ఎందుకో తెలీదు కానీ... ఈ పాట వినగానే బాగా నచ్చేసింది. రెండు రోజుల నుండి అదే పనిగా వింటూనే ఉన్నాను. విన్నకొద్దీ వినాలనిపిస్తుంది.
సిరివెన్నెల గారి మహత్యం ప్రతి పదంలోనూ కనిపిస్తుంది. కార్తీక్ గొంతులో ఉన్న మేజిక్ కూడా తోడయింది.
పాట వింటుంటే... చాలా చెప్పాలనిపిస్తుంది కానీ... ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం సిరివెన్నల గారి గురించి!
ఒక ఇళయరాజా... ఒక ఏసుదాస్... ఒక సిరివెన్నెల.
అంతకన్నా ఏం చెప్పగలం!
***
ఎందుకు ఎందుకు ఎందుకు నను పరిగెత్తిస్తావెందుకు
ఆకలి తీర్చని విందుకు నన్నాకర్షిస్తావెందుకు
దరికి రానీక నింగి శశిరేఖ
పొదువుకోనీక వదులుకోనీక
ఇంతగా చితిమంటలా నన్నంటుకోవాలా
సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు ||
పాలనవ్వుల రూపమా నను తాళనివ్వని తాపమా
దారి చూపని దీపమా జత చేరనీయని శాపమా || పాలనవ్వుల ||
తళతళ తళతళ కత్తుల మెరుపై కళ్ళను పొడిచేలా
తెరవని తలుపై తెలియని మలుపై కలవరపరిచేలా
నువ్వు నా సొంతమనే అత్యాశ అలిసేలా
నేనెంత ఒంటరినో ఒట్టేసి తెలిపేలా
జంటగాని జంటలా నా వెంట నడవాలా
సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు ||
నీవు నింపిన ఊపిరే నా గుండె దహిస్తుంటే ఎలా
నీవు పెంచిన ఆశలే నరనరాన్ని కోస్తుంటే ఇలా || నీవు నింపిన ||
సలసల మరిగే నిప్పుల మడుగై నెత్తురు ఉడికేలా
నిలువున నీలో కరగని కోరిక విలవిలలాడేలా
ఒక్క పుట్టుకలోనే ఇన్నిన్ని మరణాలా
ఎంత దగ్గర ఉన్నా దక్కని వరమాల
నన్నిలా ఉరితాడుతో ఉయ్యాలలూపాలా
సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా సౌందర్య జ్వాలా || ఎందుకు ||
చిత్రం: నేను (2004)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్ర్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కార్తిక్