చిరంజీవి "ఇద్దరు మిత్రులు" సినిమా చూసినప్పుడు ఇంకెప్పుడూ సినిమాలు చూడకూడదు అనిపించింది. చిరంజీవి ఏంటి ఇంత చెత్త సినిమా చేసాడు అనుకున్నాను. స్టొరీ మరీ ఓవర్ గా చెప్పాడు అని కూడా అనిపించింది.
కానీ ఈ మధ్య ఎదురవుతున్న కొన్ని సంఘటనలు, అనుభవాలు చూసాక... ఆ సినిమా ఒకసారి మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎంతైనా బయట అందరి జీవితాల్లో జరిగేదే కదా సినిమాల్లో చూపిస్తారు. అంతా కాకపోయినా చాలా వరకు!
ఆ సినిమాలో ఒక అమ్మాయి, అబ్బాయి స్నేహితులుగా ఉంటే వచ్చే చిక్కుల గురించి చూపించారు. ఒకప్పుడు అది అంతా ఓవర్ గా అనిపించినా..ఇప్పుడు అది చాలా వరకు నిజమే అనిపిస్తుంది నాకు. సినిమాలో అంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ కూడా వాళ్ళని, వాళ్ళ స్నేహాన్ని అర్థం చేసుకోలేదని చూపించారు. వాళ్ళు అర్థం చేసుకోగానే కథ సుఖాంతం అయిపోతుంది.
కానీ నిజానికి బయట అలా ఉండదు. ఇలాంటి స్నేహాలు కొనసాగాలంటే కేవలం భార్య భర్తల మధ్య understanding ఉంటే సరిపోదు... చుట్టూ ఉండే జనాలు కూడా అర్థం చేసుకోవాలి.
ఒకప్పుడు కాలేజిలో అమ్మాయి, అబ్బాయి కలిసి నాలుగు సార్లు కనిపిస్తే సరదాగా ఏడిపించటం చూసాను. కానీ ఎంతో చదువుకున్న వాళ్ళు, పెద్ద వాళ్ళు కూడా... ఏమీ తెలుసుకోకుండా అలా కాస్త చనువుగా కనిపించే అమ్మాయి, అబ్బాయిని కలిపి రకరకాల రూమర్స్ ప్రచారం చేయటం ఇప్పుడు చూస్తున్నాను. ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళైనా... లేదా ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైనా అది వాళ్లకి అనవసరం. కళ్ళతో ఏదో చూస్తారు... నోటి దగ్గరకి వచ్చేసరికి దాన్ని మార్చేసి ప్రచారం చేస్తారు. అది ఎదుటి వారి చెవులని చేరేసరికి మరో రకంగా మారిపోతుంది. ఒక మనిషికి తన లైఫ్ కంటే ఎదుటి వారి లైఫ్ అంటేనే ఎక్కువ ఆసక్తి అని ఇలాంటివి చూసినప్పుడు అర్థమవుతుంది! ఎంత కార్పోరేట్ ఆఫీసులు అయినా... ఎంత చదువుకున్న వాళ్లైనా... ఎంత పెద్ద హోదాల్లో ఉన్నా... వాళ్ళు ఆలోచించే నైజం మారదుగా!
నిజానికి వాళ్ళ family వాళ్ళ స్నేహాన్ని అర్థం చేసుకున్నా కూడా... ఇలా పిచ్చి పిచ్చి ప్రచారాలు చేసే పనిలేని జనాల వలన... అటువంటి ప్రచారాల వల్ల కలిగే ఇబ్బందుల వలన... మంచి స్నేహాన్ని వదిలేసుకుంటారు కొంతమంది. ఎవరేమనుకుంటే ఏంటి... తను చేసేది తప్పు కాదని తనకి తెలిసినప్పుడు, అర్థం చేసుకోగల భార్య, లేదా భర్త ఉన్నప్పుడు... ఇలాంటివన్నీ పట్టిచుకోనక్కర్లేదని వదిలేస్తారు మరి కొంతమంది. నా అభిప్రాయంలో అదే కరెక్ట్.
ఆడ, మగ కలిసి కనిపిస్తే చాలు... తప్పుగా అనుకునే వాళ్ళ చీప్ థింకింగ్ కి అంత ఇమ్పార్టన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. కానీ మంచి స్నేహితులు ఎప్పుడో కానీ దొరకరు. అలాంటి పని పాట లేని జనం కోసం అరుదుగా దొరికే విలువైన స్నేహాన్ని వదులుకోవలసిన అవసరం లేదు. After all, we have only one life! Why let someone else decide how should it be?
--
ఈమధ్య ఒక కొత్త చట్టం వచ్చింది కదా. ఇకనుండి ఆడ, మగానే కాదు... ఇద్దరు ఆడవాళ్ళూ లేదా ఇద్దరు మగవాళ్ళు కాస్త చనువుగా కనిపించినా కూడా ఇలాంటి రూమర్స్ వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. మన జనానికి ఇంకో పనేమీ లేదు కదా మరి.