
నిన్న సాయంత్రం టీవీలో ఎన్నికల వార్తలు చూస్తుంటే... అమ్మ వచ్చి 'మనం వోట్ ఎలా వేయాలి' అని అడిగింది. 'అదేం ప్రశ్న... ఇప్పటికి ఎన్నిసార్లు వేసావ్... మొన్న కుడా వేసాం కదా' అన్నాన్నేను (PJR పోయినప్పుడు అసెంబ్లీ ఎలెక్షన్ జరిగింది కదా)
'అది కాదు వోట్ వేయటానికి... మజారాజ్యం పార్టీ వాళ్ళు, భారతీయ ఉడతా పార్టీ వాళ్ళు చిట్స్ తెచ్చి ఇచ్చారు కాని... కంగారుస్ పార్టీ వాళ్ళు ఇవ్వలేదు... మరెలా ఒటెయ్యాలి' అని అడిగింది అమాయకంగా.
'అది కాదమ్మా... అవి ఎవరు ఇస్తే వాళ్ళకే వోట్ చేయాలనీ కాదు... అవి పట్టుకెళ్ళి ఎవరికైనా వోట్ చేయొచ్చు' అని చెప్పా.
'ఒహో అలాగా' అంటూ అక్కడి నుండి వెళ్లిపోబోయింది.
అంతలో నాకేదో బల్బు వెలిగింది... అమ్మని ఆపి... 'అంటే నువ్వు కంగారుస్ పార్టీ కి వేస్తున్నావా వోట్?' అని అడిగాను.
ఏంటి కొత్తగా అడుగుతున్నావ్ అన్నట్టు నావైపు చూసి... ' అంతే కదా మరి' అంది.
'అది కాదమ్మా... ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు... ఇప్పుడు 'జన సత్తా' పార్టీకి వేయమ్మా' అని చెప్పాను.
'అదేం కుదరదు... నాకు వోట్ హక్కు వచ్చినప్పటి నుండి నేను కన్గారూస్ పార్టీ కే వేసాను... ఇప్పుడూ అంతే' అంది మొండిగా.
'అదేంటమ్మా... అప్పుడు ఉన్న పార్టీ జనాలు ఇప్పుడు ఉన్నారా... అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా... పార్టీ పేరు ఉంది కాని... జనాలంతా మారిపోయారు కదా' అన్నాను
'అదంతా నాకు తెలిదు... నేను కన్గారూస్ పార్టీ నే' అంది... తను పట్టిన కంగారుకి మూడే కాళ్ళు అన్న రీతిలో.
ఇంకా తనతో ఎంత వాదించినా ప్రయోజనం లేదని అర్థమైపోయింది.
'సరే నీ ఇష్టం... ఎప్పుడైనా చదువుకున్న వాళ్లకి వోట్ వేయాలి... అంతే కాని పార్టీ చూసి కాదు' అని చెప్పాను.
'...' తన వైపు నుండి మౌనం.
అది నే చెప్పినదానికి అంగీకారమో... నేను మారను అన్న మొండితనమో నాకు అర్థం కాలేదు!
***
నా అభిప్రాయం ప్రకారం అభ్యర్ధిని చూసి... అతను ఎలాంటి వాడో తెలుసుకుని... అతనికి కనీస అర్హత(చదువు) ఉందొ లేదో తెలుసుకుని వోట్ వేయాలి కానీ... ఇలా పార్టీని చూసి కాదు.
ఒక పార్టీలో అందరు మంచివారే , చదువుకున్నవారే ఉంటారా? మరి అలా ఉండనప్పుడు పార్టీని చూసి ఎవరికంటే వారికి వోట్ చేయలేము కదా!
అలా ఆలోచిస్తుంటే మెదడులో ఇంకో బల్బు వెలిగింది...
మరి జన సత్తా పార్టీలో అభ్యర్దులు ఎవరో అసలు ఎంతమందికి తెలుసు? మా నియోజకవర్గంలో అంటే జన సత్తా నాయకుడే నిలబడ్డారు కాబట్టి... ఆయన గురించి తెలుసు కాబట్టి వోట్ చేస్తాం. మరి మిగత నియోజక వర్గాల సంగతి ఏంటి? అప్పుడెప్పుడో 'జీడిపప్పు' గారు అన్నట్టు... ముక్కు మొహం తెలియని అభ్యర్దికి వోట్ ఎలా వేస్తారు. అలా వేస్తే... ఇక్కడ కుడా పార్టీని చూసి వేసినట్టే కదా!
అంటే ఇప్పుడు పార్టీని చూసి వోట్ వేయాలా? లేక అభ్యర్థిని చూసి వేయాలా?
(నేనయితే ప్రస్తుతానికి రెండూ చూస్తున్నాను... అసెంబ్లీకి అభ్యర్థిని చూసి... పార్లమెంటుకి పార్టీని చూసి (అభ్యర్ది గురించి కూడా కొంచం తెలుసుకున్నానులెండి) వేయబోతున్నాను)
picture courtesy: internet