Monday, March 30, 2009

కుడి ఎడమైతే... పోరపాటేనోయ్!!

గమనిక: ఇది ఎప్పుడో ఎక్కడో చదివిన చిన్న జోకుకి నా పైత్యం జోడించి రాసిన కథ.

సాయంత్రం అయిదైంది.
బుచ్చిబాబు watch వంక చూసి వెంటనే ఫైల్స్ అన్ని మూసేసి ఇంటికి బయల్దేరాడు.
ఇంటికి రాగానే బాగా అలసిపోయినట్టు వేలాడపడిపోయి... సోఫాలో కూర్చుని "కాఫీ" అని ఆర్డర్ చేసాడు.
రెండు నిముషాల్లో కాఫీతో ప్రత్యక్షమైంది బుచ్చిబాబు భార్య భాగ్యం(భాగ్యలక్ష్మి కి బుచ్చిబాబు పెట్టుకున్న ముద్దుపేరు).
కాఫీ అందుకుని తాగుతున్నాడు బుచ్చిబాబు.
"దేశం లో పని మొత్తం మీరొక్కరే చేసి వచ్చినట్టు... అంత పోసు కొట్టాల" అంది భాగ్యం.
అసలే తనేదో బాగా కష్టపడిపోతున్నా అన్న ఫీలింగ్ లో ఉన్న బుచ్చిబాబుకి భాగ్యం మాటలతో చిర్రెత్తుకొచ్చింది.
"కష్టం కాకపోతే మరేమిటి... ఎప్పుడో పుద్దున్నే 10 గంటల కల్లా వెళ్ళాలా ఆఫీసుకి... మళ్లీ ఎప్పుడో సాయంత్రం 5 గంటలకి గాని ఇంటికి రాలేను... ఇంత గొడ్డు చాకిరి చేస్తుంటే... నీకది కష్టంలా కనిపించటంలేదా" అని గయ్ మన్నాడు.
"అబ్బో ఇదీ ఒక కష్టమేనా... ఉదయం నుండి సాయంత్రం దాకా ac లో కూర్చోటమేగా మీరు పొడిచేసే పని" అంది భాగ్యం దెప్పుతున్నట్టు.
"కష్టం అంటే మాది... ఉదయం నుండి గొడ్డు చాకిరీ చేయాలి ఇంటిల్లపాదికి... " అంది మళ్లీ తనే.
"ఆహ... ఏంటో మీరు పడే ఆ కష్టం... ఏవో రెండు కూరగాయలు అలా తరిగేసి కూర చేయటం... రెండు గిన్నెలు తోమటం... అంతే కదా... ఆ చిన్న పనులన్నీ ఉదయమే 11 గంటలకల్లా అయిపోతాయి... తర్వాత మొత్తం ఆ టీవీ లో వచ్చే ఏడుపుగొట్టు సీరియల్స్ చూడటమేగా మీరు పడే కష్టం" అని వాదనకి దిగాడు బుచ్చిబాబు.
"ఏంటి అంత తేలికగా ఉందా మీకు ఇంటి పని అంటే... చేస్తే తెలుస్తది... అది ఎంత కష్టమో... ఊరికే మాటలు చెప్పటం కాదు"
"ఆ పని చేయటం కూడా పెద్ద విషయమేనా... మా ఆఫీసు పని చేయటమే అన్నిటికంటే కష్టం"
"అలాగా... అలా అయితే ఒక రోజు మొత్తం మీరు నాలా ఇంటి పని చేయండి... నేను మీలా ఆఫీసు పని చేస్తాను... అప్పుడు తెలుస్తుంది ఎవరు కష్టపడుతున్నారో" సవాల్ విసిరింది భాగ్యం.
రెండు క్షణాలు ఆలోచించాడు బుచ్చిబాబు...
"ఛ... ఆడవాళ్ళ సవాల్ కి తను వెనక్కి తగ్గితే ఇంకేమన్నా ఉందా... మగాళ్ల పరువు పోదు..." అని మనసులో అనుకుని...
"సరే నేను రెడీ" అన్నాడు.

వెంటనే భాగ్యం తన పతివ్రతా శక్తినంతా కూడగట్టుకుని దేవుడికి పూజ చేసి అప్లికేషను పెట్టింది.

పూజ అయిపోయే సమయానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
"భాగ్యం... ఏమి నీ బాధ... ఈ అప్లికేషను ఏంటి?" అని అడిగాడు దేవుడు
"స్వామీ... నేను, మా అయన సవాల్ చేసుకున్నాం... మీ భక్తురాలు గెలవాలంటే మీరు వెంటనే ఆ అప్లికేషను మీద మీ తదాస్థు సంతకం చేయాలి.." అంది చేతులు జోడించి
దేవుడు అప్లికేషను చదివాడు...
"ఓ... ఒకరోజు మొత్తం నువ్వు మగాడిగా... బుచ్చిబాబు ఆడదానిలా మారాలి... అంతే కదా" అన్నాడు దేవుడు అప్లికేషన్ పరిశీలిస్తూ.
"అంతే స్వామి"
"ఇదీ నీకు కూడా సమ్మతమేనా" అని అడిగాడు దేవుడు బుచ్చిబాబు వైపు తిరిగి
"సమ్మతమే స్వామి..."
"మళ్లీ ఒకసారి బాగా ఆలోచించుకో నాయన..." అన్నాడు దేవుడు బుచ్చిబాబు వైపు జాలిగా చూస్తూ
"లేదు స్వామి... నేను ఎలా అయిన ఈ సవాల్ లో నేగ్గల్సిందే... మీరు సంతకం చేసేయండి" అన్నాడు బుచ్చిబాబు పట్టుదలగా
"సరే నీ ఖర్మ" అని మనసులో అనుకుని దేవుడు తదాస్థు సంతకం చేసేసాడు అప్లికేషన్ మీద.

***

తెల్లవారింది...
బుచ్చిబాబు భాగ్యం రూపంలో ఉన్నాడు... భాగ్యం బుచ్చిబాబు రూపంలో ఉంది.
పొద్దున్నే 5 గంటలకి అలారం గంట కొట్టింది. ఉలిక్కి పడి లేచాడు బుచ్చిబాబు.
అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా అని గొణుక్కుంటూ లేచి... వెళ్లి ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గు పెట్టాడు.
భాగ్యం హాయిగా నిద్రపోతుంది లోపల.
ముగ్గు పెట్టటం అయిపోయాక... పాలు కాయటం, ఇల్లు ఊడవటం, వంటకి కూరగాయలు తరగటం చేస్తున్నాడు బుచ్చిబాబు.
టైం 8 అయింది. భాగ్యం లేచింది బద్ధకంగా.
తను లేచి స్నానం చేసి వచ్చేలోగా... టిఫిన్ రెడీ చేసాడు బుచ్చిబాబు.
టిఫిన్ తినేసి లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీసు కి వెళ్ళిపోయింది భాగ్యం 9 గంటల కల్లా.
ఈలోగా హడావిడిగా పిల్లలని రెడీ చేసి... వాళ్లకి టిఫిన్ పెట్టి, పాలు తాగించి స్కూల్ కి పంపించాడు బుచ్చిబాబు.
అప్పటికే తన ఒంట్లో శక్తి మొత్తం అయిపోయింది... నీరస పడిపోయాడు.
కానీ ఎలా అయిన పందెం నేగ్గాలన్న పట్టుదలతో మళ్లీ శక్తి తెచ్చుకుని ఇంటి పని చేస్తున్నాడు.
పిల్లలు వెళ్ళిపోయాక... ఇల్లు తుడిచేసాడు.
బట్టలు నానపెట్టి... గిన్నెలు తోమాడు.
తర్వాత బట్టలు కూడా ఉతికేసి ఆరేసాడు.
అప్పటికే టైం 12 అయింది.
స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకున్నాడు.
భోజనం టైం అయింది... అప్పుడు గుర్తొచ్చింది బుచ్చిబాబుకి... తను పొద్దున్నుండి ఏమి తినలేదు అని... "హు రోజు టైం కి టిఫిన్, టీ పడేవి కడుపులో... ఏం ఖర్మరా బాబు" అని మనసులో అనుకుని... భోజనం చేసాడు.
కాసేపు నడుం వాలుద్దాం అనుకునే లోగా...
"భాగ్యమక్కా... రేపు మా ఇంటికి చుట్టలోస్తున్నారు... పిండి వంటలు చేయాలి.. కొంచం సాయం పట్టవు" అంటూ వచ్చింది పక్కింటి పంకజం.
తప్పేదేముంది... ఆ పనిలో పడ్డాడు బుచ్చిబాబు.
ఆ పని అయ్యేటప్పటికి 3 దాటింది టైం. పిల్లలు వచ్చే టైం అయింది.
వాళ్ళు రాగానే పాలు తాగించాడు. కొంచం అల్పాహారం తయారు చేసి పెట్టాడు.
వాళ్ళు ఆ టిఫిన్ తినేసి ట్యూషన్ కి వెళ్లిపోయారు.
టైం 5 అయింది.
మళ్లీ ఒకసారి ఇల్లు ఊడ్చి... గిన్నెలు తోమేసాడు.
6 అయింది. భాగ్యం వచ్చింది ఆఫీసు నుండి.
తనకి కొంచం కాఫీ కలిపి ఇచ్చి... సాయంత్రం చేసిన అల్పాహారం పెట్టాడు.
తను అది తినేసి relaxed గా సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంది.
బుచ్చిబాబుకి ఒళ్ళు మండింది... కానీ ఏం చేయలేడు కదా...
లోపలికి వెళ్లి రాత్రి భోజనం తయారు చేసే పనిలో పడ్డాడు.

అలా ఆ రోజంతా క్షణం తీరిక లేకుండా గడిచింది బుచ్చిబాబుకి.

***

తెల్లవారింది...

బుచ్చిబాబు కి ఇంక ఆ పనులు చేయటం వల్లకాలేదు...
వెంటనే దేవుడి దగ్గరికి వెళ్లి... "స్వామీ... 24 గంటల గడువు అయిపొయింది... వెంటనే నన్ను నా పూర్వ రూపానికి మార్చేయండి... ఈ గొడ్డు చాకిరి చేయటం నా వల్ల కాదు... నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను..." అన్నాడు దీనంగా చేతులు జోడించి.
దేవుడు ప్రత్యక్షమయ్యాడు...
"స్వామీ అర్జెంటుగా నన్ను మాములు రూపానికి మార్చేయండి" మళ్లీ అడిగాడు ఆగలేక...
"బుచ్చిబాబు... చిన్న పొరపాటు జరిగిపోయిందయ్యా... మరో 9 నెలల దాక నువ్వు ఈ రూపంలోనే ఉండాలి!"
అని వెంటనే మాయమైపోయాడు దేవుడు.
బుచ్చిబాబు పిచ్చి చూపులు చూస్తూ... భాగ్యం వైపు తిరిగాడు...
విష్ణుమూర్తి లాగా మంచం మీద విలాసంగా పడుకుని... కొంటెగా నవ్వింది భాగ్యం.


14 comments:

శ్రీనివాస్ said...

climax adirindandoi

kiraN said...

హిహిహీ.. దెబ్బకి తిక్క కుదిరింది మొగుడికి


- కిరణ్
ఐతే OK

పరిమళం said...

హ..హ్హ ..హ్హా ... మల్లిక్ గారి కార్టూన్లు భలే ! :) :)

Unknown said...

హి హి హి అవతల వాళ్ళ పని ఎప్పుడూ సులువనే అనిపిస్తుంది చూడటానికి ..చేస్తే కాని తెలీదు

చిలమకూరు విజయమోహన్ said...

పతాక సన్నివేశం బ్రహ్మాండం

నేస్తం said...

హ..హ్హ ..హ్హా ...

sivaprasad said...

superb, jambalakidi film gurthu vachhindi.

జీడిపప్పు said...

హ హ్హ హ్హా బాగుంది బాగుంది

మురళి said...

తెలిసిన కథే అయినా ఆద్యంతమూ చదివించేలా రాశారు.. చాలా రోజుల తర్వాత చూసిన మల్లిక్ కార్టూనులు అదనపు ఆకర్షణ.. బాగుందండి టపా..

చైతన్య said...

@శ్రీనివాస్
థాంక్స్ :D

@కిరణ్
హి హి హి... ఆడాళ్ళా మజాకా :)

@పరిమళం
హ్హ ఇలాంటి కథకి ఆ కార్టూన్లైతేనే సరిపోతాయని పెట్టాను :)

@శ్రావ్య
అవును కదా మరి... మన దాక వస్తే గాని తెలిదు... :)

@చిలమకూరు విజయమోహన్, అరుణాంక్, మురళి
థాంక్స్!

@నేస్తం, శివప్రసాద్, జీడిపప్పు
:)

నేను said...

తెలిసున్నదే ఐనా మీ intro, narration బావుంది cartoons కూడా భలే ఇమిడిపోయాయి :)

చైతన్య.ఎస్ said...

:) బాగుంది.

చైతన్య said...

@నేను, చైతన్య
థాంక్స్ :)

laxmi said...

hi its very nice and more than that my name is bhagya laxmi and my husband's name is buchibabu.. we both felt very good on seeing this.. thanks to the author