Monday, March 30, 2009

కుడి ఎడమైతే... పోరపాటేనోయ్!!

గమనిక: ఇది ఎప్పుడో ఎక్కడో చదివిన చిన్న జోకుకి నా పైత్యం జోడించి రాసిన కథ.

సాయంత్రం అయిదైంది.
బుచ్చిబాబు watch వంక చూసి వెంటనే ఫైల్స్ అన్ని మూసేసి ఇంటికి బయల్దేరాడు.
ఇంటికి రాగానే బాగా అలసిపోయినట్టు వేలాడపడిపోయి... సోఫాలో కూర్చుని "కాఫీ" అని ఆర్డర్ చేసాడు.
రెండు నిముషాల్లో కాఫీతో ప్రత్యక్షమైంది బుచ్చిబాబు భార్య భాగ్యం(భాగ్యలక్ష్మి కి బుచ్చిబాబు పెట్టుకున్న ముద్దుపేరు).
కాఫీ అందుకుని తాగుతున్నాడు బుచ్చిబాబు.
"దేశం లో పని మొత్తం మీరొక్కరే చేసి వచ్చినట్టు... అంత పోసు కొట్టాల" అంది భాగ్యం.
అసలే తనేదో బాగా కష్టపడిపోతున్నా అన్న ఫీలింగ్ లో ఉన్న బుచ్చిబాబుకి భాగ్యం మాటలతో చిర్రెత్తుకొచ్చింది.
"కష్టం కాకపోతే మరేమిటి... ఎప్పుడో పుద్దున్నే 10 గంటల కల్లా వెళ్ళాలా ఆఫీసుకి... మళ్లీ ఎప్పుడో సాయంత్రం 5 గంటలకి గాని ఇంటికి రాలేను... ఇంత గొడ్డు చాకిరి చేస్తుంటే... నీకది కష్టంలా కనిపించటంలేదా" అని గయ్ మన్నాడు.
"అబ్బో ఇదీ ఒక కష్టమేనా... ఉదయం నుండి సాయంత్రం దాకా ac లో కూర్చోటమేగా మీరు పొడిచేసే పని" అంది భాగ్యం దెప్పుతున్నట్టు.
"కష్టం అంటే మాది... ఉదయం నుండి గొడ్డు చాకిరీ చేయాలి ఇంటిల్లపాదికి... " అంది మళ్లీ తనే.
"ఆహ... ఏంటో మీరు పడే ఆ కష్టం... ఏవో రెండు కూరగాయలు అలా తరిగేసి కూర చేయటం... రెండు గిన్నెలు తోమటం... అంతే కదా... ఆ చిన్న పనులన్నీ ఉదయమే 11 గంటలకల్లా అయిపోతాయి... తర్వాత మొత్తం ఆ టీవీ లో వచ్చే ఏడుపుగొట్టు సీరియల్స్ చూడటమేగా మీరు పడే కష్టం" అని వాదనకి దిగాడు బుచ్చిబాబు.
"ఏంటి అంత తేలికగా ఉందా మీకు ఇంటి పని అంటే... చేస్తే తెలుస్తది... అది ఎంత కష్టమో... ఊరికే మాటలు చెప్పటం కాదు"
"ఆ పని చేయటం కూడా పెద్ద విషయమేనా... మా ఆఫీసు పని చేయటమే అన్నిటికంటే కష్టం"
"అలాగా... అలా అయితే ఒక రోజు మొత్తం మీరు నాలా ఇంటి పని చేయండి... నేను మీలా ఆఫీసు పని చేస్తాను... అప్పుడు తెలుస్తుంది ఎవరు కష్టపడుతున్నారో" సవాల్ విసిరింది భాగ్యం.
రెండు క్షణాలు ఆలోచించాడు బుచ్చిబాబు...
"ఛ... ఆడవాళ్ళ సవాల్ కి తను వెనక్కి తగ్గితే ఇంకేమన్నా ఉందా... మగాళ్ల పరువు పోదు..." అని మనసులో అనుకుని...
"సరే నేను రెడీ" అన్నాడు.

వెంటనే భాగ్యం తన పతివ్రతా శక్తినంతా కూడగట్టుకుని దేవుడికి పూజ చేసి అప్లికేషను పెట్టింది.

పూజ అయిపోయే సమయానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
"భాగ్యం... ఏమి నీ బాధ... ఈ అప్లికేషను ఏంటి?" అని అడిగాడు దేవుడు
"స్వామీ... నేను, మా అయన సవాల్ చేసుకున్నాం... మీ భక్తురాలు గెలవాలంటే మీరు వెంటనే ఆ అప్లికేషను మీద మీ తదాస్థు సంతకం చేయాలి.." అంది చేతులు జోడించి
దేవుడు అప్లికేషను చదివాడు...
"ఓ... ఒకరోజు మొత్తం నువ్వు మగాడిగా... బుచ్చిబాబు ఆడదానిలా మారాలి... అంతే కదా" అన్నాడు దేవుడు అప్లికేషన్ పరిశీలిస్తూ.
"అంతే స్వామి"
"ఇదీ నీకు కూడా సమ్మతమేనా" అని అడిగాడు దేవుడు బుచ్చిబాబు వైపు తిరిగి
"సమ్మతమే స్వామి..."
"మళ్లీ ఒకసారి బాగా ఆలోచించుకో నాయన..." అన్నాడు దేవుడు బుచ్చిబాబు వైపు జాలిగా చూస్తూ
"లేదు స్వామి... నేను ఎలా అయిన ఈ సవాల్ లో నేగ్గల్సిందే... మీరు సంతకం చేసేయండి" అన్నాడు బుచ్చిబాబు పట్టుదలగా
"సరే నీ ఖర్మ" అని మనసులో అనుకుని దేవుడు తదాస్థు సంతకం చేసేసాడు అప్లికేషన్ మీద.

***

తెల్లవారింది...
బుచ్చిబాబు భాగ్యం రూపంలో ఉన్నాడు... భాగ్యం బుచ్చిబాబు రూపంలో ఉంది.
పొద్దున్నే 5 గంటలకి అలారం గంట కొట్టింది. ఉలిక్కి పడి లేచాడు బుచ్చిబాబు.
అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా అని గొణుక్కుంటూ లేచి... వెళ్లి ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గు పెట్టాడు.
భాగ్యం హాయిగా నిద్రపోతుంది లోపల.
ముగ్గు పెట్టటం అయిపోయాక... పాలు కాయటం, ఇల్లు ఊడవటం, వంటకి కూరగాయలు తరగటం చేస్తున్నాడు బుచ్చిబాబు.
టైం 8 అయింది. భాగ్యం లేచింది బద్ధకంగా.
తను లేచి స్నానం చేసి వచ్చేలోగా... టిఫిన్ రెడీ చేసాడు బుచ్చిబాబు.
టిఫిన్ తినేసి లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీసు కి వెళ్ళిపోయింది భాగ్యం 9 గంటల కల్లా.
ఈలోగా హడావిడిగా పిల్లలని రెడీ చేసి... వాళ్లకి టిఫిన్ పెట్టి, పాలు తాగించి స్కూల్ కి పంపించాడు బుచ్చిబాబు.
అప్పటికే తన ఒంట్లో శక్తి మొత్తం అయిపోయింది... నీరస పడిపోయాడు.
కానీ ఎలా అయిన పందెం నేగ్గాలన్న పట్టుదలతో మళ్లీ శక్తి తెచ్చుకుని ఇంటి పని చేస్తున్నాడు.
పిల్లలు వెళ్ళిపోయాక... ఇల్లు తుడిచేసాడు.
బట్టలు నానపెట్టి... గిన్నెలు తోమాడు.
తర్వాత బట్టలు కూడా ఉతికేసి ఆరేసాడు.
అప్పటికే టైం 12 అయింది.
స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకున్నాడు.
భోజనం టైం అయింది... అప్పుడు గుర్తొచ్చింది బుచ్చిబాబుకి... తను పొద్దున్నుండి ఏమి తినలేదు అని... "హు రోజు టైం కి టిఫిన్, టీ పడేవి కడుపులో... ఏం ఖర్మరా బాబు" అని మనసులో అనుకుని... భోజనం చేసాడు.
కాసేపు నడుం వాలుద్దాం అనుకునే లోగా...
"భాగ్యమక్కా... రేపు మా ఇంటికి చుట్టలోస్తున్నారు... పిండి వంటలు చేయాలి.. కొంచం సాయం పట్టవు" అంటూ వచ్చింది పక్కింటి పంకజం.
తప్పేదేముంది... ఆ పనిలో పడ్డాడు బుచ్చిబాబు.
ఆ పని అయ్యేటప్పటికి 3 దాటింది టైం. పిల్లలు వచ్చే టైం అయింది.
వాళ్ళు రాగానే పాలు తాగించాడు. కొంచం అల్పాహారం తయారు చేసి పెట్టాడు.
వాళ్ళు ఆ టిఫిన్ తినేసి ట్యూషన్ కి వెళ్లిపోయారు.
టైం 5 అయింది.
మళ్లీ ఒకసారి ఇల్లు ఊడ్చి... గిన్నెలు తోమేసాడు.
6 అయింది. భాగ్యం వచ్చింది ఆఫీసు నుండి.
తనకి కొంచం కాఫీ కలిపి ఇచ్చి... సాయంత్రం చేసిన అల్పాహారం పెట్టాడు.
తను అది తినేసి relaxed గా సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంది.
బుచ్చిబాబుకి ఒళ్ళు మండింది... కానీ ఏం చేయలేడు కదా...
లోపలికి వెళ్లి రాత్రి భోజనం తయారు చేసే పనిలో పడ్డాడు.

అలా ఆ రోజంతా క్షణం తీరిక లేకుండా గడిచింది బుచ్చిబాబుకి.

***

తెల్లవారింది...

బుచ్చిబాబు కి ఇంక ఆ పనులు చేయటం వల్లకాలేదు...
వెంటనే దేవుడి దగ్గరికి వెళ్లి... "స్వామీ... 24 గంటల గడువు అయిపొయింది... వెంటనే నన్ను నా పూర్వ రూపానికి మార్చేయండి... ఈ గొడ్డు చాకిరి చేయటం నా వల్ల కాదు... నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను..." అన్నాడు దీనంగా చేతులు జోడించి.
దేవుడు ప్రత్యక్షమయ్యాడు...
"స్వామీ అర్జెంటుగా నన్ను మాములు రూపానికి మార్చేయండి" మళ్లీ అడిగాడు ఆగలేక...
"బుచ్చిబాబు... చిన్న పొరపాటు జరిగిపోయిందయ్యా... మరో 9 నెలల దాక నువ్వు ఈ రూపంలోనే ఉండాలి!"
అని వెంటనే మాయమైపోయాడు దేవుడు.
బుచ్చిబాబు పిచ్చి చూపులు చూస్తూ... భాగ్యం వైపు తిరిగాడు...
విష్ణుమూర్తి లాగా మంచం మీద విలాసంగా పడుకుని... కొంటెగా నవ్వింది భాగ్యం.


Friday, March 27, 2009

విరోధినామ సంవత్సరాది (ఉగాది) శుభాకాంక్షలు


ఎంచక్కా ముందు ఉగాది పచ్చడి తినేసి... ఆ తర్వాత ఇక్కడున్న తెలుగు వంటలన్నీ కూడా కడుపు నిండా తినేయండి...

ఉగాది పచ్చడి


పాయసం


బొబ్బట్లు


పూర్ణాలు (బూరెలు)


పులిహోర


గారెలు



గమనిక: వంటలు మా ఇంట్లో చేసినవి కావు. ఇంటర్నెట్ నుండి తస్కరించబడినవి. కాబట్టి వాటి రుచులు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదని గమనించగలరు.

Wednesday, March 25, 2009

మీరు రెడీనా? ~ Earth Day



http://www.earthhour.org/home/


--

Monday, March 23, 2009

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ - 78వ వర్ధంతి


పేరు: భగత్ సింగ్
పుట్టిన తేది: 27 సెప్టెంబర్, 1907
సొంత ఊరు: ల్యాల్ పూర్, పంజాబ్
మరణం: 23 మార్చ్, 1931




పేరు: శివ రాం హరి రాజ్ గురు
పుట్టిన తేది: 24 ఆగష్టు, 1908
సొంత ఊరు: మహారాష్ట్ర
మరణం: 23 మార్చ్, 1931




పేరు: సుఖ్ దేవ్ థాపర్
పుట్టిన తేది: 15 మే, 1907
సొంత ఊరు: లుథియానా, పంజాబ్
మరణం: 23 మార్చ్, 1931



భగత్ సింగ్ ... స్వాతంత్రోద్యమ కాలంలో యువతకి స్ఫూర్తినిచ్చి వారిలో చైతన్యాన్ని కలిగించిన ఒక అమరజీవి.
స్వాతంత్రోద్యమంలో చివరి దాకా పాల్గొనే అవకాశం లేకపోయినా... భగత్ సింగ్ పోరాటం మాత్రం చాలా కీలకమైనది. అలాంటి వ్యక్తికి తగ్గ గుర్తింపు లభించిందా? గాంధీ గారి జయంతికి సెలవు ఉంది... కానీ భగత్ సింగ్ లాంటి నిజమైన హీరో జయంతి, వర్ధంతి ఎపుడో అసలు మనలో ఎంతమందికి తెలుసు?
అప్పుడెప్పుడో భగత్ సింగ్ జీవితం పైన ఒకేసారి మూడు సినిమాలు వచ్చినప్పుడు తప్ప అతని గురించి జనం మాట్లాడుకున్న సందర్భాలు ఎన్ని?

భగత్ సింగ్ ని ఆరాధించే వాళ్ళలో ఎక్కువ శాతం మంది గాంధీ గారిని ద్వేషిస్తారు. దానికి కారణం... భగత్ సింగ్ చావుకి గాంధీ గారు కుడా ఒక రకంగా కారణం అనే నమ్మకం. ఆ నమ్మకంలో ఎంత వరకు నిజం ఉందో నాకు మాత్రం తెలీదు. కానీ ఎక్కడో నాలో కుడా ఆ నమ్మకం ఉంది. అలా అని గాంధీ గారిని ద్వేషించే వాళ్ళ లిస్టులో మాత్రం నేను లేను.

భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లని ఉరి తీయాలని నిర్ణయించే ముందే బ్రిటిష్ అధికారులు గాంధీ గారితో సంప్రదింపులు జరిపారు. గాంధీ గారు కూడా దానికి అంగీకరించారు అనేది కొంత మంది వాదన. దాని గురించిన వివరాలు మాత్రం నాకు స్పష్టంగా తెలియవు.
కానీ గాంధీ గారు తలుచుకుని ఉంటే తప్పకుండా భగత్ సింగ్ చావుని ఆరోజు ఆపగలిగి ఉండేవారు అని నా నమ్మకం. భగత్ సింగ్ లాంటి యువకులు 'అహింసా' మార్గాన్ని అనుసరించలేరు. వారికి తెలిసిన దారిలో వారు పోరాడుతున్నారు. అలాంటప్పుడు కలిసి ముందుకు సాగలేకపోయినా... ఒకరికి ఒకరు సపోర్ట్ ఇవ్వటంలో మాత్రం తప్పు లేదు కదా! అందరూ పోరాడే లక్ష్యం ఒక్కటే అయినప్పుడు... నా మార్గమే ఒప్పు... మిగిలినవి తప్పు... అని వేరేవాళ్ళని అణగదొక్కాలని చూడటం ఎంత వరకు సమంజసం!

అప్పట్లో యువతలో భగత్ సింగ్ కి చాలా మంచి ఆదరణ లభించేది. యువత మొత్తం భగత్ సింగ్ నే ఆదర్శంగా తీసుకునే వారు. భగత్ సింగ్ పోరాటాం కొనసాగి ఉంటే దేశానికి స్వాతంత్ర్యం ఇంకా త్వరగానే వచ్చేదని కొంత మంది నమ్మకం.
తన కంటే భగత్ సింగ్ కి ఎక్కువ పేరు వస్తుందనే భయం, ఈర్ష్య గాంధీ గారిలో ఉండేవా!?
దేశ స్వాతంత్ర్యం తన వల్లనే సాధ్యం అయిందనే పేరు తనకి మాత్రమే రావాలనే స్వార్ధం ఆయనలో ఉందా!?
భగత్ సింగ్, రాజ్ గురు మరియు సుఖ్ దేవ్ ల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవటానికి కారణం 'ఈర్ష్య', 'స్వార్ధాలే'నా!?

మీకు తెలుసా!?
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లని ఉరి తీసిన తర్వాత... ఆ శవాలని జైలు వెనక గోడలని పగలుకొట్టి రహస్యంగా అటు నుండి బయటకి తరలించారు. లాహోర్ నుండి కొద్ది దూరం తీసుకెళ్ళి అక్కడ కాల్చేసారు. త్వరగా కాలటం కోసం కాల్చే ముందు శవాలని ముక్కలు ముక్కలుగా చేసి కాల్చారట.

మహిళల బ్లాగింగు పై సాక్షి పత్రికలో వచ్చిన ఆర్టికల్

ఈరోజు సాక్షి పేపర్ లో మహిళల బ్లాగింగ్ గురించి వచ్చిన వ్యాసం...
నాకైతే ఈ ఆర్టికల్ అంత ఆకట్టుకునే రీతిలో ఉందని అనిపించలేదు. ఏదో పై పైన వ్రాయాలి కాబట్టి వ్రాసినట్టు అనిపించింది. బహుశా స్థల పరిమితి వలన వ్యాసాన్ని కుదించి ముద్రించారేమో!

Friday, March 20, 2009

వానా వానా వల్లప్ప

అబ్బా... ఏంటి ఎండలు అప్పుడే మొదలయ్యాయి అనుకుంటుంటే... ఉన్నట్టుండి ఈరోజు వర్షం కురిసింది. కానీ అదేదో పాటలో చెప్పినట్టు చుట్టంలా వచ్చి చూసెళ్లిపోయింది. కురిసే వానేదో ఎంచక్కా ఫుల్లుగా కురిసేయోచ్చు కదా!

"వర్షం" - పదంలోనే ఏదో తెలియని ఆకర్షణ ఉందేమో అనిపిస్తుంది. మరి పేరే అలా ఉంటే వర్షం ఇంకెలా ఉంటుంది.
వర్షం కురిసినప్పుడు వచ్చే కమ్మని మట్టి వాసన నచ్చని మనిషి ఉంటాడా అసలు!
నీరెండలో వర్షం కురిసినప్పుడు వచ్చే ఇంద్రధనుసు ఎంత అందంగా ఉంటుంది!
అందుకే వర్షానికి అంతమంది ఫాన్స్. నేనయితే సి.
ఏంటో
... దాన్ని ఎంత చూసినా తనివి తీరదు.

నాకు వానలో తడవటం అంటే భలే సరదా. కానీ చలేసేస్తుంది. వర్షం కొంచం వెచ్చగా పడొచ్చుకదా! అప్పుడు ఎంచక్కా ఎంతసేపైనా తడవొచ్చు! ఏం చేస్తాం... అనుకుంటే జరిగిపోదు కదా!
దేవుడికి కుళ్ళు అనుకుంట. తనేమో మేఘాల కంటే పైనెక్కడో ఉంటాడు మరి... తను తడవలేడు కదా వర్షంలో. అందుకే నన్ను కూడా(మిమ్మల్ని కూడానా?) తడవకుండా చేస్తున్నాడు. తడిస్తే చలి వేయటం, జలుబు, జ్వరం రావటం లాంటి reactions పెట్టాడు. హుహ్.
అందుకే కురిసే వర్షాన్ని అలా చూస్తూ సంతోషపడటమే!

వర్షం గురించి ఎవరో ఎక్కడో చెప్పిన ఒక విషయం గుర్తొస్తుంది... "వర్షం ఎలాంటి భావాన్నైనా ప్రతిబింబించగలదు" అని. నిజమే కదా! మనం సంతోషంగా ఉన్నప్పుడు వర్షాన్ని చూస్తుంటే... ఇంకా సంతోషంగా అనిపిస్తుంది... మన ఆనందం రెట్టింపు అయిందేమో అనిపిస్తుంది. అదే బాధలో ఉన్నప్పుడు వర్షాన్ని చూస్తుంటే మన మనసులోని బాధే అలా వర్షంలా కురుస్తుందేమో అనిపిస్తుంది!
నిజంగానే వర్షం భావాన్నైనా పలికించగలదు! అందుకే అదంటే నాకు బోలెడు ఇష్టం.

***

"వర్షం" మీద నాకిష్టమైన కొన్ని పాటలు: (వరసక్రమంతో సంబంధం లేదు)

> ఈ వర్షం సాక్షిగా (వర్షం)
> ఆకాశ గంగ దూకావే పెంకితనంగా (వాన)
> స్వాతి ముత్యపు జల్లులలో (ప్రేమ యుద్ధం)
> జల్లంత కవ్వింత కావాలిలే (గీతాంజలి)
> ఓ వానా వానా వందనం (అడవి దొంగ అనుకుంట)
> వర్షించే మేఘంలా నేనున్నా (చెలి)
> గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం (స్వయమ్వరం)
ప్రస్తుతానికి ఇవే గుర్తొచ్చాయి. ఖచ్చితంగా ఇంకా ఉండే ఉంటాయి.








Photo Courtesy: Internet

Wednesday, March 18, 2009

ఒకే మాట - ఒకే బాట


ప్రకాష్ కి కొత్తగా పెళ్లైంది.... పెళ్ళయిన కొన్ని రోజులకి తన కాలేజి స్నేహితుడు ప్రసాద్ కలిసాడు...

ప్రసాద్: ఏరా ప్రకాష్ నీకు పెళ్ళంటే ఇష్టం లేదు కదరా... వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు కదా... మరెలా పెళ్లి
చేసుకున్నావురా!

ప్రకాష్: అచ్చు నాలాంటి భావాలే ఉన్న అమ్మాయి కనిపించిందిరా... ఆమెకి కూడా మన వివాహ వ్యవస్థపై నమ్మకం
లేదు... పెళ్ళంటే ఇష్టం లేదు.... ఇద్దరి భావాలూ కలిసాయి కనుక పెళ్లి చేసుకున్నాం.

@Harderwijk_Holland





Friday, March 13, 2009

అనగనగా నా చిన్నప్పుడు...

పోయిన వారం ఊరు నుండి మా పద్మక్క వచ్చింది. ఒక పూట ఇంట్లో అందరం కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే... చిన్నప్పుడు మేము (నేను, అన్నయ్య) వెలగబెట్టిన కొన్ని ఘనకార్యాలు మళ్లీ వెలుగుచూసాయి.

నా చిన్నతనంలో మేము మా ఊరిలో ఉండేవాళ్ళం (అందరూ అలాగే ఉంటారనుకోండి :P). మా ఇంటి చుట్టూ బోలెడు ఖాళీ స్థలం ఉండేది. చిన్నప్పుడు అమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉండేది... అన్నయ్య ఆడుకోవటానికి బయటకి వెళ్తే అమ్మకి చెప్పి వెళ్ళాలి. మా ఇంటి గేటు తీసుకుని వెళ్తే సౌండ్ కి అమ్మ వచ్చి తిడుతుందేమో అని పక్కింట్లోకి దూకేసి వాళ్ళ గేటు నుండివెళ్ళేవాడు. మా ఇంటికి కుడి పక్కన ఉండే గోడ మీద నుండి పక్కింటి బావి గట్టు మీదకి కాలు పెట్టి వాళ్ళ కాంపౌండ్ లోకి వెళ్ళొచ్చు. అచ్చు అలాగే ఇంటి వెనుక ఉండే వాళ్ళ కాంపౌండ్ లోకి కూడా వెళ్ళొచ్చు. సో.. అన్న ఎప్పుడూ పక్కింటి బావి మీదకో వెనక ఇంటి బావి మీదకో వెళ్లి అటు నుండి ఆడుకోవటానికి చెక్కేసేవాడు. నన్ను మాత్రం రానిచ్చేవాడు కాదు... వాడు వెళ్ళేది క్రికెట్ ఆడటానికి కదా మరి... అందుకే నన్ను రానిచ్చేవాడు కాదు. వాడు అలా దొంగతనంగా వెళ్తుంటే చూస్తూ కూర్చునేదాన్ని నేను.


ఒకరోజు ఏదో చిరాకులో ఉండి నాన్నగారు అన్నయ్యని కోప్పడ్డారు. మనోడికి రోషం జాస్తి లెండి... తిట్టారన్న కోపంలో ఇంట్లో చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు. అప్పుడు వాడికి మహా అయితే ఎనిమిదో తొమ్మిదో ఉంటుంది వయస్సు. ఎప్పుడూ ఒక్కడే ఎక్కడికీ వెళ్ళలేదు (ఆడుకోవటానికి గ్రౌండ్ కితప్ప). సాయంత్రం చీకటి పడుతున్నా వీడు ఇంటికి రాకపోయేసరికి ఇంట్లో అందరికీ ఒకటే కంగారు. వాడు ఆడుకునే గ్రౌండ్ కి వెళ్లి చూసారు... అక్కడ లేడు. ఎందుకో అనుమానం వచ్చి పక్కింటిబావిలో, వెనక ఇంటి బావిలో కుడా చూసారు... లేడు. ఇదంతా 20 సంవత్సరాల క్రితం మాట. మరి అప్పట్లో ఫోన్లు గట్రా లేవు కదా... అందరికీ ఫోన్లు చేసి అడగటానికి. ఊరంతా వెతికాక అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళారు... కొద్ది దూరంలోనే ఉంటుంది ఊరు కూడా. అక్కడికి వెళ్ళేసరికి... వేడి వేడి అన్నంలో కొత్తావకాయ వేసుకుని తింటున్నాడు మన హీరో. తర్వాత ఏం జరిగిందో చెప్పక్కర్లేదు కదా. మనోడికి మళ్లీ కోటింగ్ పడింది :D


ఇలాంటి ఘనకార్యం మన ఖాతాలో కూడా ఒకటి ఉంది. అప్పుడు నాకు మహా అయితే 5 సంవత్సరాలుంటుందేమో వయస్సు. చిన్నప్పుడు నాకు ఒక తమాషా అలవాటు ఉండేది. అన్నం తినిపిస్తుంటే... నోట్లో పెట్టిన ముద్ద నమిలి మింగేయకుండా... బుగ్గన పెట్టుకుని నిద్దరోయేదాన్ని. అలవాటుని అడ్డం పెట్టుకుని, నన్ను చిన్నపిల్లని చేసి.. నాకు అన్యాయం చేయాలనీ చూసారు మాఅమ్మావాళ్ళు. నాకు నోట్లో ముద్ద పెడితే నిద్దరోతా కదా... అలా నన్ను ఇంట్లో వదిలేసి వాళ్ళు సినిమాకి వెళ్ళాలని ఒక కుట్ర పన్నారు. వేసుకున్న ప్లాన్లో భాగంగా నాకు అన్నం తినిపించింది అమ్మ. నేను కూడా నిద్దరోయా. కాని మగత నిద్ర... సో వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి... దాంతో వాళ్ళ కుట్ర నాకు తెలిసిపోయింది. ఇంటి వెనక వాళ్ళంతా మొహాలు కడుక్కుని రెడీ అవుతున్నారు. అమ్మవాళ్ళే నాకు అన్యాయం చేస్తున్నారన్న పచ్చి నిజం సహించలేక నేను చెప్పా పెట్టకుండా అలా నడుచుకుంటూ బయటకి వెళ్ళిపోయాను. వీధి చివరి వరకు నడిచి మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాను... ఎలా వచ్చానో ఎక్కడి
కి వెళ్ళాలో తెలీదు. అలా నడుస్తూ వెళ్తుంటే ఒక షాప్ అతను వచ్చి ఆపాడు. మనం అప్పట్లో చాలా ఫేమస్ లెండి. మా ఇంట్లో కంటే చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళల్లోనే ఎక్కువగా ఉండేదాన్ని. మరి చాలా ముద్దుగా ఉండేదాన్నేమో... అందరూ అలా తీసుకుపోయేవారు వాళ్ళఇంటికి (నిజమేనండి...నమ్మట్లేదా!). అలా షాప్ అతను నన్ను గుర్తుపట్టేసాడు...అతను ఉండేది కూడా మా వీధిలోనే మరి. జాగ్రత్తగా తీసుకొచ్చి మా ఇంట్లో అప్పచేప్పేసాడు. తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు!

కొసరు: మా మామ
య్య కొడుకు ఉన్నాడు... రాకేష్ అని. చిన్నప్పుడు తనకి కూడా తమాషా అలవాటు ఉండేది. తనకి నిద్ర ఎక్కువ... ఎంత ఎక్కువంటే ఎక్కడపడితే అక్కడ అలా పడుకుండిపోయేవాడు. ఒకరోజు ఉన్నట్టుండి తను కనిపించకుండా పోయాడు. మద్యాహ్నం ఆడుకోవటానికని వెళ్ళినవాడు సాయంత్రమైనా ఇంటికి రాలేదు. తనతో ఆడుకునే పిల్లల ఇంటికి వెళ్లి అడిగితే.. వాళ్ళంతా మాకు తెలీదు అనే చెప్పారు. ఎందుకైనా మంచిదని వాళ్ళు ఆడుకునే స్థలానికి వెళ్ళి వెతికారు. తీరా చూస్తే... అక్కడ మనోడు చింత చెట్ట కింద పడుకుని నిద్రపోతున్నాడు. లేపి... 'ఏంటిరా ఇక్కడ పడుకున్నావ్' అని మామయ్య అడిగితే... "దొంగ-పోలీసు ఆట ఆడుకున్నాము... నేను దొంగని... దాక్కోటానికి చెట్టు చాటుకి వచ్చాను... తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు"... అన్నాడంట!

Thursday, March 12, 2009

ఆశ - అవసరం

జీడిపప్పు గారి బేరమాడకండి పోస్ట్ చదవగానే నాకు ఎప్పుడో ఏదో పత్రికలో చదివిన ఒక కథ గుర్తొచ్చింది...

***

ఒక మధ్యతరగతి వ్యక్తి ఆఫీసుకి నడుస్తూ వెళ్తున్నాడు. దారిలో అతనికి రోడ్డు పక్కగా ఏవో కొన్నివస్తువులు పెట్టుకుని అమ్ముకుంటున్న ఒక ముసలివాడు కనిపించాడు. దగ్గరకి వెళ్లి చూస్తే వస్తువుల్లో ఒక చక్కని అలంకరణ పెట్టె కనిపించింది. పెట్టె పైన అంతా చక్కగా నగిషీ పని చేసి చాలా అందంగా ఉంది. చూడగానే ఏదో యాన్టిక్ వస్తువు చూసినట్టు అనిపించింది అతనికి. దాని ఖరీదు అందుబాటులో ఉంటే కొందామని ముసలివాడిని అడిగాడు...

"దీని ఖరీదు ఎంత?"
"500 బాబు"
"మరీ 500 ... ఛాలా ఎక్కువ కదా"
"దాని మీదున్న పనితనం చుడండి బాబు... అదంతాచేయటానికి పడ్డ కష్టం చుడండి బాబు"
"హ్హ మీరు అలాగే చెప్తారులే... మీ సంగతి నాకు తెలిదా ఏంటి..."
"...."
"సరే... 300 కి ఇస్తావా?"
"మరీ అంత తక్కువకి రాదు బాబు..."
"రాదని అంత ఖచ్చితంగా చెప్తున్నావే... అమ్మే ఉద్దేశం లేదా ఏంటి?"
"అమ్మటానికే కదా బాబు ఇక్కడ కూర్చుంది... కానీ మీరు మరీ తక్కువకి అడుగుతున్నారు... ధరకి అమ్మితే లాభం సంగతి ఏమైనా నాకు దాని విలువ కూడా రాదు బాబు"
"అయితే నువ్వే ఉంచుకో"
అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వ్యక్తి.

***

ఆరోజు సాయంత్రం ఇంటికి వస్తూ తిరిగి అదే దారిలో నడుస్తున్నాడు. ముసలివాడు అక్కడే కూర్చుని ఉన్నాడు.
సరే మళ్లీ ఒకసారి ప్రయత్నిద్దాం అని అక్కడికి వెళ్ళాడు వ్యక్తి.
"ఏంటి పెట్టె ఉందా ఎవరికైనా అమ్మేసావా"
"ఉంది బాబు"
"సరే చివరగా చెప్పు ఎంతకి ఇస్తావ్"
"మీరే చెప్పండి బాబు"
"నేను ఉదయమే చెప్పా కదా... 300 అని"
"కనీసం 400 అన్న ఇవ్వండి బాబు"
హ్హ ముసలోడు దారిలోకి వస్తున్నాడు.. అని మనసులో అనుకుని...
"అదేమీ లేదు...300 కి రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను... అమ్మితే అమ్ము లేదంటే లేదు"
అనేసి అక్కడి నుండి వచ్చేయబోయాడు...
"సరే బాబు తీసుకోండి"
"నాకు తెలుసు కదా మీ సంగతి... 300 చేసే వస్తువుని 500 కి అమ్మాలని చూసావ్...ఎందుకయ్యా మీకు మరీ అంత ఆశ"
అన్నాడు జేబులో నుండి డబ్బులు తీస్తూ...
"ఆశ కాదు బాబు... అవసరం... పెట్టె చేయటానికి ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు... దాని విలువ కన్నా కొద్దిపాటిలాభం మాత్రం వేసుకుని అమ్ముదామని అనుకున్నాను... కాని ఈరోజు ఉదయం నుండి ఒక్క వస్తువు కూడా అమ్ముడుపోలేదు... ఇంటి దగ్గర పిల్లలు ఆకలితో నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు... ఆశగా ఎదురుచూసే వాళ్ళ మొహాలు మర్చిపోలేక... నష్టానికైనా మీకు అమ్మితే.. డబ్బుతో వాళ్ళ ఆకలి తీరుతుందని ఇస్తున్నా బాబు"
అన్నాడు ముసలివాడు పెట్టెని ప్యాక్ చేసి ఇస్తూ...

ఒక్క క్షణం మౌనంగా ముసలివాడి వైపు చూసాడు వ్యక్తి...
పీక్కు పోయిన మొహం... లోతుగా ఉన్న కళ్ళు... మాసిన గడ్డం... బక్క చిక్కిన శరీరం...
తను ఎలాంటి వాడి దగ్గర బేరం ఆడాడో తలుచుకుంటేనే తన మీద తనకే కోపం వచ్చింది...
జేబులో నుండి 500 రూ నోటు తీసి ముసలివాడికి ఇస్తూ... పెట్టె అందుకున్నాడు.
"చిల్లర లేదు బాబు... ఈరోజు మొదటి బేరం మీదే"
"దీని ఖరీదు 500 కదా..."
అని ఒక చిరునవ్వు నవ్వి వచ్చేసాడు వ్యక్తి.


గమనిక: ఇది నా సొంత రచన కాదు... ఏదో పత్రికలో చదివిన కథ. కథ as it is గా గుర్తులేదు... నాకు గుర్తున్న రీతిలోరాసాను.

Tuesday, March 10, 2009

ఇప్పటికింకా దీని వయస్సు నిండా పదహారే

ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బార్బీ బొమ్మకి నిన్నటితో 50 ఏళ్ళు నిండాయి. ఎప్పటికీ నిత్య యవ్వనంగా కనిపించే బార్బీ బొమ్మకి సంబంధించిన కొన్ని వివరాలు:

పూర్తి పేరు: బార్బరా మిలిసెంట్ రాబర్ట్స్
ముద్దు పేరు: బార్బీ
జన్మదినం: 1959, మార్చ్ 9
జన్మస్థలం: న్యూయార్క్
రూపకర్త: రూత్ హాన్డ్లెర్ (1916 - 2002)
compititor doll : Bratz


పూర్తి వివరాలు




Friday, March 6, 2009

బోడి చదువులు వేస్టు.. మీ బుర్రంతా భోంచేస్తూ

BCA కోర్సు మొదలుపెట్టాక మొదటి batch మాది. సరైన lecturers కూడా ఉండేవారు కారు. సబ్జక్ట్స్ అన్ని MCA వి కావటం వలన ఎక్కువగా ఎవరు దొరికేవారు కారు. MCA చదివినవాళ్ళు సాఫ్ట్వేర్ జాబులకి వెళ్తారు కాని మాకు పాఠాలు చెప్పటానికి ఎందుకు వస్తారు. మాకేమో సబ్జక్ట్స్ అన్ని కొత్తాయే... management, operating systems ఇలాంటి సబ్జక్ట్స్ ఏవి ఇంటర్ వరకు చూడనేలేదు... అసలు కంప్యూటర్ చూసిందే ఇప్పుడు... ఇంకా సబ్జక్ట్స్ ఏం అర్థం అవుతాయి... ఒక్కసారిగా అంతా ఏదో ఫ్రెంచో జపనీసో నేర్చుకుంటునట్టు ఉండేది మాకు.

ప్రతిసారీ ఎగ్జామ్స్ అప్పుడు ఒకే దెగ్గర కలిసి చదువుకోవటం మా ముగ్గురికి (హేమ, సుమ, నేను) అలవాటు.
నాలుగో సెమిస్టరు నుండి అనుకుంటా... ఒక optional సబ్జెక్టు ఉండేది... అందులో ప్రతి చాప్టర్ లోను బోలెడు సైడ్ headings ఉండేవి...
నాకు, హేమకి కొంచం పర్లేదు.. ఎలాగో బట్టి కొడితే గుర్తుండేవి... కానీ మా సుమ కి మాత్రం సరిగా గుర్తుండేవి కాదు... రెండో చాప్టర్ లో headings బట్టి కొట్టేసరికి... మొదటి చాప్టర్ లో నేర్చుకున్నవి మర్చిపోయేది...
ఒకరోజు చాలా ఆనందంగా మా దగ్గరకి వచ్చి 'నాకు అన్ని headings వచ్చేసయిగా' అంది...
మేము 'నిజమా ఏది ఇది చెప్పు చూద్దాం' అని ఏదో ప్రశ్న అడిగాం... కొన్ని క్షణాలు తనలో తనే ఏదో నెమరవేసుకుని... చెప్పేసింది...
తనకి ఏదో టెక్నిక్ తెలిసిందని అర్థమయిపోయింది మాకు... మేము కూడా 'ఎలా ... ఎలా చెప్పేసావ్... మాక్కూడా చెప్పవా... ప్లీజ్...' అని వెంటపడ్దాం..
అది కాసేపు పోస్ కొట్టి... తర్వాత మమ్మల్ని కొట్టి... ఇంకా రెండు chocolates కొట్టేసి అప్పుడు చెప్పింది... ' ఏం లేదు చాలా సింపుల్... అన్ని headings మొదటి అక్షరాలతో ఒక పదం తయారు చేసుకుని అది గుర్తుఉంచుకుంటే సరిపోతుంది... మొదటి అక్షరం గుర్తురాగానే ఆటోమాటిక్ గా heading అదే గుర్తోచ్చేస్తది' అని చెప్పింది.
ఇది మాకు బాగా నచ్చింది... ఇదేదో సులువైన మార్గంలా ఉందని... మేము కూడా అలాగే చదవటం మొదలు పెట్టాం... ఈ టెక్నిక్ హేమ కి కూడా వర్క్ ఔట్ అయింది కానీ నాకు కాలేదు... ఎంత ప్రయత్నించినా అలా మొదటి అక్షరాలతో చేసిన పదం నుండి headings గుర్తుతెచుకోవటం కష్టంగానే అనిపించింది. ఎందుకొచ్చిన రిస్క్ అనుకుని నేను మాములుగానే చదువుకున్నాను.

పరీక్ష రోజు రానే వచ్చింది...
exam రాసి బయటకి రాగానే ఎలా రాసాం అన్నదే మొదటి చర్చ కదా...
మొదట నేను, హేమ బయటకి వచ్చాం...
నేనేమో 'పర్లేదు ఓ మోస్తరుగా రాసాను... కొన్ని headings మర్చిపోయాను, మిగిలినవి రాసాను' అన్నాను.
హేమ 'అవును నేను కూడా అంతే... నాకు ఆ మొదటి అక్షరాల పదం గుర్తురాలేదు... మాములుగా headings గుర్తున్నాయి కొన్ని... అవే రాసాను' అంది.
ఇంతలో మా సుమ వచ్చింది... ఇది ఖచ్చితంగా అన్నీ రాసేసి ఉంటుంది అని ఉత్సాహంగా దాని దగ్గరకి వెళ్లి అడిగాం...
అదేమో అంత ఉత్సాహంగా కనిపించలేదు...
'ఏమైందే... అన్నీ రాసావా లేదా...' అని అడిగాం
'లేదు' అంది సింపుల్ గా
'అదేంటి ఆ మొదటి అక్షరాల పదాలు గుర్తురాలేదా నీక్కూడా నాలాగే' అంది హేమ
'అవన్నీ గుర్తున్నాయి...'
'మరింకా ఏంటి... ఎందుకు రాయలేదు' ఏం అర్థంకాక అడిగాను
'ఆ పదాలే గుర్తున్నాయి... ఆ మొదటి అక్షరాలతో వచ్చే headings గుర్తురాలేదు' అంది సుమ
!!

Wednesday, March 4, 2009

అమ్మో బామ్మ!!

బామ్మగారు తన మనవడితో కలిసి సముద్రపు ఒడ్డున నడుస్తున్నారు. ఉన్నట్టుండి ఒక పెద్ద అల వచ్చి అక్కడ ఉన్న వాటన్నిటిని తనతో తీసుకుపోయింది. బామ్మగారు పక్కకి తిరిగి చూస్తే మనవడు కనిపించలేదు... ఆ పెద్ద అలతో పాటుగా తనూ వెళ్ళిపోయాడు!

2 నిముషాలకి షాక్ నుండి తేరుకున్న బామ్మగారు మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్ధించటం మొదలు పెట్టారు.
"దేవుడా!! నా మనవణ్ణి నాకు తిరిగి ఇచ్చేయ్... దయచేసి ఇచ్చేయ్!"

కొన్ని క్షణాల్లో... మరో పెద్ద అల వచ్చింది. ఈసారి అల తనతో పాటుగా బామ్మగారి మనవణ్ణి వెంటపెట్టుకొచ్చింది.
ఏం జరుగుతుందో అర్థం కానీ ఆ పిల్లాడు అలా చూస్తూ నిల్చుండిపోయాడు.
బామ్మగారు మనవణ్ణి చూస్తూ అంతా తడుముతూ దగ్గరకి తీసుకున్నారు.

2 క్షణాల తర్వాత బామ్మగారు మనవడి వైపు పరీక్షగా చూసి... ఆకాశం వైపు తిరిగి చేతులు జోడించి ఇలా అన్నారు...
"వీడి తలపై ఓ టోపీ ఉండాలి"