపులో...
ఎవరేమన్నా సరే... నాకు చేతకాకపోయినా సరే... బొమ్మలు వేయటం మాత్రం ఆపను :D
ఈమధ్య చాలా కాలం గ్యాప్ వచ్చింది.
ప్రతి సంవత్సరం సంక్రాంతి టైంలో మా ఆఫీసు కాంపస్ లో రంగోలి competition ఉంటుంది. ఈసారి పెయింటింగ్, ఫోటోగ్రఫి contests కూడా పెట్టారు. దాంతో మళ్ళీ నా చేతికి దురద పుట్టేసింది. కానీ చాలా కాలమయ్యే సరికి అనుకుంట... ఎంత ప్రయత్నించినా సరైన బొమ్మ ఒక్కటి కూడా వేయలేకపోయాను.
చివరికి ఇది వేసి... ఏదో వేసాననిపించాను...



నాకైతే అంత నచ్చలేదు. మరీ ఫస్ట్ క్లాసు బాబు వేసినట్టుగా ఉంది కదూ?
watercolors మాత్రమే వాడాలి అన్నారు. అది తెలియగానే ఎగిరి గంతేసాను. ఎందుకంటే నాకు watercolors అంటేనే ఇష్టం (వేరేవి అసలు ప్రయత్నించలేదనుకోండి ఎప్పుడూ.. అది వేరే విషయం). కానీ A3 సైజు చార్ట్ పేపర్ మీద మాత్రమే వేయాలి అన్నారు. అది తెలియగానే... ఎగిరినదాన్ని అలాగే ధబేల్ మని పడిపోయాను. చార్ట్ పేపర్ మీద watercolors... నా మొహంలా వస్తుంది.. అని అనుకుంటూనే ఏదో ట్రై చేసాను. నేను అనుకున్నట్టే నా మొహం లానే వచ్చింది.
ఈరోజు తెలిసింది submission డేట్ extend చేసారని. రేపెలాగు సెలవే కాబట్టి... వీలైతే మళ్ళీ ఒకసారి ప్రయత్నించి చూడాలి.

Tuesday, January 19, 2010

"కళలు" కాదండీ గోపాల్ గారూ "కలలు"

బాపు గారి మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఆమని డైలాగ్ గుర్తుంది కదా...
"కలలు కాదండీ గోపాల్ గారూ కళలు... fine arts"
దాన్నే మనం తారుమారు చేసాం అన్నమాట. ఎందుకంటే మన పోస్ట్ 'కల'ల గురించి కాబట్టి :D
(ఈ పోస్ట్ చేయాలి అనుకోగానే... ఎందుకోగాని ఆ డైలాగ్ గుర్తొచ్చింది... అందుకే అలా పెట్టేసా టైటిల్ :D)

నాకు ఒక్కోసారి నిద్రలో వచ్చే కలలు (ofcourse ఎవరికైనా కలలు నిద్రలోనే వస్తాయనుకోండి :P) అలా గుర్తుండిపోతాయి. కొన్ని ఆ రోజంతా గుర్తుంటాయి... కొన్ని ఎన్ని రోజులైనా గుర్తుంటాయి! అన్నిటికీ కాకపోయినా మనకి వచ్చే కొన్ని కలలకి తప్పకుండా ఏదో ఒక అర్థం ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఈ విషయం మీద ఆల్రెడీ చాలా మంది చాలా బుక్స్ కూడా వ్రాసేసారు (నేనేం చదవలేదనుకోండి, అది వేరే విషయం).
కొన్ని కలలైతే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు తప్పకుండా వాటికి ఏదోఅర్థం ఉంది అనిపిస్తుంది.
కలలని అనలైస్ చేయటం చాలా పెద్ద విషయం. నాకైతే అందులో కొంచం కూడా అనుభవం లేదు.
కానీ మొన్న ఒకరోజు మా ఫ్రెండ్ కి ఒక కల వచ్చింది. అది చాలా విచిత్రంగా ఉందని చెప్పింది. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయికి డెలివరీ అయినట్టు (ఆ అమ్మాయి ఆల్రెడీ క్యారీయింగ్) ... తనకి ముగ్గురు పిల్లలు పుట్టినట్టు. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అబ్బాయి చాలా అందవిహీనంగా ఉన్నట్టు, కానీ కాసేపట్లోనే మంచిగా అయిపోయినట్టు... అంతలోనే ఏదో సముద్రం... ఇంకా నీళ్ళల్లో చేపలు. ఇలా అర్థం పర్థం లేని combination లో ఉంది ఆ కల. సరే దాని అర్థం ఏంటో తెలుసుకుందామని గూగులమ్మని అడిగితే... అలాంటి కల వస్తే దాని అర్థం తను ప్రేగ్నంట్ అయి ఉండొచ్చు అని ఉంది. మేము పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు కానీ, సరిగ్గా అది జరిగిన నాలుగు రోజులకి తెలిసింది తను నిజంగానే క్యారీయింగ్ అని!
ఇలాంటివి జరిగినప్పుడు ఇంకా నమ్మకంగా, ఆసక్తిగా అనిపిస్తుంది. అందుకే నాకు తరచుగా వచ్చే కొన్ని కలల మీద గూగుల్ చేసి చూసాను. కానీ పెద్దగా ఏమీ సమాచారం దొరకలేదు. ప్చ్...

ఇవి నా కలలు... గూగుల్ చేస్తే నాకు దొరికిన వాటి అర్థాలు...
౧. మా ఊరులోని మా పాత (అమ్మేసిన) ఇల్లు... ఎక్కువగా రాత్రి పూట, ఎవరూ లేకుండా... భయం భయంగా...
గూగుల్ చేస్తే తెలిసిన సమాచారం... disturbed childhood
౨. ఆత్మలు (దెయ్యాలు)... ఒక్కోసారి ఏదో తెలిసినట్టు అనిపించే ఇంట్లో...

౩. ఏదో బస్సులో నుండో... మరో చోటనుండో పడిపోతునట్టు...
దీని అర్థం... మనలో ఏదో భయాలు ఉన్నట్టు అంట.
౪. రోడ్ క్రాస్ చేస్తూ... చేయలేకపోతున్నట్టు... రోడ్ మధ్యలో ఉండిపోయినట్టు...
౫. బస్సు కోసం లాస్ట్ మినిట్లో వచ్చినట్టు... అలా వస్తు ఏవేవో ముఖ్యమైన వస్తువులు మర్చిపోయినట్టు... వాటికోసం వెళ్తే బస్సు మిస్ అయిపోతుందేమో... అన్న confusion...
దీని అర్థం... బస్సు / ట్రైన్ జర్నీ మన లైఫ్ జర్నీ అంట. ఏదో oppurtunity వచ్చినట్టు... అది మిస్ అవుతున్నట్టు... లేదా మిస్ అవుతామేమో అన్న భయం ఉన్నట్టు.
౬. బాగా తెలిసిన మనుషులు... ఒక్కోసారి ఎప్పుడో దూరమైపోయిన వారు... ఒక్కోసారి అస్సలు ఎప్పుడూ చూడని వారు...
౭. సాయి బాబా... ఒక్కోసారి నన్ను చూసి నవ్వుతున్నట్టు... ఒక్కోసారి ఏమీ expression లేకుండా...
ఇది మన నమ్మకమం. బాబా (లేదా ఎవరైనా దేవుడు) మాట్లాడుతుంటే దాని అర్థం తను మనకి ఏదో సలహా ఇస్తున్నట్టు అంట. తన expression ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి అది మనలో ఉన్న గిల్ట్ ఫీలింగ్ కూడా అవ్వొచ్చం.
౮. పాము... చిన్న చిన్నవి కొన్ని... లేదా పెద్దది...
ఇది అనలైస్ చేయటానికి చాలా కష్తం అంట. దీనిలో చాలా variations ఉండొచ్చు అంట. వ్యక్తికి పాములంటే ఉండే భయం కూడా అవ్వొచ్చం.
౯. కుక్క(లు)
దీని అర్థం సెల్ఫ్ క్యారెక్టర్ అంట. అవి against గా ఉంటే... మనం ఏదో పని మన క్యారెక్టర్ కి against గా చేస్తున్నట్టు అంట.
౧౦. ఒక్కోసారి ఎవరో చనిపోయినట్టు... ఒక్కోసారి పెళ్లి జరుగుతున్నట్టు...
ఇంకా ఉన్నాయేమో... ప్రస్తుతానికి ఇవే గుర్తొచ్చాయి.

నాకు దొరికిన ఆ అర్థాలన్నీ నిజమో కాదో, అసలు నిజంగా వీటికేమైనా అర్థాలు ఉన్నాయో లేదో నాకు తెలీదు కానీ... తరచుగా వస్తుండటం వల్లన ఏదో అర్థం ఉండే ఉంటుందేమో అని నా నమ్మకం. తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంటుంది. హ్మ్మ్...



Picture Courtesy: Internet

Tuesday, January 12, 2010

బేరాలు - సారాలు

గమనిక: టైటిల్ లో ఉన్నట్టు... పోస్ట్ 'బేరాల' గురించే. కానీ సారం (సారంశం) నేనేమి చెప్పలేదు...ఎవరికి వారు అర్థం చేసుకోండి.

మొన్న సాయంత్రం ఆఫీసు నుండి త్వరగా బయట పడ్డాను. ఎలాగు త్వరగానే వెళ్తున్నాను కదా... ఈవెనింగ్ స్నాక్స్ కింద తినటానికి ఏమైనా తీసుకెళ్దామని మెక్ డొనాల్డ్స్ కి వెళ్లాను. నాకు, నాతో ఉండే నా ఫ్రెండ్ కి (actually నేనే తనతో ఉంటున్నాను :D) అని... రెండు burgers, fries తీసుకున్నాను.
అవి తీసుకుని ఇంటికి వెళ్తుంటే... దారిలో కొబ్బరి బొండాలు కనిపించాయి.
ఆ బండి దగ్గరకి వెళ్ళి.. "బొండం ఎంత?" అని అడిగాను.
ఆ అబ్బాయి ఒక్క క్షణం మౌనంగా ఉండి... "పది" అన్నాడు. అవి చూస్తే చాలా చిన్నగా, ఎండిపోయినట్టుగా ఉన్నాయి.
"ఏంటి... ఇంత చిన్నగా ఉన్నాయి వీటికి పది రూపాయలా... ఎనిమిది తీసుకోండి" అన్నాను.
అతనేమి మాట్లాడలేదు. సరే అన్నట్టుగా... రెండు బొండాలు కొట్టి ఇచ్చాడు.



అతనికి డబ్బులిచ్చేసి వస్తుంటే... బుర్రలో ఒకటే ఆలోచన. అక్కడేమో మెక్ లో పెద్దగా ఏమి కొనకపోయినా... అంత బిల్ అయింది... ఏం? అక్కడ కూడా అడిగి ఉండొచ్చుగా... ఇంత చిన్నగా ఉన్నాయి burgers... వీటికి అంత డబ్బులా అని... అక్కడ మాత్రం నోరు మెదపకుండా... ఎంత అడిగితే అంత సమర్పిస్తాం. ఏదో మనం వాళ్ళకి అప్పున్నట్టు!
ఇంకా tax లు గట్రా అంటూ వాయించేస్తారు. అయినా ఒక్క మాట కూడా అడగము. ఎంతైనా ఇచ్చేస్తాము.
కానీ పాపం ఇక్కడ వీళ్ళు రోడ్ మీద ఎండలో రోజంతా నిలబడి అమ్ముతుంటే... వీళ్ళ దగ్గర రెండు రూపాయల కోసం బేరమాడాను.... ఛి ఛి. ఎంత తప్పు. ఆ రెండు రూపాయల్లో నేనేమైనా మేడలు కట్టేస్తానా. పాపం వాళ్ళకి మిగిలేదే రూపాయో రెండు రూపాయలో. అది కూడా బేరమాడేసి ఏదో గెలిచేసినట్టు ఫీలింగ్. హ్మ్...
పొద్దున్నుండి అలా అమ్ముతున్నా పెద్దగా ఎవరూ కొనలేదేమో... పాపం అందుకే నాకు అడగ్గానే తగ్గించి ఇచ్చేసాడేమో! నేను మాత్రం ఏదో గొప్పగా బేరమాడి సాధించేసినట్టు ఫీల్ అయిపోయి... అతనికొచ్చే రెండు రూపాయల లాభం కూడా లాగేసుకున్నాను. ఛా.
ఇలా రకరకాల ఆలోచనలతో వెళ్తుంటే... కాస్త ముందుకి వచ్చాక... అక్కడ ఇంకో కొబ్బరి బోండాల బండి కనిపించింది. ఇవి నేను కొన్నవాటి కంటే కొంచం మంచిగా ఉన్నాయి. ఆ బండికి ఒక బోర్డు తగిలించి ఉంది...
"5 Rs/-"

Wednesday, January 6, 2010

కట్నం వేదింపులకి బలవుతున్న "మగవాళ్ళు"!

శ్రీకర్ కి ఈమధ్యనే పెళ్లయింది. అమ్మాయి పేరు అనిత. బాగా చదువుకుంది. అమ్మాయి నచ్చటానికి అదే ముఖ్యమైన కారణం. సంబంధం కూడా బాగా తెలిసిన వాళ్ళ ద్వారా రావటంతో వాళ్ళ గురించి పెద్దగా ఏమి వివరాలు కనుక్కోకుండానే పెళ్లి నిశ్చయించేసారు. అనిత వాళ్లు అంతగా డబ్బున్నవాళ్ళు కాకపోవటం తో సగం పైన పెళ్లి ఖర్చులు కూడా శ్రీకర్ వాళ్ళే పెట్టుకున్నారు. అంతా ఒక నెలలో జరిగిపోయింది.

అనిత ఇంట్లో ఎవరితో కలివిడిగా ఉండేది కాదు. పెళ్ళైన మరుసటి రోజు నుండే ప్రతి చిన్నవిషయానికి ఏదో ఒకగొడవ చేసేది. కొత్త మనుషులతో సర్దుకుపోవటానికి కాస్త సమయం పడుతుందిలే అనుకున్నారు.
కొంత కాలం విడిగా కాపురం పెడితే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుందని మరో ఇల్లు చూడమని శ్రీకర్ కి చెప్పారు వాళ్ళ నాన్నగారు. దానికి అనిత ఒప్పుకోలేదు. కలిసే ఉండాలని పట్టుబట్టింది. తనకి అర్థమయ్యేలా నచ్చచెప్పాలని ప్రయత్నించేవారు.

ఒక రోజు ఉన్నట్టుండి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. శ్రీకర్, వాళ్ళ నాన్నగారు కూడా అనితని ఇంటికి తీసుకురావటానికి వెళ్ళారు. కానీ తను రాలేదు.

కొంత కాలం గడిచాక, ఉన్నట్టుండి ఒకరోజు శ్రీకర్ వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చారు. అనిత శ్రీకర్ పైన, శ్రీకర్ కుటుంబం పైన కంప్లైంట్ ఇచ్చింది... కట్నం కోసం వేదిస్తున్నారని. పోలీసులు శ్రీకర్ ని రిమాండ్ లో ఉంచారు. బెయిల్ రావటానికి మూడు రోజులు పట్టింది.

అనిత చదువుకుంది. తెలివైంది. చాలా తెలివిగా శ్రీకర్ కుటుంబాన్ని 498A సెక్షన్ లో ఇరికించింది. కట్నం వేదింపులకి బలైపోతున్న ఆడవాళ్ళ కోసం 1983 లో ఈ సెక్షన్ ని అమలులోకి తెచ్చారు.
ఈ సెక్షన్ ప్రకారం భార్య కంప్లైంట్ ఇవ్వగానే ఏ రకమైన ప్రాధమిక విచారణ జరపకుండానే భర్తని, వారి కుటుంబ సభ్యులని అర్రెస్ట్ చేయొచ్చు. అంతే కాదు... ఒకవేళ అది తప్పుడు కంప్లైంట్ అని తేలినా కూడా దానికి ఏ రకమైన ఫైన్ కానీ, మరే రకమైన action తీసుకోవటం కానీ ఉండదు.



స్టేషన్ లో ఉన్నా రెండు రోజుల్లో శ్రీకర్ కి ఈ రకమైన తప్పుడు కంప్లైంట్స్ కి బలైన మరికొందరు పరిచయం అయ్యారు. అందులో ఒకరు ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్. మంచి పోసిషన్ లో ఉన్నా కూడా ఏమి చేయలేక చేయని తప్పుకి స్టేషన్ లో దోషి లాగా గడపాలిసి వచ్చింది అతనికి.
ఒకరు ప్రభుత్వ ఉద్యోగి. ఏ రకమైన కేసు లో అయినా ఇరుక్కుని జైలు లో ఉంటే అతని ఉద్యోగం పోతుంది. ఆ కేసు తప్పుడు కేసు అని ఎప్పటికో తేలినా, ప్రస్తుతం జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇలాగే మరి కొంతమంది! ఆ ఒక్క స్టేషన్ లోనే రోజుకి కనీసం మూడు, నాలుగు కేసులు నమోదయ్యేవి. అందులో ఎక్కువ శాతం చదువుకున్న అమ్మాయిలు ఇచ్చినవే. వాటిలో తప్పుడు కేసులే ఎక్కువ. ఇలాంటి కేసుల్లో ఇరికించి డబ్బులు డిమాండ్ చేయటం ఒక బిజినెస్ లాగా మారింది.

The center for Social Research India వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం... ఈ సెక్షన్ క్రింద నమోదు అయిన కేసుల్లో 60.5 శాతం తప్పుడు కేసులే అని తేలింది.
మరొక research ప్రకారం ఈ సెక్షన్ ఎక్కువగా abuse అవుతున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు పంజాబ్.
ఈ తప్పుడు కేసుల వలన ప్రతీ సంవత్సరం 52,000 కి పైగా అమాయక భర్తలు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు.

కట్నం వేధింపులకి, గృహ హింసలకి బలైపోతున్న ఆడవాళ్ళ కోసం రకరకాల చట్టాలున్నాయి. కానీ ఆ చట్టాల బారిన పడి... ఇటువంటి తప్పుడు కేసులకి బలైపోతున్న అమాయక భర్తల కోసం ఏ చట్టం ఉంది !?


***

External links:

1. Dowry law in India
2. Abuse of 498A
3. Misuse of 498A