
నే చూసేసానోచ్చ్!!
హమ్మయ్యా... నేను చూసేసాను. మాయా బజార్ కలర్ ఫొటోస్ లో సావిత్రి గారిని చూడగానే ఎలా అయినా సరే ఈ సినిమా చూసి తీరాల్సిందే అనుకున్నాను. చూసేసాను.
నిన్న సాయంత్రం ఫస్ట్ షో కి వెళదామనుకుంటే టికెట్స్ దొరకలేదు. ఎంత పెద్ద క్యు నో! కానీ ఎందుకో టికెట్స్ దొరక్కపోయినా ఆ ధియేటర్ అలా జనాలతో నిండిపోవటం చూసి ఆనందమేసింది. మళ్ళీ సెకండ్ షోకి ట్రై చేస్తే దొరికాయి. ఆ షో కూడా హౌస్ ఫుల్. భలే సంతోషమేసింది. ఇప్పుడు వచ్చే చెత్త సినిమాల మధ్య, మన జనాలు ఇంకా ధియేటర్ కి వచ్చి మాయ బజార్ చూస్తున్నారంటే... సంతోషమేగా మరి!
టైటిల్ పడగానే అరుపులు... ఈలలు! అస్సలు ఊహించలేదు నేను. ఈ సినిమాని కూడా జనం ఇలా ఎంజాయ్ చేస్తారని.
చిన్నారి శశిరేఖ ఎంత బాగుందో! ఆ అమ్మాయిని అంతగా ఎప్పుడూ గమనించలేదు నేను. ఎంత బాగా పెట్టిందో భావాలు ముఖంలో!
ఎన్ టి ఆర్ గారు కనపడగానే మళ్ళీ అరుపులు, ఈలలు. కృష్ణుడంటే ఆయనే కదా! ఎంతటి ప్రశాంతత ఆ వదనంలో! చూస్తుంటే నిజంగానే దేవుణ్ణి చూసిన భావన కలుగుతుంది!
సావిత్రి గారూ కనపడగానే మళ్ళీ అ...లు, ఈ...లు! కానీ సావిత్రి గారిని చూడటానికి మాత్రం రెండు కళ్ళూ సరిపోలేదు. హబ్బబ్బా ఎంత అందంగా ఉన్నారో! నా దిష్టే తగులుతుందేమో అనిపించింది. అసలే ఆవిడ ఆ వయసులో నటించిన ఏ సినిమా కూడా కలర్ లో లేదేమో... మొదటిసారి ఆవిడని అలా కలర్ సినిమాలో చూస్తుంటే... అలా చూస్తూనే ఉండాలనిపించింది.
ఇంతలో ఏ ఎన్ ఆర్ గారు వచ్చి "నీవేనా..." అని పాట అందుకోగానే మళ్ళీ అ...లు, ఈ...లు!
మేక్ అప్ కూడా చాలా నీట్ గా చేసారు. చూడముచ్చటగా ఉన్నారు అందరూ. కాకపోతే చూడగానే ఆ బంగారు ఆభరణాల రంగు కాస్త ఎక్కువయ్యిందేమో అనిపించింది... అన్నీ మెరుస్తూ dominating గా కనిపించాయి. కానీ కాసేపు అలా చూడగానే కంటికి అలవాటయిపోయింది. సినిమాలో మునిగిపోయి ఇంకా అవేమీ గమనించే స్థితి లేదు.
"భళి భళి భళి భళి దేవా" పాట కట్ అయిపోయింది... కానీ ఎడిటింగ్ నీట్ గా చేసారు. అక్కడ ఆ పాట ఉంటుందని తెలియని వాళ్ళకి కట్ చేసినట్టు తెలియదు. ఫిలిం negative పాడయిపోయి ఆ పాట మూవీ లో కట్ చేయాల్సి వచ్చిందని ముందే తెలుసు కాబట్టి, పెద్దగా ఏమి అనిపించలేదు. కానీ దానితో పాటు ఇంకో పాట కూడా అలాగే కట్ చేసాము అన్నారు... అదేంటో మరి... అనుకుంటూ చూసాను. తర్వాత అర్థమయ్యింది...అది "చూపులు కలిసిన శుభవేళ" పాట అని :( .
ఇంతలో మన ఘటోత్కచుడు గారు రానే వచ్చారు. మళ్ళీ అ...లు, ఈ...లు. హబ్బ... ఎస్ వి ఆర్ గారిని చూడాలంటే మళ్ళీ రెండు కళ్ళూ సరిపోలేదు! అసలు మాయ బజార్ కి సావిత్రి గారు, ఎస్ వి ఆర్ గారు రెండు కళ్ళు.
మాయా శశిరేఖ రూపంలో సావిత్రి గారి నటన, హావభావాల గురించి ఎంతని చెప్పగలం!
ఇంతలో మళ్ళీ అ...లు, ఈ...లు... మన లక్ష్మణ కుమారుడు వచ్చారు మరి. "సుందరి నీ వంటి" పాటలో రేలంగి గారిని చూస్తుంటే భలే అనిపించింది.
చివరి భాగంలో మన ఘటోత్కచ సైన్యం తసమదీయులకి చేసే మర్యాదలు చూసి... హాలంతా చిన్నపిల్లలా నవ్వులతో నిండిపోయింది.
మొత్తం సినిమాని పెద్దలు, పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు. ఇది ఒక కామెడీ సినిమా అని అప్పుడే బాగా అర్థమయ్యింది నాకు!
ఆ సినిమాలో నటించిన మెయిన్ ఆర్టిస్టూల్లో ఎ ఎన్ ఆర్ గారు మాత్రమే ఉన్నారు ఇప్పుడు. కానీ సినిమాలో నటించిన సైడ్ ఆర్టిస్ట్స్, జునియర్ ఆర్టిస్ట్స్ లో ప్రస్తుతం ఎంత మంది ఉన్నారో మనకి తెలిదు. వాళ్ళంతా ఈ సినిమా చూస్తూ ఎంత సంతోషించి ఉంటారో కదా!
70 mm చేయటం వలన... బొమ్మ పైన, క్రింద కొద్దిగా కట్ అయింది. కొన్ని frames లో ఆ లోపం క్లియర్ గా తెలుస్తున్నా... ఓవరాల్ గా చాలా బాగా maintain చేసారు.
1957 నాటి అద్భుతాన్ని మళ్ళీ ఇంత చక్కగా, అద్భుతంగా రంగుల్లో మన ముందు ఉంచిన గోల్డ్ స్టోన్ టెక్నోలజీస్ వారికి నిజంగా కోటి దండాలు!
కొ.మె: "విజయా" వారి చిత్రాల్లో చంద్రుడికి ఉండే ప్రాముఖ్యత గురించి అందరికీ తెలుసు. కాకతాళీయమైనా... ఈ నయా మాయా బజార్ రిలీజ్ అయిన 30 తారీఖు నాడు, ఆకాశంలో చంద్రుడు పెద్దగా కనిపిస్తూ 15 రెట్లు అధికంగా వెన్నెల వెలుగులు విరజిమ్మటం నిజంగా అద్భుతం. (ఈ వార్త "సాక్షి" దినపత్రిక లోనిది.)
