Friday, February 19, 2010

ఒక్క పుట్టకలోనే... ఇన్నిన్ని మరణాలా!

ఎందుకో తెలీదు కానీ... ఈ పాట వినగానే బాగా నచ్చేసింది. రెండు రోజుల నుండి అదే పనిగా వింటూనే ఉన్నాను. విన్నకొద్దీ వినాలనిపిస్తుంది.
సిరివెన్నెల గారి మహత్యం ప్రతి పదంలోనూ కనిపిస్తుంది. కార్తీక్ గొంతులో ఉన్న మేజిక్ కూడా తోడయింది.
పాట వింటుంటే... చాలా చెప్పాలనిపిస్తుంది కానీ... ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం సిరివెన్నల గారి గురించి!
ఒక ఇళయరాజా... ఒక ఏసుదాస్... ఒక సిరివెన్నెల.
అంతకన్నా ఏం చెప్పగలం!

***




ఎందుకు ఎందుకు ఎందుకు నను పరిగెత్తిస్తావెందుకు
ఆకలి తీర్చని విందుకు నన్నాకర్షిస్తావెందుకు
దరికి రానీక నింగి శశిరేఖ
పొదువుకోనీక వదులుకోనీక
ఇంతగా చితిమంటలా నన్నంటుకోవాలా
సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు ||

పాలనవ్వుల రూపమా నను తాళనివ్వని తాపమా
దారి చూపని దీపమా జత చేరనీయని శాపమా || పాలనవ్వుల ||
తళతళ తళతళ కత్తుల మెరుపై కళ్ళను పొడిచేలా
తెరవని తలుపై తెలియని మలుపై కలవరపరిచేలా
నువ్వు నా సొంతమనే అత్యాశ అలిసేలా
నేనెంత ఒంటరినో ఒట్టేసి తెలిపేలా
జంటగాని జంటలా నా వెంట నడవాలా

సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు ||

నీవు నింపిన ఊపిరే నా గుండె దహిస్తుంటే ఎలా
నీవు పెంచిన ఆశలే నరనరాన్ని కోస్తుంటే ఇలా || నీవు నింపిన ||
సలసల మరిగే నిప్పుల మడుగై నెత్తురు ఉడికేలా
నిలువున నీలో కరగని కోరిక విలవిలలాడేలా
ఒక్క పుట్టుకలోనే ఇన్నిన్ని మరణాలా
ఎంత దగ్గర ఉన్నా దక్కని వరమాల
నన్నిలా ఉరితాడుతో ఉయ్యాలలూపాలా

సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు ||

చిత్రం: నేను (2004)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్ర్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కార్తిక్

Monday, February 15, 2010

కేడి

మా నాగార్జున సినిమా రిలీజ్ అయింది... పండగ :D
ఎలా అయినా సరే రిలీజ్ రోజే చూడాలని చాలా రోజుల నుండి వెయిట్ చేసాను.

చిన్నప్పుడైతే... అంటే నేను ఏ 3rd or 4th క్లాసులోనో ఉన్నప్పుడు... అప్పట్లోనే శివ సినిమా రెండు సార్లు చూసాను ధియేటర్ లో(అప్పట్లో ఒకే సినిమా రెండు సార్లు చూడటమే గొప్ప మరి!)
ఆ తర్వాత కాలేజీలో ఉన్నప్పుడు నాగార్జున సినిమా ఫస్ట్ డే చూడాలని నేను, మా ఫ్రెండ్ తెగ పోటీ పడే వాళ్ళం. అలా తనకంటే ముందు చూడాలని ఒకసారి ఎదురులేని మనిషి సినిమాకి ఫస్ట్ డే వెళ్లాను, ఇంట్లో గోల గోల చేసి. మా కజిన్స్ ఇంటికి వస్తే, వాళ్ళ దగ్గర గొడవ గొడవ చేసి... నన్ను ఇప్పుడు ఆ సినిమాకి తీసుకెళ్తారా లేదా అని గోల చేసి మరీ ఆ సినిమాకి వెళ్లాను. తర్వాత ఎప్పుడూ వాళ్ళు నాతో ఏ సినిమాకి రాలేదు!

ఇంకోసారి... మన్మధుడు రిలీజ్ డే. ఎలా అయినా సరే ఫస్ట్ డే చూడాల్సిందే. ఫ్రెండ్స్ అందరం కలిసి ఈవెనింగ్ షో కి వెళ్ళాము. టికెట్స్ దొరకలేదు :(. అప్పుడు ఇంటికి వెళ్లి మళ్ళీ సెకండ్ షో టైంకి వద్దామంటే మా జనాలంత కదిలేసరికి మళ్ళీ ఆ టికెట్స్ కూడా అయిపోతాయి. అందుకే ఇంటికి వెళ్ళకుండా... అక్కడే ధియేటర్ పక్కన రోడ్ కి అవతల ఏదో స్కూల్ ఉంటే... వెళ్లి దాని మెట్ల మీద కూర్చున్నాం... సెకండ్ షో టైం వరకు. ఆరోజు సినిమా చూసాకే ఇంటికి వెళ్లాం.

అలా ఆ రోజులన్నీ రింగులు రింగులుగా గుర్తు తెచ్చుకుంటూ 'కేడి' కోసం ఎదురుచూసాను.



అనుకున్నట్టే రిలీజ్ రోజే వెళ్లాను.
ధియేటర్ బిగ్ సినిమా.
సినిమా మొదలయింది. హుహ్... ఇలాంటి పెద్ద theaters కి రాకూడదు అందుకే. పేరు పడినప్పుడు కానీ, నాగార్జున కనపడగానే కానీ ఒక్కడూ అరవడే. అంతా ఏదో పోగొట్టుకున్నట్టు సైలెంట్ గా చూస్తున్నారు. చ చ. అదే మా కాలనీ దగ్గర ధియేటర్ లో ఐతేనా అరుపులు, కేకలు... హబ్బో! అప్పుడు కదా సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేది.
సరేలే... ఏం చేస్తాం అని నేను కూడా కామ్ గా చూస్తున్నాను.

హబ్బ... నాగార్జున ఎంత బాగున్నాడో! అసలు వేరే వాళ్ళంతా సినిమా promotion కోసం హీరోయిన్స్ ని వాడుకుంటారు... అమ్మాయిల ఫొటోస్ వేస్తారు పోస్టర్స్ మీద. కానీ నాగార్జున సినిమా పోస్టర్స్ మీద మాత్రం నాగార్జుననే ఉంటాడు! ఎంతైనా మన్మధుడు కదా!
అలా నాగార్జునని చూస్తూ... సినిమా కూడా చూస్తున్నాను.
టైటిల్ సాంగ్ బాగుంది. నాకైతే నచ్చింది. అబ్బాయిలకి కూడా పండగే... అనుష్క కొత్తగా కనిపిస్తుంది ఆ సాంగ్ లో.
కాస్త సినిమా అయింది. ఏంటిది... ఏం జరగటం లేదు... హ్మం ఏమోలే... ఇంటర్వల్ లో ఏం ట్విస్ట్ ఉందో ఏంటో... అనుకుంటూ చూస్తున్నాను.
ఒక గంట సినిమా అయ్యేవరకు కూడా హీరోయిన్ కనిపించలేదు. of course ఆ హీరోయిన్ కనిపిస్తే ఎంత కనిపించకపోతే ఎంత... మమతనే కదా.
ఇంటర్వల్ వచ్చింది. ఇప్పటి వరకు పెద్ద ఇంటరెస్టింగ్ గా ఏమి లేదు సినిమా. మా నాగార్జున సినిమా నాకే ఇలా అనిపిస్తే ఇంకా మిగిలిన వాళ్ళకి ఏమనిపిస్తుందో ఏంటో! ప్చ్.
ఇంటర్వల్ తర్వాత కూడా అలా 'సాగుతుందే' కానీ, పెద్ద ఇంటరెస్టింగ్ గా ఏమీ అవటం లేదు.
ఇంకో అరగంటలోనో ముప్పావుగంటలోనో సినిమా అయిపోతుంది అనగా... ఈ పాట... "ఎందుకో ఎంతకీ తేలదే మరి ఈ కథ ఏంటో". సినిమా సంగతి ఎలా ఉన్నా... భలే టైమింగ్ ఆ సాంగ్ మాత్రం. చూసేవాళ్ళంతా ఆ పాటే పాడుకుంటారు.
మొత్తానికి సినిమా అయిపోయింది.
హాల్ నుండి బయటకి వస్తుంటే... ఎవరో అంటున్నారు... బాస్ కంటే దారుణంగా ఉందిరా బాబు అని. హ్మం :(

సినిమాలో నాకు నచ్చినవి:
నాగార్జున :D
రెండు, మూడు పాటలు
కెమెరా వర్క్ (ఎక్కువ శాతం మూవీ సెపియా టోన్ లో ఉంటుంది)
నీవేనా నీవేనా పాటలో locations
నాగార్జున చిన్నతనంలో చేసిన అబ్బాయి
ఫారిన్ అమ్మాయి (భలే బాగుంది)

నాకు నచ్చనివి:
మమత మోహన్దాస్
కామెడీ లేకపోవటం (హర్షవర్ధన్, బ్రహ్మానందంలని చూసి చాలా expect చేస్తాం కానీ, చెప్పుకో తగ్గ కామెడీ ఏమీ లేదు.)
స్టొరీ (అస్సలు ఇంటరెస్టింగ్ గా లేదు, at least డైరెక్టర్ ఇంటరెస్టింగ్ గా చెప్పలేకపోయాడు.)
విల్లన్ (లిప్ మూమెంట్ చాలా చోట్ల సింక్ కాలేదు. అలా ఉంటే డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది.)
నీవేనా నీవేనా పాటలో కాస్ట్యూమ్స్ (locations ఎంత బాగున్నాయో, కాస్ట్యూమ్స్ అంత బాలేదు)
ఎందుకో ఎంతకీ .. పాట అనవసరం అనిపిస్తుంది.

మొత్తానికి సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు. బాస్, డాన్ సినిమాలని మించిపోయింది.

నాగార్జున ఇంత దారుణంగా మోసం చేస్తాడని అనుకోలేదు :(.

Tuesday, February 2, 2010

మనం బ్రతుకుతుంది మనుషల మధ్యేనా!?

మూడు రోజుల క్రితం కిడ్నాప్ కి గురైన వైష్ణవి చనిపోయిందని తెలియగానే చాలా బాధనిపించింది. కానీ తనని ఎలా చంపారో తెలిసాక చాలా కోపమొచ్చింది. అసలు వాళ్ళు మనుషులేనా అని అనుమానమొచ్చింది. మరీ ఇంత దారుణమా! మనం బ్రతుకుతుంది మనుషల మధ్యా లేక మృగాల మధ్యా? అడవిలో తిరిగే మృగాలు కూడా ఆకలేస్తేనే మరో జంతువుని చంపుతాయి. కానీ వీళ్ళు? కేవలం ఆస్తి తగాదాల వలన నిండా పది ఏళ్ళు కూడా నిండని పసిపాపని అంత దారుణంగా... ఛా. అసలు వాళ్లకి చేతులెలా వచ్చాయో! తనని ఎవరు ఎందుకు హింసిస్తున్నారో కూడా తెలియని ఆ చిన్నారి చివరి క్షణాల్లో ఎంత నరకం అనుభవించి ఉంటుందో తలుచుకుంటేనే కన్నీళ్లు ఆగటం లేదు. ఆ పాపని అంత దారుణంగా చంపటం వలన వాళ్ళు ఏం సాధించారు? వాళ్ళ గొడవలుతీరిపోయాయా? వాళ్ళ ఆస్తి వాళ్లకి వచ్చేసిందా? అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలి?

పాపం... ఆ పాప గురించిన వార్త తెలియగానే ఆ తండ్రి కుప్ప కూలిపోయారు. పాప మరణ వార్త విని షాక్ లోకి వెళ్ళిన ఆ తల్లికి మరో షాక్... ఆ తండ్రి మరణ వార్త. ఇంతటి దారుణాన్ని చేసిన ఆ దుర్మార్గులకి (ఈ పదం సరిపోదు) ఎలాంటి శిక్ష వేయాలి? కేవలం ఉరి తీస్తే సరిపోదు. క్షణక్షణం నరకం అనుభవించే శిక్ష వేయాలి. ప్రతి క్షణం వాళ్లు చేసిన తప్పు గుర్తొచ్చి నరకం అనుభవించేలా శిక్షించాలి.
కేవలం డబ్బు కోసం ఇంతటి హేయమైన పని చేయించిన, చేసిన వాళ్ళని అస్సలు వదలకూడదు. నాలుగు రోజులు దీని గురించి మాట్లాడి, తర్వాత మర్చిపోకుండా ఆ మృగాలకి తగిన శిక్ష వేసే వరకు వదిలిపెట్టకూడదు.

ఇంత దారుణాన్ని కూడా వ్యాపార దృష్టితో చూసే ఈ న్యూస్ చానల్స్ ని ఏం చేయాలి? వైష్ణవి మరణం పై sms కాంటెస్ట్ పెడుతున్న వీళ్ళు మాత్రం మనుషులా? ఆ హంతకులకి, వీళ్ళకి ఏంటి తేడా?

వైష్ణవి అన్న ఆ కిరాతకుల భారిన పడకుండా తప్పించుకోగాలిగాడు. ఆ బాబు కోసం, కనీసం వైష్ణవి తల్లైనా షాక్ నుండి తేరుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆశ.

Monday, February 1, 2010

'నయా' బజార్



నే చూసేసానోచ్చ్!!

హమ్మయ్యా... నేను చూసేసాను. మాయా బజార్ కలర్ ఫొటోస్ లో సావిత్రి గారిని చూడగానే ఎలా అయినా సరే ఈ సినిమా చూసి తీరాల్సిందే అనుకున్నాను. చూసేసాను.
నిన్న సాయంత్రం ఫస్ట్ షో కి వెళదామనుకుంటే టికెట్స్ దొరకలేదు. ఎంత పెద్ద క్యు నో! కానీ ఎందుకో టికెట్స్ దొరక్కపోయినా ఆ ధియేటర్ అలా జనాలతో నిండిపోవటం చూసి ఆనందమేసింది. మళ్ళీ సెకండ్ షోకి ట్రై చేస్తే దొరికాయి. ఆ షో కూడా హౌస్ ఫుల్. భలే సంతోషమేసింది. ఇప్పుడు వచ్చే చెత్త సినిమాల మధ్య, మన జనాలు ఇంకా ధియేటర్ కి వచ్చి మాయ బజార్ చూస్తున్నారంటే... సంతోషమేగా మరి!

టైటిల్ పడగానే అరుపులు... ఈలలు! అస్సలు ఊహించలేదు నేను. ఈ సినిమాని కూడా జనం ఇలా ఎంజాయ్ చేస్తారని.
చిన్నారి శశిరేఖ ఎంత బాగుందో! ఆ అమ్మాయిని అంతగా ఎప్పుడూ గమనించలేదు నేను. ఎంత బాగా పెట్టిందో భావాలు ముఖంలో!
ఎన్ టి ఆర్ గారు కనపడగానే మళ్ళీ అరుపులు, ఈలలు. కృష్ణుడంటే ఆయనే కదా! ఎంతటి ప్రశాంతత ఆ వదనంలో! చూస్తుంటే నిజంగానే దేవుణ్ణి చూసిన భావన కలుగుతుంది!
సావిత్రి గారూ కనపడగానే మళ్ళీ అ...లు, ఈ...లు! కానీ సావిత్రి గారిని చూడటానికి మాత్రం రెండు కళ్ళూ సరిపోలేదు. హబ్బబ్బా ఎంత అందంగా ఉన్నారో! నా దిష్టే తగులుతుందేమో అనిపించింది. అసలే ఆవిడ ఆ వయసులో నటించిన ఏ సినిమా కూడా కలర్ లో లేదేమో... మొదటిసారి ఆవిడని అలా కలర్ సినిమాలో చూస్తుంటే... అలా చూస్తూనే ఉండాలనిపించింది.
ఇంతలో ఏ ఎన్ ఆర్ గారు వచ్చి "నీవేనా..." అని పాట అందుకోగానే మళ్ళీ అ...లు, ఈ...లు!

మేక్ అప్ కూడా చాలా నీట్ గా చేసారు. చూడముచ్చటగా ఉన్నారు అందరూ. కాకపోతే చూడగానే ఆ బంగారు ఆభరణాల రంగు కాస్త ఎక్కువయ్యిందేమో అనిపించింది... అన్నీ మెరుస్తూ dominating గా కనిపించాయి. కానీ కాసేపు అలా చూడగానే కంటికి అలవాటయిపోయింది. సినిమాలో మునిగిపోయి ఇంకా అవేమీ గమనించే స్థితి లేదు.


"భళి భళి భళి భళి దేవా" పాట కట్ అయిపోయింది... కానీ ఎడిటింగ్ నీట్ గా చేసారు. అక్కడ ఆ పాట ఉంటుందని తెలియని వాళ్ళకి కట్ చేసినట్టు తెలియదు. ఫిలిం negative పాడయిపోయి ఆ పాట మూవీ లో కట్ చేయాల్సి వచ్చిందని ముందే తెలుసు కాబట్టి, పెద్దగా ఏమి అనిపించలేదు. కానీ దానితో పాటు ఇంకో పాట కూడా అలాగే కట్ చేసాము అన్నారు... అదేంటో మరి... అనుకుంటూ చూసాను. తర్వాత అర్థమయ్యింది...అది "చూపులు కలిసిన శుభవేళ" పాట అని :( .

ఇంతలో మన ఘటోత్కచుడు గారు రానే వచ్చారు. మళ్ళీ అ...లు, ఈ...లు. హబ్బ... ఎస్ వి ఆర్ గారిని చూడాలంటే మళ్ళీ రెండు కళ్ళూ సరిపోలేదు! అసలు మాయ బజార్ కి సావిత్రి గారు, ఎస్ వి ఆర్ గారు రెండు కళ్ళు.
మాయా శశిరేఖ రూపంలో సావిత్రి గారి నటన, హావభావాల గురించి ఎంతని చెప్పగలం!

ఇంతలో మళ్ళీ అ...లు, ఈ...లు... మన లక్ష్మణ కుమారుడు వచ్చారు మరి. "సుందరి నీ వంటి" పాటలో రేలంగి గారిని చూస్తుంటే భలే అనిపించింది.

చివరి భాగంలో మన ఘటోత్కచ సైన్యం తసమదీయులకి చేసే మర్యాదలు చూసి... హాలంతా చిన్నపిల్లలా నవ్వులతో నిండిపోయింది.
మొత్తం సినిమాని పెద్దలు, పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు. ఇది ఒక కామెడీ సినిమా అని అప్పుడే బాగా అర్థమయ్యింది నాకు!

సినిమాలో నటించిన మెయిన్ ఆర్టిస్టూల్లో ఎ ఎన్ ఆర్ గారు మాత్రమే ఉన్నారు ఇప్పుడు. కానీ సినిమాలో నటించిన సైడ్ ఆర్టిస్ట్స్, జునియర్ ఆర్టిస్ట్స్ లో ప్రస్తుతం ఎంత మంది ఉన్నారో మనకి తెలిదు. వాళ్ళంతా ఈ సినిమా చూస్తూ ఎంత సంతోషించి ఉంటారో కదా!

70 mm చేయటం వలన... బొమ్మ పైన, క్రింద కొద్దిగా కట్ అయింది. కొన్ని frames లో లోపం క్లియర్ గా తెలుస్తున్నా... ఓవరాల్ గా చాలా బాగా maintain చేసారు.

1957 నాటి అద్భుతాన్ని మళ్ళీ ఇంత చక్కగా, అద్భుతంగా రంగుల్లో మన ముందు ఉంచిన గోల్డ్ స్టోన్ టెక్నోజీస్ వారికి నిజంగా కోటి దండాలు!

కొ.మె: "విజయా" వారి చిత్రాల్లో చంద్రుడికి ఉండే ప్రాముఖ్యత గురించి అందరికీ తెలుసు. కాకతాళీయమైనా... ఈ నయా మాయా బజార్ రిలీజ్ అయిన 30 తారీఖు నాడు, ఆకాశంలో చంద్రుడు పెద్దగా కనిపిస్తూ 15 రెట్లు అధికంగా వెన్నెల వెలుగులు విరజిమ్మటం నిజంగా అద్భుతం. (ఈ వార్త "సాక్షి" దినపత్రిక లోనిది.)