Friday, March 13, 2009

అనగనగా నా చిన్నప్పుడు...

పోయిన వారం ఊరు నుండి మా పద్మక్క వచ్చింది. ఒక పూట ఇంట్లో అందరం కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే... చిన్నప్పుడు మేము (నేను, అన్నయ్య) వెలగబెట్టిన కొన్ని ఘనకార్యాలు మళ్లీ వెలుగుచూసాయి.

నా చిన్నతనంలో మేము మా ఊరిలో ఉండేవాళ్ళం (అందరూ అలాగే ఉంటారనుకోండి :P). మా ఇంటి చుట్టూ బోలెడు ఖాళీ స్థలం ఉండేది. చిన్నప్పుడు అమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉండేది... అన్నయ్య ఆడుకోవటానికి బయటకి వెళ్తే అమ్మకి చెప్పి వెళ్ళాలి. మా ఇంటి గేటు తీసుకుని వెళ్తే సౌండ్ కి అమ్మ వచ్చి తిడుతుందేమో అని పక్కింట్లోకి దూకేసి వాళ్ళ గేటు నుండివెళ్ళేవాడు. మా ఇంటికి కుడి పక్కన ఉండే గోడ మీద నుండి పక్కింటి బావి గట్టు మీదకి కాలు పెట్టి వాళ్ళ కాంపౌండ్ లోకి వెళ్ళొచ్చు. అచ్చు అలాగే ఇంటి వెనుక ఉండే వాళ్ళ కాంపౌండ్ లోకి కూడా వెళ్ళొచ్చు. సో.. అన్న ఎప్పుడూ పక్కింటి బావి మీదకో వెనక ఇంటి బావి మీదకో వెళ్లి అటు నుండి ఆడుకోవటానికి చెక్కేసేవాడు. నన్ను మాత్రం రానిచ్చేవాడు కాదు... వాడు వెళ్ళేది క్రికెట్ ఆడటానికి కదా మరి... అందుకే నన్ను రానిచ్చేవాడు కాదు. వాడు అలా దొంగతనంగా వెళ్తుంటే చూస్తూ కూర్చునేదాన్ని నేను.


ఒకరోజు ఏదో చిరాకులో ఉండి నాన్నగారు అన్నయ్యని కోప్పడ్డారు. మనోడికి రోషం జాస్తి లెండి... తిట్టారన్న కోపంలో ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు. అప్పుడు వాడికి మహా అయితే ఎనిమిదో తొమ్మిదో ఉంటుంది వయస్సు. ఎప్పుడూ ఒక్కడే ఎక్కడికీ వెళ్ళలేదు (ఆడుకోవటానికి గ్రౌండ్ కితప్ప). సాయంత్రం చీకటి పడుతున్నా వీడు ఇంటికి రాకపోయేసరికి ఇంట్లో అందరికీ ఒకటే కంగారు. వాడు ఆడుకునే గ్రౌండ్ కి వెళ్లి చూసారు... అక్కడ లేడు. ఎందుకో అనుమానం వచ్చి పక్కింటిబావిలో, వెనక ఇంటి బావిలో కుడా చూసారు... లేడు. ఇదంతా 20 సంవత్సరాల క్రితం మాట. మరి అప్పట్లో ఫోన్లు గట్రా లేవు కదా... అందరికీ ఫోన్లు చేసి అడగటానికి. ఊరంతా వెతికాక అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళారు... కొద్ది దూరంలోనే ఉంటుంది ఊరు కూడా. అక్కడికి వెళ్ళేసరికి... వేడి వేడి అన్నంలో కొత్తావకాయ వేసుకుని తింటున్నాడు మన హీరో. తర్వాత ఏం జరిగిందో చెప్పక్కర్లేదు కదా. మనోడికి మళ్లీ కోటింగ్ పడింది :D


ఇలాంటి ఘనకార్యం మన ఖాతాలో కూడా ఒకటి ఉంది. అప్పుడు నాకు మహా అయితే 5 సంవత్సరాలుంటుందేమో వయస్సు. చిన్నప్పుడు నాకు ఒక తమాషా అలవాటు ఉండేది. అన్నం తినిపిస్తుంటే... నోట్లో పెట్టిన ముద్ద నమిలి మింగేయకుండా... బుగ్గన పెట్టుకుని నిద్దరోయేదాన్ని. అలవాటుని అడ్డం పెట్టుకుని, నన్ను చిన్నపిల్లని చేసి.. నాకు అన్యాయం చేయాలనీ చూసారు మాఅమ్మావాళ్ళు. నాకు నోట్లో ముద్ద పెడితే నిద్దరోతా కదా... అలా నన్ను ఇంట్లో వదిలేసి వాళ్ళు సినిమాకి వెళ్ళాలని ఒక కుట్ర పన్నారు. వేసుకున్న ప్లాన్లో భాగంగా నాకు అన్నం తినిపించింది అమ్మ. నేను కూడా నిద్దరోయా. కాని మగత నిద్ర... సో వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి... దాంతో వాళ్ళ కుట్ర నాకు తెలిసిపోయింది. ఇంటి వెనక వాళ్ళంతా మొహాలు కడుక్కుని రెడీ అవుతున్నారు. అమ్మవాళ్ళే నాకు అన్యాయం చేస్తున్నారన్న పచ్చి నిజం సహించలేక నేను చెప్పా పెట్టకుండా అలా నడుచుకుంటూ బయటకి వెళ్ళిపోయాను. వీధి చివరి వరకు నడిచి మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాను... ఎలా వచ్చానో ఎక్కడి
కి వెళ్ళాలో తెలీదు. అలా నడుస్తూ వెళ్తుంటే ఒక షాప్ అతను వచ్చి ఆపాడు. మనం అప్పట్లో చాలా ఫేమస్ లెండి. మా ఇంట్లో కంటే చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళల్లోనే ఎక్కువగా ఉండేదాన్ని. మరి చాలా ముద్దుగా ఉండేదాన్నేమో... అందరూ అలా తీసుకుపోయేవారు వాళ్ళఇంటికి (నిజమేనండి...నమ్మట్లేదా!). అలా షాప్ అతను నన్ను గుర్తుపట్టేసాడు...అతను ఉండేది కూడా మా వీధిలోనే మరి. జాగ్రత్తగా తీసుకొచ్చి మా ఇంట్లో అప్పచేప్పేసాడు. తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు!

కొసరు: మా మామ
య్య కొడుకు ఉన్నాడు... రాకేష్ అని. చిన్నప్పుడు తనకి కూడా తమాషా అలవాటు ఉండేది. తనకి నిద్ర ఎక్కువ... ఎంత ఎక్కువంటే ఎక్కడపడితే అక్కడ అలా పడుకుండిపోయేవాడు. ఒకరోజు ఉన్నట్టుండి తను కనిపించకుండా పోయాడు. మద్యాహ్నం ఆడుకోవటానికని వెళ్ళినవాడు సాయంత్రమైనా ఇంటికి రాలేదు. తనతో ఆడుకునే పిల్లల ఇంటికి వెళ్లి అడిగితే.. వాళ్ళంతా మాకు తెలీదు అనే చెప్పారు. ఎందుకైనా మంచిదని వాళ్ళు ఆడుకునే స్థలానికి వెళ్ళి వెతికారు. తీరా చూస్తే... అక్కడ మనోడు చింత చెట్ట కింద పడుకుని నిద్రపోతున్నాడు. లేపి... 'ఏంటిరా ఇక్కడ పడుకున్నావ్' అని మామయ్య అడిగితే... "దొంగ-పోలీసు ఆట ఆడుకున్నాము... నేను దొంగని... దాక్కోటానికి చెట్టు చాటుకి వచ్చాను... తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు"... అన్నాడంట!

12 comments:

kiraN said...

బాగున్నాయి మీ అన్నా చెల్లెళ్ళ ఆగడాలు.
అందరు పిల్లలకి చిన్నప్పుడు కోపం వస్తే ఇంట్లో చెప్పకుండా వేల్లిపోదాము అనిపిస్తుందేమో :D
ఎందుకంటే నేను కూడా వెళ్ళాను, ఒకసారి భయమేసి ఇంకోసారి కోపమొచ్చి :)



- కిరణ్
ఐతే OK

చైతన్య.ఎస్ said...

దొంగా-పోలీస్ ఆటలో నిద్ర ! హా..హా..సూపర్ :)

నా చిన్నప్పుడు అంతే.. ఎప్పుడు రోడ్డులు సర్వే చేద్దాం అని బయలుదేరిన ఎవరో ఒకరు పట్టుకొచ్చి ఇంట్లొ అప్పగించేసేవారు :(

కొత్త పాళీ said...

హ హ హ.
కూల్

మురళి said...

బాగుంది.. నేను కూడా చాలాసార్లు తప్పిపోదాం అనుకున్నా చిన్నప్పుడు.. కుదరలేదు.. పల్లెటూరు కదా.. బాగా రాశారు..

బ్లాగాగ్ని said...

హ్హహ్హహ్హ! బావుంది. మీ అన్నకేమో కోటింగ్ పడిందని గుర్తుంచుకొని మరీ చెప్పి మీ విషయానికొచ్చేటప్పటికేమో గుర్తులేదంటారా? హన్నా!

చైతన్య కృష్ణ పాటూరు said...

మీ బ్లాగు ఇప్పుడే చూస్తున్నా. చాలా బావుంది. బైదవే నా బ్లాగు పేరు కూడా చైతన్యమే. ఇదే పేరుతో ఇంకొకటి కూడా ఉన్నట్లుంది. నా చిన్నప్పట్నించి ప్రతి క్లాసులోను, నేను కాకుండా చైతన్య అనే పేరుతో ఇంకొకరు మినిమం ఉండేవారు. ఆ ఆనవాయితీ ఇంకా కొనసాగుతున్నట్లుంది :)

చైతన్య said...

@కిరణ్
చిన్నతనం కదా :)

@చైతన్య ఎస్
అప్పుడు ఎవరో ఒకరు అలా అప్పగించి ఉండకపోతే... ఇప్పుడు మనం ఎక్కడ ఉండేవాళ్ళమో!

@కొత్తపాళీ
థాంక్స్ :)

@మురళి
తప్పిపోదాం అనుకున్నారా... నేను మాత్రం తప్పిపోవాలని కాదు కాని... చిన్నతనం వలన అలా పారిపోయాను!

@బ్లాగాగ్ని
హ్హ మరి అన్నీ చెప్పేస్తారేంటి :)

@చైతన్య కృష్ణ
నా బ్లాగ్ మీకు నచ్చినందుకు సంతోషం.
నా చిన్నప్పుడు మాత్రం నేనోకకాట్టినే చైతన్య మా క్లాసు లో. ఏ కొత్త టీచర్ వచ్చినా attendence తీసుకునేప్పుడు "చైతన్య" అని అబ్బాయిల వైపు చూసేది... హుహ్!

శ్రీనివాస్ said...

నేను కూడా చినప్పుడు తప్పిపోదాం అని చాల ట్రై చేశా కాని కుదర లేదు

చైతన్య said...

@శ్రీనివాస్
తప్పిపోదాం అని ట్రై చేసారా... పారిపోదాం అని ట్రై చేసారా... :)
రెంటికీ చిన్న తేడ ఉంది... conscious గా తప్పిపోవటం కుదరదు... పారిపోవటం తప్ప :)

ఉమాశంకర్ said...

బావున్నాయి మీ అన్నా చెల్లెళ్ళ ఆగడాలు ...

geethoo said...

simple n sweet writing. love it.

చైతన్య said...

@ఉమాశంకర్
:)

@VK
thanks!