Tuesday, July 6, 2010

మౌనమే నీ భాష...!!

ఎక్కడి నుండో మేఘం వచ్చింది...
కుదురుగా ఉన్న కొలనులో... తొలకరి వాన చినుకు పడింది!
అలజడి మొదలైన కొలను ఇంకా కావాలంటూ ఆకాశం వైపు చూసింది...
మేఘానికి కొలను పడుతున్న ఆరాటం నచ్చింది... ఇంకా కురిసింది!
తనలోని చివరి బొట్టు వరకు
కొలను కోసమే కురవాలనుకుంది!

వాన నీటితో కొలను తుళ్ళి పడుతూ అటూ ఇటూ పరుగు తీసింది...
సెలయేరై అటుగా పారుతున్న నదివైపు సాగింది...!
నది వైపు వెళ్ళిపోతున్న కొలనుని చూసి మేఘానికి దిగులుగా ఉంది...
అయినా... తను కొలను కోసమే ఉన్నాననుకుని కురుస్తూనే ఉంది!

అప్పుడప్పుడూ... 'కురవవేం' అని అడిగినట్టు కొలను మేఘం వైపు చూస్తుంది...
ఎదురుచూపే చాలన్నట్టు.. ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నట్టు...మురిసిపోయి కురుస్తూనే ఉంది మేఘం!
మేఘం కురవగానే... తుళ్ళుతూ పారుతూ ఏరై మళ్ళీ నదివైపు పారుతుంది కొలను!
కొలను కోసం పడుతున్న ఆరాటం మేఘంలో తడి తగ్గనివ్వటం లేదు... కురుస్తూనే ఉంది మేఘం!

కాసేపు మేఘం వైపు చూపు... అది కురవగానే...
మేఘం తనని వదిలేయదని నమ్మకంతో... నది వైపు పరుగు!
మెల్లిగా కొలను... ఏరై నదిలో కలిసిపోతుంది...!

నదిలో కలిసిన కొలనుని చూసి... ఇక తన అవసరం లేదనుకున్న మేఘం...
భారంగా అక్కడి నుండి కదిలింది...!

కానీ కొలనుకి తెలుసు... మేఘం లేకపోతే తనకి ఉనికే లేదని!
సాగిపోతున్న మేఘం వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయింది!


Picture Courtesy: Internet

3 comments:

desha raju said...

chala chakkani bhavam and chakkani alochana mariyu rachana. chaala baga nachindandi sir hats off

శివ చెరువు said...

ఇట్స్ బ్యూటిఫుల్ ... ప్రకృతిలోని భావరాగాన్ని..చక్కగా అభివర్ణించారు..

శివ చెరువు said...

Thanks for your wishes. I have cleared the exam with good percentage.