2005 సంవత్సరం...
కొత్తగా జె ఎన్ టి యు నుండి హైటెక్ సిటీ కి డబుల్ రోడ్ వేసారు.
"హమ్మయ్య... ఇప్పుడు రోజూ చుట్టూ తిరిగి ఆ మియాపూర్ వైపు నుండి ఆఫీసు కి వచ్చే బాధ తప్పింది" అనుకున్నాడు రాంబాబు.
రాంబాబు కూకట్ పల్లి లో ఉంటాడు. హైటెక్ సిటీ లో ఉన్న 'ఏదోసాఫ్ట్' అనే సాఫ్ట్వేర్ కంపెనీ లో పని చేస్తున్నాడు. ఇప్పుడు కుకట్ పల్లి నుండి ఆఫీసు కి వెళ్ళటానికి కొత్త దారి (దగ్గరి దారి) పడటంతో అతనికి చాలా ఉత్సాహంగా ఉంది. రోజూ ఆ కొత్త రోడ్ లో జుం అంటూ తన టీవీఎస్ స్కూటీ మీద 30 స్పీడ్ లో వెళ్ళిపోతున్నాడు.
అలా కొంత కాలం లైఫ్ జనం లేని సిటీ బస్సు లాగా హాయిగా సాగిపోయింది.
ఆ దారిలో ఒక రైల్వే ట్రాక్ ఉంది. అక్కడ మాత్రం కొంత దూరం బ్రిడ్జి క్రింద నుండి ఉన్న ఇరుకు దారిలో వెళ్ళాలి. పోను పోను ఆ చుట్టూ పక్కల ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా అదే దారిన వెళ్ళటం మొదలుపెట్టేసరికి ట్రాఫ్ఫిక్ మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంది.
2006 సంవత్సరం ...
ఆ రోడ్ కి రోజు రోజు కి పెరుగుతున్న డిమాండ్ చూసి ప్రభుత్వం వారు ఎంతో విశాల హృదయం తో ఆ రైల్వే బ్రిడ్జి దాటటానికి ఒక ఫ్లై ఓవర్ వేయాలని నిర్ణయించారు.
అక్కడ ఫ్లై ఓవర్ పనులు మొదలు కావటం చుసిన రాంబాబు ఆనందంతో కొన్ని రోజులు గాల్లో తేలిపోతూ ఆఫీసు కి వెళ్ళాడు.
"ఆ ఫ్లై ఓవర్ కాస్తా అయిపోతే... ఇంక అప్పుడు ఆఫీసు కి పది నిముషాల్లో వెళ్లిపోవచ్చు" అనుకున్నాడు.
ఫ్లై ఓవర్ పనులు ఎంత వేగంగా సాగుతున్నాయో... అంతకి 20 రెట్లు వేగంగా ఆ దారిలో ట్రాఫ్ఫిక్ పెరుగుతూ పోయింది. ఆ ట్రాఫ్ఫిక్ వలన హైటెక్ సిటీ దగ్గర ఉన్న సిగ్నల్ వద్ద కూడా జాం అవ్వటం మొదలయింది. రోడ్ వేసిన కొత్తలో 25 నిముషాల్లో ఆఫీసుకి వెళ్ళిన రాంబాబు ఇప్పుడు గంటకి కానీ ఆఫీసు చేరటం లేదు.
2008 సంవత్సరం...
హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర ఉంటున్న ట్రాఫ్ఫిక్ జాం చూసి... ప్రభుత్వం వారు మరింత విశాల హృదయంతో అక్కడ కూడా మరొక ఫ్లై ఓవర్ వేయటం మొదలుపెట్టారు. దాని కోసం అక్కడ కాస్త ట్రాఫ్ఫిక్ డైవర్షన్ జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పటి నుండి రాంబాబు ఇంటి నుండి బయలుదేరిన గంటా ముప్పై నిముషాలకి ఆఫీసు చేరేవాడు.
వర్షా కాలం లో అది ఒక్కోసారి రెండు గంటలు కూడా అయ్యేది.
2010 సంవత్సరం...
"మొత్తానికి ఈ సంవత్సరం అయ్యేలోపు ఈ హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పూర్తయింది... దాని మీద నుండి వెళ్తే ఇప్పుడు నీకు అంత టైం పట్టదేమో కదా ఆఫీసు కి వెళ్ళటానికి" అన్నాడు రాంబాబు పక్క ఇంట్లో ఉండే సోంబాబు.
"మా ఆఫీసు ఆ సిగ్నల్ పక్కనే ఉన్న సైబర్ టవర్స్ లో ఉంది... ఆ ఫ్లై ఓవర్ కింద నుండే నేను ఆఫీసు కి వెళ్ళాలి..." అని బిక్క మొహం పెట్టాడు రాంబాబు.
....
...
...
"తాతా తాతా... మరేమో... ఆ రైల్వే ట్రాక్ దగ్గర కడుతున్న ఫ్లై ఓవర్ అయిపోయిందంట... టీవీ 10 న్యూస్ ఛానల్ లో చెబుతున్నారు" అన్నాడు బాబు.
"ఆ... అయిపోయిందా... అది అయిపోయిందా... ఈ జన్మ లో అది చూస్తాననుకోలేదు... నా చిరకాల కోరిక ఇన్నాళ్ళకి నెరవేరిందా" అని ఆనందంతో చెమర్చిన కళ్ళని తుడుచుకున్నాడు రాంబాబు.
అన్నట్టు అది 2050 సంవత్సరం!!
ఆనందంగా వెళ్లి టీవీ 10 ఛానల్ పెట్టాడు.
టీవిలో ఇంటర్వ్యూ వస్తుంది...
"మన దేశానికి ఇంతటి ప్రతిష్టాత్మకమైన గుర్తింపు తెచ్చారు కదా... దీని మీద మీ స్పందన ఏంటి?" అడిగాడు యాంకర్ R & B అధికారిని.
"నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి గొప్ప సంఘటన నేను పదవిలో ఉండగా జరగటం ఇంకా సంతోషంగా ఉంది" అని తన హర్షం వ్యక్తం చేసాడు ఆ అధికారి.
ఇంతకీ అంతటి ప్రతిష్టాత్మకమైన గుర్తింపు ఏమిటా అని స్క్రోలింగ్ చూసాడు రాంబాబు...
"ప్రపంచంలోనే ఎక్కువ సమయం (44 సంవత్సరాలు) తీసుకుని నిర్మించిన ఫ్లై ఓవర్ గా ఇది గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది"
"భవిష్యత్తులో ఇలాంటి రికార్డ్స్ మరెన్నో సృష్టించి... దేశానికి గొప్ప పేరు తెస్తామని R & D ఉద్యోగులు వ్యాఖ్యానించారు"
...ఇలా సాగిపోతుంది స్క్రోలింగ్!
గమనిక: ఒకవేళ 2050 సంవత్సరానికి కూడా ఆ ఫ్లై ఓవర్ పూర్తి కాకపోతే నాకెటువంటి సంబంధం లేదు. అప్పుడు ఈ పోస్ట్ చదివిన వాళ్ళెవ్వరూ నా మీద కేసు వేయరాదని మనవి.