జీడిపప్పు గారి బేరమాడకండి పోస్ట్ చదవగానే నాకు ఎప్పుడో ఏదో పత్రికలో చదివిన ఒక కథ గుర్తొచ్చింది...
***
ఒక మధ్యతరగతి వ్యక్తి ఆఫీసుకి నడుస్తూ వెళ్తున్నాడు. దారిలో అతనికి రోడ్డు పక్కగా ఏవో కొన్నివస్తువులు పెట్టుకుని అమ్ముకుంటున్న ఒక ముసలివాడు కనిపించాడు. దగ్గరకి వెళ్లి చూస్తే ఆ వస్తువుల్లో ఒక చక్కని అలంకరణ పెట్టె కనిపించింది. ఆ పెట్టె పైన అంతా చక్కగా నగిషీ పని చేసి చాలా అందంగా ఉంది. చూడగానే ఏదో యాన్టిక్ వస్తువు చూసినట్టు అనిపించింది అతనికి. దాని ఖరీదు అందుబాటులో ఉంటే కొందామని ఆ ముసలివాడిని అడిగాడు...
"దీని ఖరీదు ఎంత?"
"500 బాబు"
"మరీ 500 ఆ... ఛాలా ఎక్కువ కదా"
"దాని మీదున్న పనితనం చుడండి బాబు... అదంతాచేయటానికి పడ్డ కష్టం చుడండి బాబు"
"హ్హ మీరు అలాగే చెప్తారులే... మీ సంగతి నాకు తెలిదా ఏంటి..."
"...."
"సరే... 300 కి ఇస్తావా?"
"మరీ అంత తక్కువకి రాదు బాబు..."
"రాదని అంత ఖచ్చితంగా చెప్తున్నావే... అమ్మే ఉద్దేశం లేదా ఏంటి?"
"అమ్మటానికే కదా బాబు ఇక్కడ కూర్చుంది... కానీ మీరు మరీ తక్కువకి అడుగుతున్నారు... ఆ ధరకి అమ్మితే లాభం సంగతి ఏమైనా నాకు దాని విలువ కూడా రాదు బాబు"
"అయితే నువ్వే ఉంచుకో"
అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి.
***
ఆరోజు సాయంత్రం ఇంటికి వస్తూ తిరిగి అదే దారిలో నడుస్తున్నాడు. ఆ ముసలివాడు అక్కడే కూర్చుని ఉన్నాడు.
సరే మళ్లీ ఒకసారి ప్రయత్నిద్దాం అని అక్కడికి వెళ్ళాడు ఈ వ్యక్తి.
"ఏంటి ఆ పెట్టె ఉందా ఎవరికైనా అమ్మేసావా"
"ఉంది బాబు"
"సరే చివరగా చెప్పు ఎంతకి ఇస్తావ్"
"మీరే చెప్పండి బాబు"
"నేను ఉదయమే చెప్పా కదా... 300 అని"
"కనీసం 400 అన్న ఇవ్వండి బాబు"
హ్హ ముసలోడు దారిలోకి వస్తున్నాడు.. అని మనసులో అనుకుని...
"అదేమీ లేదు...300 కి రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను... అమ్మితే అమ్ము లేదంటే లేదు"
అనేసి అక్కడి నుండి వచ్చేయబోయాడు...
"సరే బాబు తీసుకోండి"
"నాకు తెలుసు కదా మీ సంగతి... 300 చేసే వస్తువుని 500 కి అమ్మాలని చూసావ్...ఎందుకయ్యా మీకు మరీ అంత ఆశ"
అన్నాడు జేబులో నుండి డబ్బులు తీస్తూ...
"ఆశ కాదు బాబు... అవసరం... ఆ పెట్టె చేయటానికి ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు... దాని విలువ కన్నా కొద్దిపాటిలాభం మాత్రం వేసుకుని అమ్ముదామని అనుకున్నాను... కాని ఈరోజు ఉదయం నుండి ఒక్క వస్తువు కూడా అమ్ముడుపోలేదు... ఇంటి దగ్గర పిల్లలు ఆకలితో నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు... ఆశగా ఎదురుచూసే వాళ్ళ మొహాలు మర్చిపోలేక... నష్టానికైనా మీకు అమ్మితే.. ఆ డబ్బుతో వాళ్ళ ఆకలి తీరుతుందని ఇస్తున్నా బాబు"
అన్నాడు ఆ ముసలివాడు ఆ పెట్టెని ప్యాక్ చేసి ఇస్తూ...
ఒక్క క్షణం మౌనంగా ఆ ముసలివాడి వైపు చూసాడు ఆ వ్యక్తి...
పీక్కు పోయిన మొహం... లోతుగా ఉన్న కళ్ళు... మాసిన గడ్డం... బక్క చిక్కిన శరీరం...
తను ఎలాంటి వాడి దగ్గర బేరం ఆడాడో తలుచుకుంటేనే తన మీద తనకే కోపం వచ్చింది...
జేబులో నుండి 500 రూ నోటు తీసి ముసలివాడికి ఇస్తూ... ఆ పెట్టె అందుకున్నాడు.
"చిల్లర లేదు బాబు... ఈరోజు మొదటి బేరం మీదే"
"దీని ఖరీదు 500 కదా..."
అని ఒక చిరునవ్వు నవ్వి వచ్చేసాడు ఆ వ్యక్తి.
గమనిక: ఇది నా సొంత రచన కాదు... ఏదో పత్రికలో చదివిన కథ. కథ as it is గా గుర్తులేదు... నాకు గుర్తున్న రీతిలోరాసాను.
12 comments:
:) అద్భుతం గా కాపి కొట్టారు భేష్
అవసరం ముందు ఆశ ఓడిపోయింది.
- కిరణ్
ఐతే OK
బాగుంది...
అవసరం ....అదే కొనేవాడికి అవసరమైతే ....ఎంతకన్నా కొంటారు .పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ లో జరిగేదదే .బావుందండీ కధ .
చైతన్య గారు, మంచి కథను అందించారు. మనం దేశసేవ చేస్తామో లేదో తెలియదు కానీ, కనీసం ఈ మంచి పని చేయగలిగినా చాలు.
chala bagundi..
@శ్రీనివాస్
కాపీ అని నేనే చెప్పా కదా... అయినా మీకు అందులో కాపీ మాత్రమే కనిపించిందా!
@కిరణ్
అవువు... ఆశ ఎప్పుడూ అవసరం కంటే గొప్పది కాదు కదా!
@మురళి, అశోక్
థాంక్స్!
@పరిమళం
అవును... పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో మాత్రం బేరం ఆడాలంటే నామోషీ... ఎంత చెప్తే అంత ఇచ్చేసి వస్తాం... ఇలాంటి వాళ్ళ దెగ్గర మాత్రం మన ప్రతాపం చూపిస్తాం... మధ్యతరగతి మనస్తత్వం...మారటం అంత తేలిక కాదుగా!
@జీడిపప్పు
ఈ కథ చదివి అందరూ మారిపోతారని నేను అనుకోను... కాని చదివినప్పుడు మనం ఎలాంటి వాళ్ళ దగ్గర బెరాలాడతామో గుర్తించగలిగితే మాత్రం సంతోషమే!
చైతన్యం baavundhi brother all the best
చైతన్యం baavundhi chaala chaala
@indianyouth
థాంక్స్ అండి... కాని నేను బ్రదర్ ని కాను... సిస్టర్ ని :)
బాగుంది :)
@చైతన్య
థాంక్స్!
Post a Comment