Friday, June 25, 2010

అదీ సంగతి!

సరిగ్గా సంవత్సరం క్రితం...
మా టీం అంతా హోల్లాండ్ లో ఉన్నప్పుడు, కంపెనీ కిక్ ఆఫ్ మీటింగ్ మెయిల్ వచ్చింది. మొత్తం అన్ని దేశాల్లోని బ్రాంచెస్ లో ఒకేసారి పెట్టారు ఆన్లైన్ కాన్ఫరెన్స్ ఉపయోగించి.
అక్కడి సమయం ప్రకారం, సాయంత్రం 4 గంటలకి మీటింగ్ మొదలవుతుంది. ఒక 3 గంటల మీటింగ్ తర్వాత డిన్నర్ ఉంటుంది అని చెప్పారు.
అందరం కలిసి ఒక dutch కల్లీగ్ తో అతని కార్ లో మీటింగ్ ఏర్పాటు చేసిన హోటల్ కి వెళ్ళాము.

మీటింగ్ మొదలయ్యే ముందే కొంచం స్నాక్స్ ఏర్పాటు చేసారు. తర్వాత మీటింగ్ మొదలయ్యింది. దాదాపు మూడు గంటలసేపు అయినా ఇంకా కొన'సాగుతుంది'. అంతలో మాతో వచ్చిన ఇండియన్ టీం మేట్ ఒకతను రెస్ట్ రూం కి వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళాడు. అతని బాగ్ నా చేతికి ఇచ్చి వెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే... మీటింగ్ అయిపోయింది. అందరం డిన్నర్ హాల్ కి వెళ్ళిపోయాం.
డిన్నర్
చేసేంతసేపు అతని కోసం చూసాం కాని కనిపించలేదు. కంపెనీ జనం అందరు ఉండటం వలన, వాళ్ళలో ఎక్కడో ఉండే ఉంటాడులే అని పెద్దగా పట్టించుకోలేదు. నెమ్మదిగా ఒక్కొక్కరు వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. చివరికి మా టీం మాత్రమే మిగిలింది అక్కడ. మాకు ఏం చేయాలో తెలియటం లేదు. అతని దగ్గర మొబైల్ కూడా లేదు. అందరికి ఒకటే టెన్షన్... ఎంతైనా పరాయి దేశం కదా మరి. బాగ్ కూడా మా దగ్గరే ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయే అవకాశం లేదు.
ఎందుకో సడన్ గా అనుమానం వచ్చింది... రెస్ట్ రూం కి వెళ్ళాడు కదా... పొరపాటున అక్కడ లాక్ అయిపోయాడేమో అని! వెంటనే అందరం తలా ఓ వైపు వెళ్లి ఆ హోటల్ లో ఉన్న రెస్ట్ రూమ్స్ అన్ని వెతికాం. ఎక్కడా కనిపించలేదు.
రిసెప్షన్ దగ్గరకి వచ్చి అనౌన్స్మెంట్ ఇప్పించాం... ఎక్కడ ఉన్నా అది విని వస్తాడేమో అని. అయినా లాభం లేదు. అంతలో ఒక dutch కల్లీగ్ కనిపిస్తే ... అతని ఫోన్ నుండి మా గెస్ట్ హౌస్ నెంబర్ కి కాల్ చేసాం... ఒకవేళ వెళ్లిపోయాడేమో అని. ఎవరూ లిఫ్ట్ చేయలేదు.... అంటే ఆతను ఇంకా ఇంటికి వెళ్ళలేదు అన్నమాట. మరి ఏమయిపోయినట్టు!?
కొంచం కొంచంగా అందరిలో భయం, టెన్షన్ పెరుగుతుంది.
ఆ చుట్టుపక్కలంత రోడ్స్ కూడా వెతికి వచ్చాం. ఎక్కడా కనిపించలేదు. చివరికి ఏం చేయాలో అర్థం కాక... ఆ హోటల్ రిసెప్షన్ దగ్గరకి వెళ్లి లాప్ టాప్ ఓపెన్ చేసి అతని ఫోటో చూపించాం. ఒక కవర్ లో కొంత డబ్బు పెట్టి దాని పైన ఆతను పేరు, నా పేరు రాసి... "ఈ ఫోటోలో అతను వస్తే,ఈ కవర్ ఇవ్వండి" అని వాళ్లకి అర్థమయ్యే భాషలో చెప్పి బయటపడ్డాం. అతని బాగ్ కూడా మా దగ్గరే ఉండటం వలన (ఆ బాగ్ లోనే అతని పర్స్ ఉంది) అతను ఇంటికి ఎలా చేరుకుంటాడా అని మా బాధ.

ఆలోచిస్తూ నెమ్మదిగా ఏదో బస్ పట్టుకుని ఇంటి దగ్గర దిగాం. అంతసేపు ఎవరి మొహంలో జీవం లేదు. అందరికి ఒకటే భయం... అతనేమయిపోయాడో అని.
అలా కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్లి చూస్తే... అతను అక్కడే ఉన్నాడు. హ్యాపీ గా టీవీ చూస్తూ ఏదో డ్రింక్ తాగుతూ కుర్చుని ఉన్నాడు. మమ్మల్ని చూడగానే 'ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అందరు?' అని అడిగాడు. అంతే... ఒక్క క్షణం అందరం ఒకరి మొహాలు ఒకరం చూసుకుని... అందరం కలిసి అతని మీద ఎటాక్ చేసాం!
ఎందుకు చెప్పకుండా వచ్చేసావ్ అని అడిగితే... డిన్నర్ ఉందని అతనికి తెలియదట... మేమెవ్వరం కనిపించలేదని... మేము ఇంటికి వచ్చేసాం అనుకుని వచ్చేసా అని చెప్పాడు. అంతమందిమి అతనొక్కణ్నే వదిలేసి... అతని బాగ్ కూడా తీసుకుని మేము ఇంటికి వచ్చేసాం అని అనుకున్నాడట! మేమైతే నమ్మలేదు మరి!

"Different people think in different ways" అంటే ఇదేనా!?


Photo courtesy: Internet.